తాజా వార్తలు

Sunday, 30 August 2015

వంగవీటి మోహనరంగా ఓ సంచలనం - పవన్రాజకీయాలకు కులం ఆలంబన కావచ్చు..కానీ విజయాలకు కులం ఒక్కటే బలం కాదు. ఇది చాలా వరకు ప్రూవ్ అయిన వాస్తవం. భారత రాజకీయాల్లో కులం ప్రాబల్యం అంతకంతకూ కొండంతలుగా పెరిగిపోయి వుండొచ్చు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్త రోజుల నుంచి ఇప్పటి వరకు నాయకులను తయారుచేయడంలో, పార్టీలకు విజయాలు అందించడంలో కులం కీలక పాత్ర వహించి వుండొచ్చు. కానీ ఆంధ్రనాట మాత్రం కులాన్ని చూసుకుని అధికారం అందుకుందామనుకున్న వారు విజయాలు సాధించింది మాత్రం తక్కువ. ముద్రగడ పద్మనాభం అంటే చాలు, ఆంధ్రలో కాపు కులస్థుల గుండెలు ఉప్పొంగేవి. తమకు నికార్సయిన ప్రతినిధిగా చూసారు. ఆయనను తమ వైపు తిప్పుకోవాలని పార్టీలు తహతహలాడాయి. ఆయన మహా అయితే మంత్రి మాత్రమే కాగలిగారు. వంగవీటి మోహనరంగా ఓ సంచలనం. దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తా వరకు వ్యాపించిన అభిమానం. ఆయన జీవితం అర్థాంతరంగా ముగియకపోతే ఏం జరిగేదో తెలియదు మరి. కత్తి పద్మారావు..దళిత ఉద్యమ నిర్మాత. కానీ ఆ ఉద్యమం ఆయన ఎదగడానికి మాత్రం అంతగా సహకరించలేదు. మంద కృష్ణమాదిగ. రాష్ట్ర దళిత ఉద్యమాల్లో మరో అధ్యాయం. ఎన్ని ఉద్యమాలు..ఎన్ని పంతాలు..ఎన్ని దీక్షలు..కానీ అవి ఆయన క్రేజ్ ను ఇమేజ్ ను పెంచి వుండొచ్చు కానీ, విజయాన్ని అందివ్వలేదు. అధికారంపై కూర్చో పెట్టలేదు. చిరంజీవి..పైకి ఎన్ని చెప్పినా, తన కులం బలం చూసుకునే పార్టీపెట్టారు. కానీ ఆ కులం బలంగా వున్న తన స్వంత గడ్డ మీదే ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పవన్ 'నాకు కులమా..నా కూతురికి చర్చిలో పేరు పెట్టా' అని అనడం వెనుక ఈ వైఫల్యాలు అన్నీ దాగి వున్నాయి..తన విజయానికి కులాతీత పునాది వేసుకునే ఆలోచన వుంది. ఎందుకంటే పవన్ కు తెలుసు..కులం ఒక్కటే అధికారం అందివ్వలేదని. పైగా చిరంజీవిని అధికార పీఠానికి దూరంగా వుంచిందీ కులం ముద్రే అని. ఉత్తరాంధ్ర చివరి నుంచి దక్షిణ కోస్తా వరకు కాపు కులస్థులు ఎంత అధికంగా వున్నారో, అదే విధంగా ప్రతి జిల్లాలో కనీసం రెండు కులాలతో విబేధాలు కొనసాగుతూ వున్నాయన్నది వాస్తవం. శ్రీకాకుళంలో కాళింగులు, విజయనగరంలో కొప్పల వెలమలు, విశాఖ జిల్లాలో గవరలు, ఈస్ట్ లో కమ్మవారు, వెస్ట్ లో క్షత్రియులు, కృష్ణ, గుంటూరులో కమ్మవారు ఇలా కాపులకు వ్యతిరేకంగా వుంటూ వస్తున్నారు. అందువల్ల పూర్తి మెజారిటీ తో పాటు పార్టీ బలం వుంటే తప్ప విజయాలు సాధ్యం కాదు. ఇధి పవన్ కు తెలియంది కాదు. అందుకే ఎన్టీఆర్, వైఎస్ఆర్ ల మాదిరిగా కులాలకు అతీతంగా ఎదగాలి అనుకుంటున్నాడు. కానీ కాపులు మాత్రం తమ నాయకుడిగానే చూస్తున్నారు. మొన్నటికి మొన్న పవన్ టూర్ లో ఓ మహిళ పవన్ ను మరో వంగవీటి మోహనరంగా అని అభివృర్ణించింది. ఇలాంటి మాటలు సహజంగానే రోడ్ బ్లాక్ లు గా మారతాయి. అందుకే పవన్ ముందే వాటికి కట్ చేస్తున్నారు. తనకు తానే తనకు కులాన్ని అంటిస్తున్న మాటలను గుర్తు చేస్తూ తనకు కులమేమిటి? నాన్సెన్స్ అంటూ కట్ చేసారు. తను ఎన్ని చెప్పినా తన కులం వాళ్ల తమ అభిమానం చాటుకుంటారన్నది పవన్ కు తెలియంది కాదు. అది అలా తెరచాటున వుంటూనే, మిగిలిన క్రేజ్ ను ఓట్లుగా మార్చుకోవాలని అనుకుంటున్నారు.  ఒకటి మాత్రం వాస్తవం, కులం కార్డు లేకుండా పవన్ ఈ స్టేజ్ కు రావడం చాలా కష్టం. కానీ అదే కులం కార్డుతో మాత్రం మరింత మీదకు వెళ్లడం మాత్రం అసాధ్యం. ఆ సంగతి పవన్ ఇప్పటికే గమనించినట్లే కనిపిస్తోంది. చిరంజీవి చేసిన తప్పు, చేయకుండా పవన్ ముందు జాగ్రత్త పడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ ఇప్పటికే పవన్ ను తెలుగుదేశం పార్టీ దగ్గరకు తీయడం వెనుక పవన్ కు వున్న కులబలమే అన్న అభిప్రాయం బలంగా వ్యాపించేసింది. అయితే పవన్ కు వున్న సినిమా ఇమేజ్ మాత్రం కులాతీతం. అది అలాగే వుంటే పవన్ కు మరిన్ని విజయాలు కష్టం కాదు. కానీ ఆ ఇమేజ్ ను ఈ కులం కార్డు డామినేట్ చేసిన రోజు, మరో చిరంజీవి మాత్రమే అవుతారు. అలా డామినేట్ చేయకుండా కాపాడుకోవాల్సిన స్ట్రాటజీలు పన్నాల్సింది పవనే. అయితే అదే సమయంలో పవన్ ను అడ్డుకోవడానికి ఆయన ముందు ఆయన కన్నా ఎత్తుగా ఆయన కులాన్ని వుంచడానికి వైరిపక్షాలు శతథా ప్రయత్నిస్తాయి. వైఎస్ కు రెడ్డి కులం ఆపాదించి, ఆయన ఇమేజ్ ను కిందకు దించాలని తెలుగుదేశం బలంగా ఫ్రయత్నించిన సంగతి ఇక్కడ గమనించవచ్చు. వైఎస్ జగన్ ను కూడా పదే పదే జగన్ రెడ్డి అనడం గుర్తున్నదే. ఎవరి ప్రయత్నాలు బలంగా వున్నాయన్న దాన్ని బట్టి, ఫలితం ఆధారపడి వుంటుంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment