తాజా వార్తలు

Monday, 31 August 2015

ప్రజలే మాకు ముఖ్యం..' కామెడీ చేస్తున్న చంద్రబాబు !!

దేశంలో రాజకీయ పార్టీలు అధికారం కోసం పనిచేయవా.? కేవలం ప్రజల్ని ఉద్ధరించేయడానికే రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయా.? అలాగని ఎవరన్నా అంటే అంతకన్నా బిగ్‌ జోక్‌ ఇంకొకటుండదు.  ఇప్పటికే ఉనికిలో వున్న రాజకీయ పార్టీలైనా, కొత్తగా పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీలయినా అధికారమే పరమావధిగా పనిచేస్తాయి. ఛాన్సుంటే ఎమ్మెల్యే, కుదరదంటే ఎమ్మెల్సీ, అవకాశమొస్తే ఎంపీ, టైమ్‌ బావుంటే మంత్రి.. అదృష్టం కలిసొస్తే, ముఖ్యమంత్రి.. ఆ అదృష్టం మరీ బాగా పండిపోతే ప్రధాన మంత్రి.. ఇలా వుంటుంది రాజకీయ నాయకుల ఆలోచన.  'అధికారం కోసం ప్రయత్నిద్దాం, కుదరకపోతే మిత్రపక్షంగా మారి, అధికారం పంచుకుందాం..' అని చాలా రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. అధికారం డోన్ట్‌ కేర్‌.. అనుకుంటోన్న రాజకీయ పార్టీలు దేశంలో ఏవన్నా వుంటే, అవి వామపక్షాలు మాత్రమే. అవీ ఒక్కోసారి అధికారమే పరమావధిగా పనిచేస్తున్న దాఖలాల్లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం.  ఇక, అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 'అధికారం మాకు ముఖ్యం కాదు.. ప్రజలే మాకు ముఖ్యం..' అని అసెంబ్లీలో సెలవిచ్చారు. ఈ దశాబ్దానికే కాదు, ఈ శతాబ్దానికే ఇది పెద్ద జోక్‌. అధికారం కోసం కాకపోతే, గతంలో ఉచిత విద్యుత్‌ని వ్యతిరేకించిన టీడీపీ గత ఎన్నికల్లో, అంతకు ముందు ఎన్నికల్లో ఉచిత విద్యుత్‌కి ఎందుకు 'సై' అన్నట్టు.?  ఉమ్మడి తెలుగు రాష్ట్ర విభజనలో ఎవరికి వారు తమ రాజకీయ ప్రయోజనాల్ని చూసుకున్నారు. విభజన వద్దంటే తెలంగాణలో దెబ్బతింటామేమో.. అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని వంచించాయి అన్ని రాజకీయ పార్టీలు. ఇందులో ఓ పార్టీ తక్కువ కాదు, ఇంకో పార్టీ ఎక్కువ కాదు. గతంలో రాజకీయ లబ్ది కోసం విభజనకు మద్దతిచ్చిన పార్టీ అయిన టీడీపీ, ఇప్పుడు ఆ విభజనకు కారణం వైఎస్సార్సీపీనే అని ఆరోపిస్తోంది.  తెలంగాణలో ఏ సభ జరిగినా, 'తెలంగాణ కోసం మొదటగా లేఖ ఇచ్చింది మేమే..' అంటూ హడావిడి చేస్తారు ఇదే చంద్రబాబు. ఇప్పుడు అదే చంద్రబాబు, విభజనకు కారణం తాను కాదని బుకాయించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్‌లో చేస్తుండడాన్ని ఏమనుకోవాలి.? రాజకీయాల్లో ఎవరూ సత్యహరిశ్చంద్రులు కారు. కానీ, చంద్రబాబు మాత్రం సత్యహరిశ్చంద్రుడినని చెబుతుంటారు.. అధికారం తమ అభిమతం కాదని సెలవిస్తారు. అందరూ ఉద్ధరించేసేటోళ్ళే మరి.! 
« PREV
NEXT »

No comments

Post a Comment