తాజా వార్తలు

Monday, 31 August 2015

పండ్లతొక్కలోనే ఉంది అంతా..

అరటిపండు తింటూ తొక్కనీ, దోసకాయ వండుతూ చెక్కునీ తీసి పారేయడం అలవాటు. కానీ అసలు విషయమంతా వాటిల్లోనే ఉంది అంటున్నారు పోషకాహార నిపుణులు. పండ్లలో అసలు కంటే కొసరుగా ఉండే చెక్కులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని అధ్యయనాలూ వెల్లడించాయి. ఆ వివరాలు తెలుసుకుంటే, తీసి పారేసే వాటితో విభిన్న వంటకాలను ప్రయత్నించొచ్చు. పోషకాలనూ పొందవచ్చు. రోజుకో ఆపిల్‌ తింటే వైద్యుడిని కలవాల్సిన అవసరం లేదని చెబుతారు. అందుకేగా, యాపిల్‌తో చేసిన డ్రింక్‌లూ, జ్యూస్‌లూ తాగుతున్నాం అనకండి! అందరూ అనుకొనేట్టు యాపిల్‌ గుజ్జులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉండవు. గుజ్జులో కంటే తొక్కలో ఐదురెట్లు ఎక్కువ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని అధ్యయనాలు తెలిపాయి. జర్నల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ కెమిస్ట్రీ అధ్యయనం ప్రకారం, యాపిల్‌ తొక్కులో రొమ్ము, కాలేయం, పెద్ద పేగు క్యాన్సర్లను నయం చేసే శక్తి ఉంది. జ్యూస్‌ తాగడం కన్నా యాపిల్‌ని కొరుక్కు తినడం వల్లే ఎక్కువ మేలు. చర్మం నిగనిగకు, చిగుళ్ల సంరక్షణకు ఉపయోగపడే శక్తివంతమైన పాలీఫినాల్స్‌ ఎక్కువగా పొందగలం కూడా. ఇక, పుల్లని నల్ల ద్రాక్షల విషయానికొస్తే, చాలామంది యథాతథంగా తినకుండా చక్కెర కలిపిన జ్యూస్‌గా తాగుతారు. రుచి బాగుంటుంది. కానీ రసం తీసి వడ కట్టినప్పుడు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండే చెక్కులో పాతిక శాతం వినియోగించుకోలేకపోతాం. దాంతో కొలెస్ట్రాల్‌ నిరోధక గుణాలనీ కోల్పోతాం. జామకాయలు మరీ పచ్చిగా ఉన్నా, పూర్తిగా పండినా ఏం చేస్తాం… ముక్కలుగా కోసం మధ్యలో ఉండే మెత్తని గుజ్జుని తినేస్తాం. కానీ ఇది సరికాదు. దీనివల్ల యాంతోసియానిన్‌ అనే క్యాన్సర్‌ నియంత్రణ కారకాన్ని పొందలేము. బీరకాయలని పప్పుతో కలిపి వంటకాలను చేసుకోవచ్చు. అంతటితో సరిపెట్టుకోకుండా బీర చెక్కుని పారేయకుండా దానితో తీయగా, పుల్లగా ఉండే పచ్చడి చేసుకోవచ్చు. బీరకాయలతో పోలిస్తే, దాని పొట్టులో పోషకాలు అధికం. దాన్నుంచి లభించే పీచు మలబద్దకాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తుంది. అధిక కెలొరీలు, చక్కెరలు, కొవ్వుల ప్రమాదం ఉండదు. సొరకాయలు, లేత అరటి కాయల పొట్టుతోనూ పచ్చళ్లు చేసుకోవచ్చు. అవీ ఆరోగ్యానికి ఉపకరించేవే. దోసకాయ పప్పు, కూరలు చేసేప్పుడు సాధారణంగా చెక్కు తీసేస్తారు. దోస ఆవకాయకి మాత్రం ఉంచుతాం. దోస చెక్కులో పీచు అపారం. చక్కటి కంటిచూపునకు ఉపయోగపడే విటమిన్‌ ‘ఎ’, బీటా కెరొటిన్‌ దీన్నుంచి లభ్యమవుతాయి. చిలగడ దుంపల్ని ఉడకబెట్టినప్పుడు పై పొట్టు తీసేసి తినడం చాలామందికి అలవాటు. కానీ ఈ తీసేసే వాటిల్లో రక్తహీనతను తగ్గించే ఇనుము, వ్యాధి నిరోధక శక్తిని పెంచే జింక్‌ పోషకాలుంటాయి.

« PREV
NEXT »

No comments

Post a Comment