తాజా వార్తలు

Monday, 28 September 2015

అందుకే ఈ బాబు కూడా ఆ బాబు మాట‌ల‌నే కాపీ కొట్టాడు....!ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల  సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుకు ఎన్నిక‌ల ముందు త‌ల‌కెక్కిన భ‌క్తి ఇంకా దిగ‌డం లేదు. అప్పట్లో త‌న వంతుగా తెలుగుదేశం గెలవ‌డానికి చేయాల్సిందంతా చేశాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కున్న ఆయ‌న... ఇప్పుడు కూడా బాబు కోసం త‌న వంతు కృషి కొన‌సాగిస్తున్నట్టే క‌నిపిస్తోంది.
త‌ను న‌మ్మిన బాబు తానా అంటే తాను కూడా తందానా అన‌క‌పోతే ఆయనెందుకు మ‌రో బాబు అవుతాడు? అందుకే ఈ బాబు కూడా ఆ బాబు మాట‌ల‌నే కాపీ కొట్టాడు. తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఎపిఎన్జివోల సంఘం స‌మావేశంలో అశోక్‌బాబు మాట్లాడుతూ ఎపి ఉద్యోగులు హైద‌రాబాద్ నుంచి కొత్త రాజ‌ధాని ప్రాంతానికి త‌ర‌లిరావ‌డంపై త‌మ పూర్వ డిమాండ్లనే మ‌ళ్లీ  ప్రభుత్వానికి వినిపించాడు.  త‌మ వాళ్లంతా హైద‌రాబాద్‌కు అల‌వాటు ప‌డిపోవడం వ‌ల్ల షిఫ్టింగ్ పూర్తవ్వడానికి క‌నీసం ఏడాది స‌మ‌యం  ప‌డుతుంద‌న్నాడు.
అది కూడా ప్రభుత్వం త‌గిన నివాస వ‌స‌తి తదిత‌ర సౌక‌ర్యాలు ఏర్పాటు చేస్తేనే అని కూడా చెప్పాడు. కాంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యుల‌రైజ్ చేయాల‌నే డిమాండ్‌ను పునరుధ్ఘాటించిన అశోక్‌బాబు ఖాళీల భ‌ర్తీకి చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరాడు. ఒక ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఉండి ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై దాడి వంటి విష‌యాల్లో కిమ్మన‌కుండా ఉన్నాడంటూ విమ‌ర్శలు ఎదుర్కున్న అశోక్‌బాబు... ఉద్యోగుల త‌ర‌పు డిమాండ్ల‌పై కూడా ప్రభుత్వాన్ని ఆచి తూచి మాత్రమే అడుగుతున్నట్టు క‌నిపిస్తోంది.
ఇక ప్రత్యేక‌హోదాపై అడిగిన ప్రశ్నకు అశోక్‌బాబు మాట్లాడుతూ...  హోదా వ‌చ్చినంత మాత్రాన అంతా అయిపోదంటూ అచ్చం చంద్రబాబు త‌ర‌హా స‌మాధానం చెప్పాడు. ఎపి పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌ చ‌ట్టంలోని అంశాల‌న్నీ అమలైతేనే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా పుంజుకుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. అయితే ప్రత్యేక‌హోదా అవ‌స‌ర‌మే అయినా తాము దీనిపై ఇప్పుడ‌ప్పుడే ఉద్యమించే ఆలోచ‌న చేయ‌డం లేద‌న్నాడు. త‌మ‌కు ముఖ్యమంత్రి చంద్రబాబుపై న‌మ్మకం ఉంద‌న్నాడు. ఆయ‌న కేంద్రంపై ఒత్తిడి తీసుకురావ‌డంలో విఫ‌ల‌మైన‌ట్టు త‌మ‌కు అనిపించిన‌ట్టయితే... అప్పుడు తాము ఉద్యమించ‌డం గురించి ఆలోచిస్తామ‌న్నాడు.
ప్రత్యేక‌హోదా తీసుకువ‌చ్చే విష‌యంపై కేంద్రంపై ఒత్తిడి తేవ‌డం సంగ‌తి  దేవుడెరుగు..... దానిపై నోరెత్తినా కేంద్రం ఎక్కడ కోపం తెచ్చుకుంటుందో అన్నట్టు ష్‌... గ‌ప్‌చుప్ అయిపోతే...ఇంకా ఆ బాబు ఒత్తిడి తేవ‌డం, విఫ‌లం అవ‌డం అంటూ ఈ బాబు మాట్లాడ‌డం విడ్డూరం. హోదా విష‌యంలో చంద్రబాబు ఏం చేశాడు? ఏం చేయ‌గ‌ల‌డు...  అనేదానిపై రాష్ట్ర ప్రజానీకానికి క్లియ‌ర్‌గా తెలిసివ‌చ్చినా, పాపం అశోక్‌బాబుకే ఇంకా అర్ధం కాలేదు. ఏం చేస్తాం?

News Desk-AP
« PREV
NEXT »

No comments

Post a Comment