తాజా వార్తలు

Sunday, 30 August 2015

సెప్టెంబర్ 17 అంటే కేసీఆర్ కు పరేషాన్ ఎందుకు...?తెలంగాణ సీఎం కేసీఆర్ కు కొత్త సమస్య వచ్చిపడింది. అధికారంలోకి రాకముందు ఉద్యమకారుడిగా ఉన్న సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఇపుడు కేసీఆర్కు చిక్కులు తెచ్చిపెడుతోంది. గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఇపుడు వ్యవహరిస్తే... ఒకవర్గం దూరమవుతుంది...పోనీ దూరంగా ఉందామని లైట్ తీసుకుంటే ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు మొదలెట్టాయి. మొత్తానికి కేసీఆర్ కు ఉక్కపోత మొదలయింది.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉద్యమ సమయంలో కేసీఆర్ డిమాండ్ చేశారు. తమ నినాదానికి మద్దతివ్వని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దద్దమ్మలు అని విమర్శలు చేశారు. తెలంగాణకోసం ప్రభుత్వాన్ని కూల్చి అయినా విమోచన దినాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. కట్ చేస్తే ఇపుడు సీఎం అయ్యాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంపై కేసీఆర్ వెనక్కు తగ్గుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. 

ఈ నేపథ్యంలో కేసీఆర్ పై ఒంటికాలితో లేచే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఒక మాట ఉద్యమకారుడిగా ఒకమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పచ్చి అబద్దాలకోరుగా మారారని విమర్శించారు. కేసీఆర్ చేసిన ప్రకటనను గుర్తుచేస్తూ....  ప్రజలు వివిధ పార్టీలు సీఎంను కలవగా...ఆ డిమాండ్  ను చిల్లర రాజకీయాలని తీసిపారేశారని అన్నారు. గత ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాయో తాము కూడా అదే విధంగా నిర్ణయం తీసుకుంటామని యూటర్న్ తీసుకున్నారన్నారు. కేసీఆర్ యూటర్న్తో తెలంగాణ ఆత్మగౌరవం మంటగలుస్తున్నదని పొన్నం ఆవేదనను వ్యక్తం చేశారు. 

మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవంపై ప్రత్యేక అభిమానం చూపే బీజేపీ మొదట్నుంచే కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తోంది. ఎంఐఎంతో పొత్తు కుదుర్చుకున్న టీఆర్ ఎస్ ఆ పార్టీకి భయపడి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టుపెడుతోందని మండిపడుతోంది. రజాకార్ల ఆకృత్యాలను ఎదిరించి సాధించికున్న తెలంగాణను కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. నిజాం రాజుల కంటే నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment