తాజా వార్తలు

Sunday, 20 September 2015

అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవద్దు-కడియం

రైతులు అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని రాష్ర్ట మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు వారికి ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచింది. ఇప్పటి వరకు లక్షా 50 వేలు మాత్రమే ఇస్తుండగా దాన్ని 6 లక్షల రూపాయలకు పెంచింది. ఐదు లక్షల రూపాయలు రైతు కుటుంబానికి, మిగతా లక్ష రూపాయలతో అప్పులకు వన్ టైం సెటిల్ మెంట్ కింద చెల్లిస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలుంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద సాయం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచి అమలులోకి వస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రైతుల ఆత్మహత్యలపై మంత్రిమండలి విచారం వ్యక్తం చేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, వర్షపాతం, పంటలపై జిల్లాల వారీగా వివరాలతో సీఎం కేసీఆర్ సమీక్షించారని వెల్లడించారు. రబీకి అప్రోచ్ తయారు చేసుకోవాలని, నమోదైన వర్షపాతాన్ని బట్టి ఏ పంటలు వేసుకోవాలో వ్యవసాయ శాఖ గైడ్ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆత్మహత్యల నివారణకు రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకుందని కడియం శ్రీహరి గుర్తుచేశారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూశామని, కోతలు లేని కరెంట్ ఇస్తున్నామని, 2016 ఏప్రిల్ నుంచి పగటి పూట 9 గంటలు కరెంటు ఇవ్వాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ. 17 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశామన్నారు. ఇప్పటికే రూ. 8,500 కోట్లు రెండు విడతలుగా బ్యాంకులకు చెల్లించామని చెప్పారు. రైతుల ఆత్మస్థయిర్యాన్ని పెంచేవిధంగా రాతలు, కార్యాచరణ ఉండాలని ఈ సందర్భంగా మీడియా, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. రైతుల ఆత్మహత్యలపై గోరంతలు కొండంతలు చేసి వార్తలు రాయొద్దని, రాజకీయంగా వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment