తాజా వార్తలు

Tuesday, 8 September 2015

బంగారు తెలంగాణా వ‌జ్ర వైఢూర్యాల గని...!!!

తెలంగాణ వ‌జ్రాల నిల‌య‌మా..బంగారు తెలంగాణా వ‌జ్ర వైఢూర్యాల వేదిక‌గా మార‌బోతోందా.. ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం ఆ విష‌యం రూఢీ అవుతోందా..అంటే శాస్త్ర‌వేత్త‌లు అవున‌నే అంటున్నారు. రాష్ట్రంలోని భూగర్భంలో బంగారు, వజ్రాల గనులున్నట్టు మరోసారి తేల్చిచెబుతున్నారు. కొన్ని నెలల క్రితమే మహబూబ్‌నగర్ జిల్లాలో వజ్రాల గనులున్నట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయం భూభౌతిక విభాగం శాస్త్రవేత్తలు ప్రకటించారు.
తాజాగా నల్గొండ జిల్లాలోని ఏడు ప్రదేశాల్లో వజ్రాలు, బంగారం గనులున్నట్టు వారు గుర్తించారు. ఈ పరిశోధన పత్రం అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన ‘పెలాజియా’ జర్నల్‌లో సోమవారం ప్రచురితమైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన జియోఫిజిక్స్, జియాలజీ, జాగ్రఫీ, జియోకెమిస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో మూడేళ్లుగా జిల్లాలోని గనులపై విస్తృతంగా శోధించి ఈ పత్రాన్ని సమర్పించారు. కృష్ణా, హాలియా, మూసీ, కనగల్ నదీ పరివాహక ప్రాంతాల్లో వజ్రాల గనుల ఆనవాళ్లు లభ్యమయ్యాయని ఆ పత్రంలో వివరించారు. రామడుగు ప్రాంతంలోని వజ్రాల గనులకు వెస్ట్రర్స్ ఆస్ట్రేలియాలోని గనులతో పోలికలున్నట్టు గుర్తించారు. పెదవూర మండలంలో బంగారు గనులుండే అవకాశముందని కనిపెట్టారు. కృష్ణానది, హాలియా మొదలుకొని మూసీ పరివాహక ప్రాంతం వరకు ఈ గనులు విస్తరించి ఉన్నట్టు ఉపగ్రహ సహాయంతో తీసిన రిమోట్ సెన్సింగ్ ఛాయాచిత్రాల ఆధారంగా జరిపిన విశ్లేషణ,
నమూనాల పరీక్షలను బట్టి శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. గతంలో జీఎస్ఐ, ఏరో మాగ్నటిక్ డేటా సర్వేలు సైతం ఇక్కడ గనులున్నట్టు నిర్ధారిస్తున్నాయి. వీటిపై మూడేళ్లుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యులు డాక్టర్ జి.రాందాస్, జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ శాస్త్రవేత్త కె.సతీష్, పరిశోధక విద్యార్థి జి.శ్రీరాములు పరిశోధించి విలువైన ఖనిజాలున్న ప్రాంతాలను గుర్తించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్, కడప జిల్లాల్లోనూ గనులపై పరిశోధనలు జరిపి ఖనిజ నిక్షేపాలున్న ప్రదేశాలను కొన్నింటిని గుర్తించారు.
ఏడేళ్ల క్రితమే జీఎస్ఐ పరిశోధన..
జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2008లో నల్గొండ జిల్లాలో ఖనిజ నిక్షేపాలపై సర్వే జరిపింది. ఆ సమయంలోనే నదీ పరివాహక ప్రాంతాల్లో వజ్రాలు, బంగారు గనుల ఆనవాళ్లు బయటపడ్డాయి. హాలియా రివర్ డ్రైన్ బేసిన్‌లో రామడుగు, సోమవారిగూడెం పరిధిలో 14 ప్రాంతాల్లో 0.5 నుంచి 3 మీటర్ల మందం లాంప్రొయిట్ రాళ్లున్నట్టు కనిపెట్టారు. ఇవి 26 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించివున్నట్టు గుర్తించారు. భూగర్భంలో పసుపు నుంచి ఆకుపచ్చ రంగులో ఉండే ఈ రాళ్లలో కార్బొనేట్స్, సర్పింటైన్, ప్లొగ్రోఫైట్ డైక్స్ ఉన్నట్టు ప్రయోగశాలల్లో జరిపిన విశ్లేషణల్లో బయటపడింది. లాంప్రొయిట్ రాళ్లున్న ఈ ప్రదేశాల్లో కచ్చితంగా వజ్రాల గనులుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
యూజీసీ గ్రాంటుతో పరిశోధన: జీఎస్ఐ ఇచ్చిన ఆనవాళ్లను ఆధారంగా చేసుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన ఆచార్యులు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో వజ్రాల, బంగారం గనులపై పరిశోధనకు సిద్ధమయ్యారు. ఆచార్య సక్సేనా సమన్వయకర్తగా ఈ ప్రాజెక్టుకు యూజీసీ గ్రాంటు మంజూరు చేసింది. నల్గొండ జిల్లాలోనే మొదట 2012 డిసెంబరులో పరిశోధనకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక దశలో రీజినల్ సర్వే జరిపి గనులున్న ప్రాంతాలను గుర్తించారు. తర్వాత మాగ్నటిక్ సర్వే జరిపారు. భూగర్భంలోని మట్టి, నీటి నమూనాలను సేకరించి విశ్వవిద్యాలయంలోని ప్రయోగశాలలో విశ్లేషించారు. 2017 వరకు ఈ పరిశోధన కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిపిన పరిశోధనల ఫలితాలను అడ్వాన్సెస్ ఇన్ అప్త్లెడ్ సైన్స్ రీసెర్చ్ పేరుతో అమెరికన్ జర్నల్ ‘పెరాజియా’లో వివరంగా ప్రచురించారు.
ఏడు ప్రదేశాల్లో ఖనిజ నిక్షేపాలు గుర్తించాం
‘భూమి లోపల 40 కిలోమీటర్ల లోతు వరకు గ్రావిటీ మీటర్‌తో సర్వే చేశాం. మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి విశ్లేషించాం. వడ్డేపల్లి, ఎల్లాపురం మధ్యన, రామడుగు, చండూరు, ఎల్లంకి, రాయిగిరి, కొలనుపాక ప్రాంతాల్లో జియాలజికల్ ఫాల్ట్ ఉందని గుర్తించాం. అలాంటి చోట్ల ఖనిజాలుంటాయి. చండూరు, రాయిగిరి, మల్లేపల్లి ప్రాంతాల్లో భూమ్యాకర్షణ శక్తి ఎక్కువున్నట్టు గుర్తించాం. అక్కడ ‘మోహా’ ఉండడం వల్ల ఖనిజ నిక్షేపాలుండే అవకాశముంది. నాగార్జునసాగర్‌పైన కుర్మపల్లి-ఎల్లాపూర్ మధ్యన, అడవి దేవులపల్లి వద్ద, వల్లాపురం నుంచి వెల్దండ మధ్య, ఎల్లాపురం నుంచి రాయగిరి మధ్యన, మిర్యాలగూడ-చింతపల్లి మధ్యన, పిల్లలమర్రి-వల్లాపూర్, పిల్లలమర్రి-ఏటూరు మధ్య, భువనగిరి-రాయిగిరి మధ్య ఉండే ప్రదేశానికి భూభౌతిక ప్రాధాన్యత చాలా ఉంది. చండూరు-రామడుగు మధ్యన కింబర్ లైట్స్ ఉన్నాయి. అక్కడ క్యారట్ ఆకారంలో స్ట్రక్చర్స్ ఉన్నాయి. అక్కడ ఖనిజ నిక్షేపాలు బంగారం, వజ్రాల గనులు ఉండవచ్చు. జిల్లా అంతటా ప్రతీ 3 కిలోమీటర్లకు ఒకటి చొప్పున గ్రావిటీ సర్వే చేసి భూమిలోపల ద్రవ్యరాశి పరిమాణాన్ని లెక్కగట్టాం. మరింత పరిశోధన 2017 వరకు చేయనున్నాం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని జియోఫిజిక్స్ విభాగం ద్వారా 1970-80 ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ఖనిజ నిక్షేపాలపై పరిశోధనలు చేశాం. అక్కడ కొన్ని ప్రాంతాల్లో బైరైట్స్, ఐరన్ వంటి ఖనిజాలున్నట్టు గుర్తించి నివేదికలిచ్చాం. ఆ తర్వాత ఆ ఖనిజాలను వెలికి తీశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 1997-2002 మధ్యకాలంలో ఖనిజాన్వేషణ చేశాం. గద్వాలలో బంగారు గనులున్నట్టు గుర్తించాం. నల్గొండ జిల్లాలోని పెద్దవూర ప్రాంతంలో అలాంటి అనావాళ్లున్నాయి. జిల్లాలో వజ్రాల, బంగారు గనులతో పాటు దేవరకొండ ప్రాంతంలో యురేనియం, పెద్దవూర మండల పరిధిలో ఇనుప నిక్షేపాలు ఉన్నాయి. గనులున్న ప్రాంతంలో ప్రతీ 200 మీటర్లకు ఒకచోట భూగర్భంలో మాగ్నటిక్ సర్వే జరిపి ఖనిజాలున్న కొత్త జోన్స్ కనిపెట్టాం. మా పరిశోధన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తాం
« PREV
NEXT »

No comments

Post a Comment