తాజా వార్తలు

Wednesday, 30 September 2015

బాలయ్యబాబుని కావాలనే పక్కన పెట్టిన చంద్రబాబు....!ఇంతకీ బాలయ్య ఎక్కడ.? అని అభిమానులు వెతికారు.. టీడీపీ కమిటీల్లో. కానీ, ఎక్కడా బాలయ్యబాబు పేరు కన్పించలేదాయె. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్‌ పగ్గాలో, లేదంటే జాతీయ స్థాయిలో కాస్త కీలకమైన పదవో.. ఏదో ఒకటి ఇస్తారని ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు.
'బాలయ్యే సీఎం..' అంటూ ఎన్నాళ్ళ నుంచో బాలకృష్ణకు జేజేలు పలుకుతున్నారు ఆయన అభిమానులు. ఎప్పటికైనా కాదు, వీలైనంత త్వరగా తమ అభిమాన నటుడు తెలుగుదేశం పార్టీ అధినేత అవ్వాలనీ, ముఖ్యమంత్రి పదవిలో ఆయన్ని చూడాలని అభిమానులు ఆశించారు. కానీ, బాలకృష్ణ పెద్ద పెద్ద పదవుల జోలికి పోలేదు. 'పదవి నాకు అలంకారం కాదు.. నేనే పదవికి అలంకారం..' అంటూ సినిమాటిక్‌ డైలాగులు చెబుతూ వచ్చారు బాలయ్య ఇన్నాళ్ళూ. అందుకేనేమో, బాలయ్యకు ఏ పదవీ ఇవ్వకుండా చంద్రబాబు తన పని తాను చేసుకుపోయారు.
అయితే, బాలకృష్ణే స్వయంగా తనకు ఏ పదవీ వద్దని చంద్రబాబుకి సూచించారనీ, ఉపాధ్యక్షుడు లేదా జాతీయ కమిటీలో స్థానం.. వంటివేవీ తన అభిమానుల్ని శాంతింపజేయవనీ, తనకూ అలాంటి పదవులపై ఆసక్తి లేదని బాలకృష్ణ తేల్చేయడంతోనే చంద్రబాబు, బాలకృష్ణ పేరును పరిగణనలోకి తీసుకోలేదనే వాదన విన్పిస్తోంది. కొన్నాళ్ళుగా దూరం పెట్టిన హరికృష్ణకు మాత్రం నామమాత్రంగా ఓ పదవి కట్టబెట్టి ఊరుకున్నారు చంద్రబాబు.
బాలయ్య లేకపోతేనేం.. బాలయ్య బావ చంద్రబాబు జాతీయ కమిటీ ఛైర్మన్‌.. బాలయ్య అల్లుడు నారా లోకేష్‌ కూడా జాతీయ కమిటీలో కీలక పదవిలో కూర్చోబోతున్నారు.. ఇదీ బాలయ్య అభిమానులు ఇప్పుడు తమను తాము సర్దిపుచ్చుకునేందుకు చెబుతున్నమాట. తప్పదు మరి, బాలయ్యే సరిపెట్టుకున్నాక అభిమానులు సరిపెట్టుకోకపోతే ఎలా.?

News Desk-AP
« PREV
NEXT »

No comments

Post a Comment