తాజా వార్తలు

Thursday, 24 September 2015

అమితాబ్ ఈ మాత్రం నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ఇంత‌కాలం ఆగ‌డ‌మే విచిత్రం...!ఇదో పెద్ద వింతా అనిపిస్తుంది. అస‌లు బిగ్ బి లాంటి బిగ్‌షాట్స్ గ్యాస్ సబ్సిడీ వ‌దులుకోవడానికి ఇప్ప‌టిదాకా మీన‌మేషాలు లెక్కించ‌డ‌మే నిజంగా వింత‌. ప్ర‌ధానిగా నరేంద్ర‌మోడీ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత దేశంలోని సంప‌న్నులు గ్యాస్‌ స‌బ్సిడీని వ‌దులుకోవాలంటూ పిలుపునిచ్చారు. దీని కోసం రూ. కోట్లు ఖ‌ర్చు పెట్టి ప్ర‌చారం కూడ చేస్తున్నారు. ఏదేమైతేనేం... ప్ర‌ధాని పిలుపున‌కు, ప్ర‌చారానికి ప‌లువురు స్పందించారు. ఇంకా స్పందిస్తున్నారు కూడా.
ఈ నేప‌ధ్యంలో... తాజాగా బాలీవుడ్ ఎవ‌ర్‌గ్రీన్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ గ్యాస్ స‌బ్సిడీని వ‌దులుకున్నాడు. ఇక‌పై మార్కెట్ ప్రైస్‌కే సిలిండ‌ర్‌ను కొనుగోలు చేస్తానంటూ ప్ర‌క‌టించాడు. స‌రే... ఆయ‌న ఈ నిర్ణ‌యం ఇలా తీసుకున్నాడో లేదో... దీనిపై కేంద్ర ఇంధ‌న శాఖామాత్యులు ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ గారు ఉబ్బి త‌బ్బిబ్బ‌యారు. ఆహా ఎంత గొప్ప మ‌నిషి అన్న‌ట్టు పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు.
అమితాబ్ తీసుకున్న నిర్ణ‌యం ఒక నోబుల్ గెస్చ‌ర్ అంటూ ఆయ‌న పొగిడేశారు. ఇది ఎంతో మందికి స్ఫూర్తిని అందిస్తుంది అంటూ ఆయ‌న బిగ్‌బికి అభినంద‌న‌లు తెలిపారు. నిజానికి అమితాబ్ ఈ మాత్రం నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ఇంత‌కాలం ఆగ‌డ‌మే విచిత్రం. విశేష‌మేమిటంటే... ఆయ‌న కంటే ముందు దేశ‌వ్యాప్తంగా ఈ త‌ర‌హాలో గ్యాస్‌ స‌బ్సిడీ వ‌దులుకున్న వారి సంఖ్య దాదాపు 30ల‌క్ష‌ల‌కు పైగానే.
దేశంలోకెల్లా అగ్ర‌హీరో, అత్య‌ధిక సంఖ్య‌లో అభిమానులు, ట్విట్ట‌ర్ ఫాలోయ‌ర్స్ ఉన్న న‌టుడు, డెభ్బ‌య్యేళ్ల వ‌య‌సులోనూ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కుర్ర హీరోల‌కు ధీటుగా రాణిస్తున్న న‌ట‌నాగ్ర‌గ‌ణ్యుడు... గ్యాస్ స‌బ్సిడీ వ‌దులుకోవ‌డం ఓ గొప్ప విష‌యం అన్న‌ట్టు కేంద్ర మంత్రి మాట్లాడడం విచిత్రం. నిజానికి ఆయ‌న క‌న్నా ముందు 30ల‌క్ష‌ల మంది ఉన్నార‌ని కేంద్ర‌మే చెబుతున్న‌ప్పుడు ఇంత ఆల‌స్యంగా స్పందించిన వ్య‌క్తి గురించి ఇంత‌లా కొనియాడ‌డం అవ‌స‌ర‌మా?
ఇలా అన‌డం అంటే అమితాబ్‌ను కించ‌ప‌ర‌చ‌డం కాదు. ఆయ‌న‌క‌న్నా ముందుగా స‌బ్సిడీ వ‌దులుకున్న వారు త‌క్కువ కాదు అని చెప్ప‌డ‌మే. నిజానికి స‌బ్సిడీ వ‌దులుకున్న ల‌క్ష‌లాది మందిలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్లు, ఒక‌టీ అరా నెల జీతంపై ఆధార‌ప‌డి బ‌తికేవాళ్లు సైతం ఉండొచ్చు. అలాంటి వాళ్ల‌ను గుర్తించి, వారి గొప్ప‌త‌నాన్ని దేశానికి తెలియ‌జేస్తే... వాళ్లూ తాము చేసిన ప‌నికి మంచి గౌర‌వం ద‌క్కింద‌నుకుంటారు. అలాగే మిగ‌తా వారు కూడా వాళ్లే చేసిన‌ప్పుడు మేమెందుకు చేయ‌లేం అనే ఆలోచ‌న చేస్తారు. అంతే త‌ప్ప అంబానీ వ‌దులుకున్నాడు, అమితాబ్ వ‌దులుకున్నాడు అంటూ గొప్ప‌గా చెప్ప‌డం వ‌ల్ల వ‌చ్చే ఫ‌లితం ఏముంది? నిజానికి అంత స్థాయి ప్ర‌ముఖులు స‌బ్సిడీ వ‌దులుకోవ‌డం అనేదాని  గురించి అన‌వ‌సర పొగ‌డ్త‌లు గుప్పిస్తే...  అది వ్య‌తిరేక ఫ‌లితాన్నిస్తుంద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు తెలుసుకోవాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment