తాజా వార్తలు

Saturday, 26 September 2015

డీజీపీ పదవి నుంచి ....ప్రత్యక్ష రాజకీయాల్లోకి ...!
డీజీపీ పదవి నుంచి రిటైర్ కాగానే జాస్తి వెంకటరాముడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయం అయ్యింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని ఆయన రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. మాజీ డీజీపీ హోదాలో ఆయన అనంతపురం జిల్లా నుంచే రాజకీయాలు చేసే అవకాశాలున్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి కూడా ఇప్పటి నుంచే రంగం సిద్ధం అవుతున్నట్టు సమాచారం. అందులో ఒక నియోజకవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. డీజీపీ రాముడు అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఎందుకంటే... రాముడు సొంత ఊరు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది. బత్తలపల్లి మండలం నార్సింహపల్లికి చెందిన వ్యక్తి ఆయన. ఆ ఊరు ధర్మవరం పరిధిలోకే వస్తుంది కాబట్టి.. ఆయన అక్కడ నుంచి పోటీ చేయనున్నారు.
బయటకు ఇంత సాఫ్ట్‌గా కనిపిస్తున్నా.. రాముడు రాజకీయ ఎంట్రీ అనంతపురం రాజకీయాలను గట్టిగానే ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి ధర్మవరం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం వల్లనే రాముడు రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాడు. ఎందుకంటే.. ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యేక్త! వరదాపురం సూరి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎట్టేకలకూ ఈయన మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచాడు.
అయితే... గెలిచినప్పటి నుంచి ఈయనకు ప్రశాంతత  లేదు! భవిష్యత్తుపై ఈయనకు బెంగను కల్పిస్తున్నారు అనంతపురం జిల్లా తెలుగుదేశం నేతలు. ఇప్పటికే ఈ నియోజకవర్గంపై కన్నేశారు పరిటాల వాళ్లు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి చాలా ఉత్సాహం చూపుతున్న పరిటాల శ్రీరామ్ ధర్మవరం టికెట్ కావాలని అంటున్నాడు. అనడమే కాదు... ఇప్పటికే ధర్మవరంలో వారి దందా కూడా ప్రారంభం అయ్యింది. వరదాపురం సూరికి ఎర్త్ పెడతామని.. వచ్చే ఎన్నికల్లో టికెట్ తామే సంపాదిస్తామని పరిటాల వర్గం ఇప్పటికే లోకల్‌గా గట్టి ప్రచారం చేసుకొంటోంది.
పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. తనయుడికి ధర్మవరాన్ని వదిలిపెట్టాలని ఆమె కోరుతోంది. దీంతో వరదాపురం సూరి ఇబ్బంది పడిపోతున్నాడు. పరిటాల వర్గానికి సూరికి ఆది నుంచే విబేధాలున్నాయి. ఒకే సామాజికవర్గీయులు అయినప్పటికీ.. వీరి మధ్య విబేధాలున్నాయి. సూరి జేసీ వర్గీయుడిగా పేరు పొందాడు. దీంతో సూరిని అణచడానికి పరిటాల వర్గం ఉత్సాహంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ దక్కుతుందనే ఆశ పోయింది! ఏ మూలో కొద్దో గొప్పో ఆశలున్నాయి. చంద్రబాబు తనకు అన్యాయం చేయడని పరిటాలకు మరీ అంత ప్రాధాన్యత ఇవ్వడని వరదాపురం సూరి లెక్కలేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ రచ్చలోకి రాముడు కూడా దిగడంతో పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది.
విశేషం ఏమిటంటే.. ఈ ముగ్గురూ ఒకే సామాజికవర్గానికి చెందిన వాళ్లే. అంతా కమ్మవాళ్లే.. అయితే ఈ నియోజకవర్గంలో కమ్మ వాళ్ల ఉనికి చాలా స్వల్పం. డీజీపీ సొంత ఊరులో కొంత జనాభా ఉంది. ఆ తర్వాత అక్కడక్కడ మాత్రమే కమ్మవాళ్లు ఉనికి ఉంటుంది. ఇలాంటి నియోజకవర్గంలో పాగా వేయాలని ముగ్గురు కమ్మవాళ్లు ప్రయత్నిస్తున్నారు. టికెట్ కోసం పోరు పరిటాల వర్సస్ వరదాపురం సూరి అనుకున్నంత వరకూ పరిస్థితి ఒకలా ఉండేది. పోటాపోటీ పరిస్థితులు ఉండేవి. అయితే ఇప్పుడు రాముడు వర్సెస్ పరిటాల వర్సెస్ వరదాపురం అంటే పరిస్థితి మరోలా మారిపోతోంది. వాళ్లిద్దరూ పోటీ పడితే తనకు టికెట్ దేక్క అవకాశాలే ఉండవని వరదాపురం భావిస్తున్నాడు.
రాముడు, పరిటాలల్లో ఎవరో ఒకరు తమ పరపతిని ఉపయోగించుకుని టికెట్ దక్కించుకుంటారని సిట్టింగ్ ఎమ్మెల్యే భావిస్తున్నాడు. చంద్రబాబు అండ కూడా ఎక్కువశాతం రాముడివైపే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఎంతైనా డీజీపీ స్థాయిలో పనిచేశాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహపడుతున్నాడు.. ఇంకా సామాజికవర్గ ఈక్వెషన్లు కూడా కరెక్టుగానే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో బాబు రాముడికి దర్మవరం టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే పరిటాల ఫ్యామిలీకికూడా తీవ్రమైన నిరాశే అవుతుంది.
వరదాపురం సూరితో అయితే వీళ్లు ఈజీగా పోరాడారు కానీ.. రాముడితో పోరాడటం కొంచెం కష్టమైన పని. పోలీసాయన వద్ద ఫ్యాక్షనిస్టులు మరీ ఎక్కువ ఆరాటపడలేరు కదా! దీంతో ధర్మవరం నియోజకవర్గం మీద పరిటాల ఫ్యామిలీ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాన్ని రాముడి చేతికి అప్పగించక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు పరిటాలకు ఉన్న చాయిస్ అనంతపురం టౌన్ లేదా.. పెనుకొండ నియోజకవర్గం. పెనుకొండలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు. అయితే ఆయన బీసీ. ఆయనను పక్కనపెట్టించి పరిటాల వాళ్లు టికెట్ సొంతం చేసుకొంటే విమర్శలు వస్తాయి. ఇక మిగిలింది అనంతపురం టౌన్. ఇక్కడ కూడా తెలుగుదేశం అభ్యర్థే ఎమ్మెల్యేగా ఉన్నాడు.
పరిటాల ఫ్యామిలీ అంటే పడనిప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నాడు. కానీ... అనంతపురం టౌన్‌లో పోటీ చేసి గెలవడం పరిటాల ఫ్యామిలీకి అంత సులభం కాదు. ఎందుకంటే.. ఎంతైనా నగర జనాలు.. ఫ్యాక్షనిస్టులు ఆదరించడం కష్టమే. అందులోనూ టౌన్ టీడీపీకి మరీ అంత కంచుకోట ఏమీ కాదు. చాన్నాళ్ల తర్వాత మొన్నటి ఎన్నికల్లో మాత్రమే టీడీపీ గెలవగలిగింది. వైకాపా నిర్లక్ష్య పూరిత ధోరణితో ఈ నియోజకవర్గాన్ని లాస్ అయ్యింది. కాబట్టి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలవడం పరిటాల శ్రీరామ్‌కు అంత ఈజీ వ్యవహారమేమీ కాదు. ఓవరాల్ గా రాముడుపొలిటికల్ ఎంట్రీతోనే పరిటాల శ్రీరామ్‌కు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడనున్నాయి. తెలుగుదేశం పార్టీ రాజకీయాలను రవసత్తరంగా మారుస్తోంది రాముడి ఎంట్రీ.
Newsdesk
« PREV
NEXT »

No comments

Post a Comment