తాజా వార్తలు

Sunday, 30 August 2015

డిప్యూటీ సి.ఎం కే.ఇ పని కాళీయేనా...?
భూసేకరణ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు డిప్యూటీ సి.ఎం కే.ఇ కృష్ణమూర్తి. ఆయన మాటలు తూటాల్లా పేలాయి. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. చంద్రబాబు, కే.ఇల కు మధ్య వ్యవహారం బెడిసి కొట్టిందనే వార్తలు గుప్పు మన్నాయి. ఇంకేముందీ ఈ వాక్త టీడీపీలోను కలకలం రేపింది. రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు. తెల్లారేసరికి తాను అన్నమాటల పై వెనక్కు తగ్గారు కే.ఇ కృష్ణమూర్తి. ఈ లోపు సి.ఎం చంద్రబాబుతో పాటు..కొందరు మంత్రులు మాట్లాడటమే ఇందుకు కారణమంటున్నారు. 

పార్టీలో సీనియర్ మంత్రినైన తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని తరుచు కే.ఇ అనుచరుల ముందు వాపోయినట్లు తెలుస్తుంది. ఇప్పుడే కాదు గతంలోను చాలా సార్లు కే.ఇ వ్యంగోక్తులు విసిరేవారు. మంత్రి వర్గంలోని సభ్యులకు ఒక్కో జిల్లా అప్పగించనప్పుడు ఇలానే తిరుగుబాటు బాట మాటలు మాట్లాడారు. తన వయసు సహకరించదనే కారణంతో పక్కన పెట్టి ఉంటారు. అందుకే జిల్లా ఇంఛార్జ్ గా బాధ్యతలు అప్పగించలేదన్నారు. నేను సరిపోనేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు డిప్యూటీ సి.ఎం. కే.ఇ. కే.ఇని కాదని మిగతా వారికి జిల్లాల బాధ్యత అప్పగించారు అప్పుడు. అంతెందుకు కర్నూలు జిల్లాలో అధికారులు తన మాట వినకుండా చంద్రబాబు, యువనేత లోకేష్ లు కట్టిడి చేస్తున్నారనే విమర్శలు ఆయన అనుచరులు చేశారు. 

కర్నూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న సోమిశెట్టి వెంకటేశ్వర్లును పక్కన పెట్టి శిల్పా చక్రపాణికి కట్టబెట్టిన సందర్భంలోను ఆయన  కే.ఇ వర్గీయులు ఆవేశ పడ్డారు. సోమిశెట్టి తన అనుచరుడు అన్న కారణంతో పక్కన పెడ్డటం పట్ల రగిలిపోయారు కే.ఇ. ఇదే విషయమై బయటకు చెబితే బాగుండదని ఊరుకున్నారట. అంతే కాదు గోదావరి పుష్కరాల సమయంలోను తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని కే.ఇ అసంతృప్తిగా ఉన్నారట. 

అంతే కాదు రాజధాని నిర్మాణ పనులు అంతా మంత్రి నారాయణ చూస్తున్నారని తనకు తెలియదని చెప్పారు కే.ఇ. భూసేకరణ విషయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అమరావతి రాజధాని భూసేకరణకు తన శాఖకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మంత్రి నారాయణ అంతా చూసుకుంటున్నారు. దాని పై నేను ఎలాంటి కామెంట్ చేయలేనన్నారు. అంతే కాదు రైతులు భూములు ఇచ్చేందుకు సిద్దంగా లేనప్పుడు బలవంతం చేయడం సబబు కాదన్నారు. గ్రామ కంఠాలు రైతుల కింద ఉన్నప్పుడు వారికి ఆ భూములకు సంబంధించిన హక్కులు చెందుతాయన్నారు కే.ఇ. రెవిన్యూ శాఖ మంత్రి అయిన తనకే తెలియకుండా పనులు జరుగుతాయని చెప్పారు. ఒకరి శాఖలో మరోకరు జోక్యం చేసుకోవడమే కాదు..అన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించడాన్ని కే.ఇ కృష్ణమూర్తి తట్టుకోలేకపోతున్నారనే వాదనుంది.  
నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టారు సి.ఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో తనకు ఆర్థికంగా సాయం చేశాడనే కారణమే తప్ప మరోకటి లేదని చర్చ అప్పుడు తెరపైకి వచ్చింది. దాన్ని టీడీపీ శ్రేణులు ఖండించినా వాస్తవం ఏంటదనే ప్రజలకు తెలియంది కాదు.

తాజాగా భూసేకరణకు సంబంధించిన జీవో జారీ చేసే విషయంలో నారాయణ వర్గీయుల నుంచి కే.ఇకి ఒత్తిడులు వచ్చాయనే చర్చ సాగుతుంది. రాజకీయాల్లో గట్టిగా ఓనామాలు తెలియని వ్యక్తి చంద్రబాబు కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చిన తనను ఆదేశిస్తారా అంటూ కే.ఇ రుసరుసలాడుతున్నారట. గతంలోనే చంద్రబాబు పని తీరు అసంతృప్తి వెళ్లగక్కిన కే.ఇ మరోసారి అదే బాటపట్టడంతో ఏం చేయాలబ్బా అని సీనియర్లు తల బాదుకుంటున్నారట. ఇలాంటి సమయంలో విపక్షాలకు అస్త్రం అందించే పరిస్థితి ఇవ్వదని వారు చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పుడు స్పందించక పోతే తమ పరిస్థితి దారుణంగా ఉంటుందని కే.ఇ తన అనుచరులతో చెప్పారని తెలుస్తుంది. 
శ్రీశైలం జలాలను తాగునీటి కోసం అటు ఆంధ్ర, తెలంగాణలకు తరలిస్తున్నారు. మరి రాయలసీమ సంగతి పట్టించుకోరా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు ఏం మాట్లాడారో తెలియదు.కానీ రాయలసీమకు రూ. 1లక్ష కోట్లు కావాలని కోరారు. 

ఇదంతా నిన్నటి మాట. నేడు అదే డిప్యూటీ సి.ఎం ఇప్పుడు తాను అన్న మాటలను వక్రీకరించారని ఆరోపించారు. మంత్రి నారాయణతో తాను విభేదించలేదని చెప్పారు. అదే సమయంలో సి.ఎం చంద్రబాబు నాయుడు పనితీరు పై తనకు సంపూర్ణ విశ్వాసముందన్నారు. ఇంతలో ఎంత మార్పు. గట్టిగా మాట్లాడలేని పరిస్థితుల్లో టీడీపీ సీనియర్ నేతే ఉన్నారా అనే చర్చ సాగుతుంది. అదే జేసీ దివాకర్ రెడ్డి అయితే ఇలా వెనక్కు తగ్గేవాడా అనే చర్చ టీడీపీలో సాగుతుంది. ఎక్కడ తగ్గాలా..ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే రాజకీయ నాయకుడు. ఆ విషయంలో కే.ఇ కృష్ణమూర్తికి తెలిసినంతగా మరొకరు తెలియదు. కాబట్టి కే.ఇని విమర్శించ వద్దని చెబుతున్నారు ఆయన అనుచరులు. వ్యూహాత్మకంగానే ఎదురు దాడి చేశారని తర్వాత వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారంటున్నారు వాళ్లు. 
ఓహో రాజకీయాలంటే ఇలానే ఉంటాయి కాబోలు అంటున్నారు జనం. 
« PREV
NEXT »

No comments

Post a Comment