తాజా వార్తలు

Friday, 28 August 2015

జీశాట్-6 విజయవంతం-అగ్రరాజ్యాల సరసన భారత్

అంతరిక్ష రంగంలో భారత్ మరో కీర్తి పతాకం సొంతం చేసుకున్నది. స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్ పరిజ్ఞానంతో రూపొందిన కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-6 ప్రయోగం విజయవంతమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూ పొందించిన జీఎస్‌ఎల్వీ-డీ6 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. 2117 కేజీల బరువున్న జీశాట్-6ను తీసుకెళ్తున్న జీఎస్‌ఎల్‌వీ-డీ6 రాకెట్‌ సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. నింగిలోకి దూసుకెళ్లిన 17 నిమిషాల తర్వాత శాటిలైట్‌ను కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. జీఎస్‌ఎల్వీ-డీ6 ద్వారా జియోసింక్రొనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత జీశాట్-6 పర్యవేక్షణ ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ నియంత్రణలోకి వెళ్తుందని ఇస్రో పేర్కొన్నది. స్వదేశీ క్రయోజెనిక్ స్టేజ్ పరిజ్ఞానంతో 2014 జనవరి 5 తేదీన ప్రయోగించిన జీఎస్‌ఎల్వీ-డీ5 తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన రెండో ప్రయోగమిది. ఈ ప్రయోగంతో రెండు టన్నులకు పైగా బరువున్న భారీ శాటిలైట్ల ప్రయోగించే అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్ దేశాల సరసన భారత్ చేరింది. ఈ ఉపగ్రహం తొమ్మిదేండ్లు సేవలందించనున్నది. 

« PREV
NEXT »

No comments

Post a Comment