తాజా వార్తలు

Wednesday, 9 September 2015

శ్రీమంతుడు తరువాత ఊర్లను బాగుచేసే పనిలో పడ్డ సెలబ్రిటీలు
పల్లె పిలుస్తోంది.. ఊరు రా.. రమ్మంటోంది. శ్రీమంతుడు తరువాత గ్రామాల దత్తతపై క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఊర్లను బాగుచేసే పనిలో పడ్డారు సెలబ్రిటీలు. గ్రామాల దత్తతకు కదలివస్తున్నారు రియల్ శ్రీమంతులు. ఊరు మనకు ఎంతో ఇచ్చింది.. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయ్యాలంటున్నారు. ఊరు బాగు కోసం తపిస్తున్న ప్రముఖులపై ఈ ప్రత్యేక కథనం.
 
ఊరికో శ్రీమంతుడు పుట్టుకొస్తున్నారు. గ్రామం బాగుపడితే దేశం బాగుపడుతుందనే కాన్సెప్ట్‌తో ముందడుగు వేస్తున్నారు. ప్రతి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్‌గా మార్చడానికి ఈ శ్రీమంతులు తమ శక్తులన్నీ దారపోస్తున్నారు. ఊరు బాగుంటే దేశం బాగుంటుంది. ఊరు అభివృద్ధి చెందితే.. దేశమూ అభివృద్ధి చెందుతుంది. మహాత్మా గాంధీ చెప్పింది ఇదే. ప్రధాని నరేంద్ర మోదీ ‘సంసద్ ఆదర్శ గ్రామ యోజన’ ఇదే. శ్రీమంతుడు సినిమా కాన్సెప్ట్ ఇదే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టిన ‘గ్రామజ్యోతి’ పథకం ఇదే.. ఏపీ సీఎం చంద్రబాబు కొన్నేళ్ల క్రితమే మొదలుపెట్టిన ‘జన్మభూమి’ కార్యక్రమమూ ఇదే.. ఉన్న ఊరికి ఏదో ఒకటి చెయ్యాలి. గ్రామం రూపు రేఖలు మార్చేయాలి. స్మార్ట్ విలేజ్‌లను రూపొందించాలి. వలసలను నివారించాలి. శ్రీమంతుడు సినిమా రిలీజ్ తరువాత ఈ అవగాహన బాగా పెరిగింది. సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. సొంతూర్లే కానక్కర్లేదు. కరువు కోరల్లో చిక్కుకున్న గ్రామాన్నో, అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న ఊరినో దత్తత తీసుకుంటున్నారు. వాటి రూపు రేఖలను మార్చేస్తామని ప్రతినబూనుతున్నారు.
 
పల్లెటూర్లు మన భాగ్యసీమలు.. దేశానికి అవే పట్టుకొమ్మలు. మంచితనం, మమకారం, మనిషి మనిషిలో కినిపించే ఆనందసుదా నిలయాలు. పాడిపంటలకు ఏమాత్రం లోటు ఉండని అక్షయ పాత్రలు. కానీ అదంతా గతవైభవం. ప్రస్తుతం మనదేశంలోని గ్రామాలు గొప్పగా ఉన్నాయా అంటే లేదనే చెప్పాలి. గ్రామాలు బాగోలేనప్పుడు. దేశం కూడా బాగోదు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ పల్లె సీమలపై దృష్టి పెట్టారు. వాటిని అభివృద్ధి బాటపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన మదిలో పుట్టిందే ‘సంసద్ ఆదర్శ గ్రామ యోజన’. ఈ పథకం కింద ఒక్కో పార్లమెంట్ సభ్యుడు మూడేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. వారణాసి సమీపంలోని ఓ గ్రామాన్ని మోదీ స్వయంగా ఎంచుకొని ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో గ్రామాల రూపురేఖలను మార్చేయాలని కంకణం కట్టుకున్నారు.
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి నినాదాన్ని ఎత్తుకోవడంతో సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు గ్రామాల దత్తతకు ముందుకు వస్తున్నారు. కానీ వీరందరికీ స్ఫూరిగా నిలిచిన వారు దివంగత నటుడు శ్రీహరి. ఆయన తన చిన్న కుమార్తె అక్షర పేరు మీద ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి హైదరాబాద్ శివార్లలోని మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. వాటి అభివృద్ధికి అక్షర ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఊరు అభివృద్ధి చెందాలంటే అదేదో ఒక్కరే ఎదగడం కాదు. చుట్టుపక్కల ఉన్నవారంతా ఎదిగితేనే ఊరు బాగుపడుతుంది. దీనికోసం ఇప్పుడు ఎందరో శ్రీమంతులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
 
క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యులు సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామమైన పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకున్నారు. ఆయన దత్తత తీసుకోవడంతోనే ఈ గ్రామాల దత్తతకు ఓ క్రేజ్ ఏర్పడింది. అది ఒక మారుమూల పల్లె. విద్య, వైద్యం, ఫోన్లు వంటి కనీస సదుపాయాలు లేవు. చినుకుపడితే గ్రామమంతా చిత్తడిచిత్తడే. మురుగునీరంతా వీధుల్లోనే ప్రవహిస్తుంటుంది. పారిశుద్ధ్యం అధ్వాన్నం. నీటి సౌకర్యం అంతంతమాత్రం. అలాంటి గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకు రావడమే అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ గ్రామంలో పర్యటించిన సచిన్.. దాని అభివృద్ధికి పక్కా ప్రణాళికను రూపొందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సదుపాయాలు పెంచే పనిలో పడ్డారు. స్థానిక వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. దీంతో ఆ పల్లె రూపురేఖలు నెమ్మదినెమ్మదిగా మారిపోవడం మొదలైంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం సంసద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద ఎంపిక చేసిన ఉత్తమ గ్రామాల జాబితాలో పట్టంరాజువారి కండ్రిగా కూడా చోటు దక్కించుకుంది.
 
నరేంద్ర మోదీ పిలుపుతో రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి తన సొంత జిల్లాలోనే ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామ బాగోగులు తానే స్వయంగా చూస్తానని చిరంజీవి ప్రకటించారు. ఇప్పుడు శ్రీమంతుడు సినిమా ఊరును దత్తత తీసుకోవడాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. అదే సమయంలో తెలంగాణ సర్కార్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో దీనికి మంచి ఊపు వచ్చింది. ఒకరితరువాత ఒకరు సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకోవడానికి క్యూ కడుతున్నారు. శ్రీమంతుడు సినిమా తన కెరీర్‌లో బెస్ట్ సినిమా అని పదేపదే చెప్పుకుంటున్న మహేష్.. తన స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆతరువాత తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచన మేరకు కరువు కోరల్లో అల్లాడిపోతున్న మహబూబ్‌నగర్‌లోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
 
యువనటుడు మంచు విష్ణు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో పది గ్రామాలను అభివృద్ధి చేయడానికి విష్ణు ముందుకు వచ్చారు. ఆయా గ్రామాల్లో మంచినీరు, మరుగుదొడ్లు కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందు మహారాష్ట్రలో బాగా వెనుకబడి ఆ తరువాత ప్రగతిపథంలో దూసుకుపోయిన షిర్‌పూర్ గ్రామంలో పర్యటించారు. అక్కడ పరిస్థితుల్ని అధ్యయనం చేశారు. తాను దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు.
 
మహేష్ బాటలోనే నడిచారు మరోనటుడు ప్రకాశ్ రాజ్. విలక్షణ నటుడిగా గుర్తింపుపొందిన ప్రకాశ్ రాజ్.. ఇప్పటికే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామజ్యోతి పథకానికి ఆకర్షితులైన ఆయన మంత్రి కేటీఆర్‌ను కలుసుకున్నారు. ఆయనతో చర్చించిన తరువాత మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ మరునాడే గ్రామంలో పర్యటించి గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రచించే పనిలో పడ్డారు.
 
ఇక నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన నియోజకవర్గంలోని కందకుర్తి, మాణిక్ బండార్, జగిత్యాల గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఊర్లను బాగుచేసే పనిలో పడ్డారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమగోదావరి జిల్లాలోని తీరప్రాంతాలైన పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు గ్రామాలను దత్తత తీసుకున్నారు.
 
ఇది ఆధునిక కాలం. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. సమాచార రంగంలో విప్లవంతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. దీంతో గ్రామాలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్లు వంటి అత్యవసర సదుపాయాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. మెరుగైన వైద్యం పల్లెల్లో కరువైంది. పల్లెటూర్లలో ఈ పరిస్థితుల కారణంగా ప్రజల ఉపాధి అవకాశాలు దెబ్బతిని పట్టణాలకు వలసపోతున్నారు. దీంతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం మాటలకే పరిమితమైపోయింది. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు నాయుడు స్మార్ట్ వార్డ్, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ ఏపీ అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాలను బాగు చేయాలని పిలుపునిచ్చారు. తాను స్వయంగా అరకు గ్రామ పంచాయతీని దత్తత తీసుకన్నారు. నారా లోకేష్, ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరును దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం జన్మించిన కొమరవోలు గ్రామాన్ని భువనేశ్వరి దత్తత తీసుకోగా, చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెను బ్రహ్మణి దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు. నారా లోకేష్ విదేశీ పర్యటనలు చేసి ఎందరో ఎన్నారైలు గ్రామాలు దత్తత తీసుకునేలా కృషి చేశారు.
 
ఏపీ అభివృద్ధి కోసం నిరంతర ప్రణాళికలు రచిస్తున్న చంద్రబాబు కృషిని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ప్రశంసించారు. ఏపీకి అండదండగా ఉండాలని నిర్ణయించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 264 గ్రామాలను దత్తత తీసుకున్నారు. టాటా ఫౌండేషన్ ఇక ఆ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందని రతన్ టాటా ప్రకటించారు.
సినీ హీరోలే కాదు.. పారిశ్రామిక వేత్తలు, పోలీసు అధికారులు కూడా గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. జన్మభూమికి ఎంతో కొంత చెయ్యాలని పరితపిస్తున్నారు. వలసల నివారణకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామం నార్శింపల్లిని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో పర్యటించి తొలిదశలో రూ. 3.50 కోట్లతో అభివ‌ృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక కర్నూలు ఎస్పీ రవికృష్ణ పగలు, కార్పణ్యాల గడ్డగా పేరుమోసిన కప్పట్రాళ్లను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాభివృద్ధికి పాటుపడటమే కాదు.. పగలు, ప్రతీకారాల స్థానంలో మమతానురాగాలు వెల్లివిరిసేలా ప్రజల్లో మార్పుకోసం కృషి చేస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా వివిధ కారణాలతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయిపోతున్నారు. పల్లెలు కనుమరుగైపోయి నగరాలు విస్తరిస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో వస్తున్న గ్రామజ్యోతి వంటి పథకాలు ఊరి వైభవాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడతాయ అన్నది వేచి చూడాల్సిందే. గ్రామాలను ప్రగతి పట్టాలెక్కించడం నిజంగా మంచి ప్రయత్నం. ఇది అర్థాయుశ్షుతో అంతరించిపోకూడదు. చిరంజీవిగా వర్ధిల్లాలి. ఈ సంకల్పాన్ని ప్రణాళికా బద్దంగా ఆచరణలో పెడితే విజయవాలు వాటంతట అవే వస్తాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment