తాజా వార్తలు

Tuesday, 29 September 2015

రామోజీ-చంద్రబాబు ల బంధం గట్టిదేనా.....???చిన్న పాయింట్ దొరకాలి లేదా, చిన్న సంఘటన జరగాలి, రాజకీయ వర్గాల్లో రకరకాల వార్తలు పుట్టుకొస్తాయి..కథనాలు వినిపిస్తాయి. రామోజీ పత్రికల్లో కాస్త ప్రభుత్వ వ్యతిరేక కథనాలు కనిపించడం, ముఖ్యంగా జిల్లా టబ్లాయిడ్ లు అన్నీ సమస్యలను ఎత్తి చూపించడం వంటి వ్యవహారాలు గమనించిన మీదట, రాజకీయ వర్గాలు, రామోజీ-చంద్రబాబు బంధంపై కబుర్లు కథనాలు వినిపించడం ప్రారంభించాయి. కాస్త నమ్మదగిన వర్గాలు, చెబుతున్న దాని ప్రకారం ఈ వైనం ఇలా వుంది.
రాజధాని వ్యవహారాల్లో చంద్రబాబు బిజీ గా వున్నారు. ఏవేవో వస్తాయి..మరేవేవో తెస్తాం అంటున్నారు. అయితే గతానికి ఇప్పటికి తేడా ఏమిటంటే, బాబు చూపు దేశీయంగా లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాం అంటూ, అక్కడ మీ వంతుగా ఏమైనా ఐడియా వుందా..లేదా ఏమైనా చేద్దామని వుందా అని ఒక్క మాట కూడా రామోజీని ఇంతవరకు అడగలేదు చంద్రబాబు అన్నది రాజకీయ వర్గాల బోగట్టా. అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ సిటీ కట్టి, ఇప్పుడు ఓం సిటీ నిర్మాణానికి తలకెత్తుకున్న రామోజీ రావు తలుచుకుంటే ఏదో ఒక అధ్భుతం రాజధానికి సమకూరుస్తారు. ఆయన అడిగితే బాబు కూడా కాదనరు.
ఇక్కడ అది కాదు సమస్య. బాబు నుంచి ఆ విధమైన ప్రతిపాదన ఏదీ మాట మాత్రంగా కూడా రాలేదన్నదే. తన లెవెల్ కు బాబు తనను అడగాలి కానీ, తాను ప్రతిపాదన ఇవ్వడం కాదు అన్నది విషయం. అయితే ఇక్కడ ఇంకో సంగతి వుంది. నిజంగా రామోజీకి అలాంటి అయిడియా వుంటే అడగడానికి మొహమాటపడరు. కానీ ఆయనకు ఆ అయిడియా ఏమీ లేదు. ఆయన దృష్టి అంతా ఓం సిటీ మీద వుంది. అయినా బాబు ఓ మాట అడగాలి కదా..అని రామోజీ ఫీల్ అయ్యారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
అందరితోనూ అదే తీరు
వాస్తవానికి చంద్రబాబు వైఖరి రాజధానికి సంబంధించినంత వరకు అందరితోనూ అలాగే వుందని వినికిడి. రాజధాని ప్లేస్ నిర్ణయం వరకు చంద్రబాబు తెలుగుదేశం కీలక మద్దతు దారులు అందరితోనూ టచ్ లోనే వున్నారట. కానీ ఆ తరువాత నుంచే ఆయన తన దారిన తాను సాగిపోతున్నారట. అది కూడా ఓ స్టేబుల్ గా, పద్దతిగా వెళ్లడం లేదని వినికిడి. ఎప్పుడు ఏ సంస్థ సీన్ లోకి వస్తుందో, ఎప్పుడు ఏది ఎవరికి ఇస్తారో బాబు దగ్గర జనాలకు కూడా అంతుపట్టడం లేదు. ఈ తరహా వ్యవహారశైలి తో పాటు, తనను ఏదీ అడగని వైనం రామోజీ కి కాస్త చికాకు కలిగించిందని వినికిడి. అంత మాత్రం చేత ఆయనేమీ ఇఫ్పుడు తెలుగుదేశానికో చంద్రబాబుకో వ్యతిరేకం అయిపోలేదు. బేసిక్ పాలసీ అలాగే వుంది. అయితే ఇప్పట్లో ఎన్నికలు లేనందున, పైగా పత్రిక క్రెడిబులిటీ కూడా ముఖ్యం కాబట్టి పార్టీలు, వ్యవహారాల కన్నా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నది ఇప్పుడు ఈనాడు పాలసీగా మారింది. ఇది కూడా కొత్తది కాదు. ఎన్నికలు జరిగిపోయిన తరువాత ప్రతి సారీ ఈనాడు పాలసీ ఇలాగే వుంటుంది.
బాబు తో సంబంధం లేదు
బాబుతో ఇగో సమస్యకు జగన్ ను రామోజీ కలయికకు అస్సలు సంబంధం లేదన్నది రాజకీయ వర్గాల భోగట్టా. జగన్ సన్నిహితులు ఒకరు ఈ విషయంలో చొరవ చూపి, పదే పదే రామోజీతో మాట్లాడి, ఫైనల్ గా జగన్ ను పంపించారని టాక్. ఇక్కడ అసలు విషయం లోకల్ రాజకీయం కాదు, కేంద్రంలో భాజపాతో బంధం, అక్కడి అవసరాలు అని వినికిడి. ఇదంతా భాజపా-వైకాపా వ్యవహారం తప్ప తేదేపాకు సంబంధం లేదు. ఇంకా మట్లాడితే జగన్ కేసుల సంగతే తప్ప, వైకాపా సంగతి కూడా కాదు.
అందుకే ఈ విషయం తెలిసే తెలుగుదేశం శ్రేణులు గమ్మున వున్నాయి. జగన్ కేసుల విషయంలో కేంద్రాన్ని రామోజీ అయినా కాస్త ప్రభావితం చేయగలరేమో కానీ, చంద్రబాబు మాత్రం కాదు. అది వాస్తవం. మోడీతో ఆ లెవెల్ సంబంధాలు చంద్రబాబుకు లేవు. కానీ రామోజీకి వున్నాయి. అందుకే ఈ విషయంలో తాము సైలెంట్ గా వుండడమే ఉత్తమనని తెలుగుదేశం నేతలు ఏమీ మాట్లాడడం లేదు.
వెంకయ్య తీరు వేరు
వెంకయ్య నాయుడు కేంద్ర, రాష్ట్ర రాజకీయాలకు వారధిగా వున్నారు. ఆయన చంద్రబాబుకు దగ్గరగా వున్నట్లు కనిపిస్తారు..అలాగే కేసిఆర్ కు దగ్గరగా వున్నట్లే కనిపిస్తారు. అసలు సంగతేమిటంటే, ఆయన తెరవెనుక జగన్ కూడా కాస్త హితుడే అన్నది. సన్నిహితుడు కాకపోయినా, కీడు చేయాలని మాత్రం అనుకోవడం లేదట. ఎందుకంటే మోడీ మనసులో ఏముంది అన్నది తెలియకపోవడమే అని టాక్. భవిష్యత్ లో వైకాపాతో బంధం కుదిరితే..అందుకే నో ఫ్రైండ్ షిప్ , నో ఎనిమీ అనే టైపులో న్యూట్రల్ బంధాలు నిర్వహిస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ ప్రస్తుతం చంద్రబాబుకు మాత్రం కేంద్రం కాస్త గట్టి లింక్ వెంకయ్య నాయుడే. అందుకే ఆయనకు మాత్రం టచ్ లోనే వుంటున్నారట. మిగిలిన వారిని చూసీ చూడకుండా వదిలేసినా వెంకయ్య తో మాత్రం గట్టి బంధాలు కొనసాగిస్తున్నారట.
సో..బాబు ఇలా తనకు అవసరం వున్నవారితో ఒకలా, ప్రస్తుతానికి అవసరం లేని వారితో మరోలా వుండడం అన్నది ఆ పార్టీకి ఇంటా, బయటా కీలక సపోర్టు అందిస్తున్నవారికి కాస్త ఇబ్బందిగా వుంది. అదే ఇగో సమస్యగ మారుతోంది అని వినికిడి.
News Bureau Special
« PREV
NEXT »

No comments

Post a Comment