తాజా వార్తలు

Monday, 28 September 2015

పీఎస్ఎల్వీ-సీ30 విజయవంతం

తొలి ఖగోళ పరిశోధన ఉపగ్రహం ఆస్ట్రోశాట్ ను ఇస్రో విజయవంతంగా రోదసిలోకి పంపింది. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ30 రాకెట్ ఆస్ర్టోశాట్ తో పాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. ఉదయం 10 గంటలకు కౌంట్ డౌన్ ముగియగానే… పీఎస్ఎల్వీ నిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులో ఆరు డిగ్రీల వాలు కోణంలో ఆస్ట్రోశాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. సరిగ్గా 22 నిమిషాల 32 సెకన్లలో ప్రయోగం పూర్తయింది.  ఆస్ట్రోశాట్ ఉపగ్రహ రూపకల్పన కోసం ఇస్రో సైంటిస్టులు 11 ఏళ్లు శ్రమించారు. 1,513 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం కోసం దాదాపు 178 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. విశ్వ మూలాలను తెలుసుకోవడానికి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఆస్ట్రోశాట్ ఉపగ్రహం నక్షత్ర మండలాలు, న్యూట్రాన్ స్టార్స్, బ్లాక్ హోల్స్, వాటి ఆయస్కాంత క్షేత్రాలతోపాటు… మన గెలాక్సీ అవతల ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయనుంది. ఐదేళ్లపాటు ఆస్ట్రోశాట్ తన సేవలు అందించనుంది. ఆస్ట్రోశాట్ తోపాటు ఆరు విదేశీ ఉపగ్రహాలను కూడా పీఎస్ఎల్వీ రాకెట్ కక్ష్యలో ప్రవేశపెట్టింది. వాటిలో ఇండోనేషియా లాపాన్ -2 (68 కిలోలు), కెనడాకు చెందిన యాక్సెట్ యా (5.5 కిలోలు), అమెరికాకు చెందిన లెమర్ -2,3,4,5 (16 కిలోల చొప్పున) ఉన్నాయి. ఆస్ట్రోశాట్ ప్రయోగం సక్సెస్ కాగానే ఇస్రో శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ సైతం సైంటిస్టులను అభినందించారు. ఇస్రో శాస్త్రవేత్తల కఠోర శ్రమ ఫలితంగానే తాజా విజయం నమోదైందన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment