తాజా వార్తలు

Wednesday, 9 September 2015

'యువ చిరంజీవిని ' బీహార్‌ ఎన్నికల లొ కూడా వాడుకోనున్న కాంగ్రెస్‌...!
'యువ చిరంజీవి' అనగానే రాంచరణ్‌ బీహార్‌ ఎన్నికల రంగంలో దిగుతున్నాడా.. ఇదేం కాంబినేషన్‌ చెప్మా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. బాలీవుడ్‌లోనే చేతులు కాలిన తర్వాత మళ్లీ ఈ బీహార్‌ గోలేమిటి అనుకోనక్కర్లేదు. ప్రస్తుతం బీహార్‌ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా రాజకీయాల్లో కాంగ్రెసు పార్టీకి ఒక 'చిరంజీవి' ఉన్నాడు. చిరంజీవ్‌రావు అనే ఆ యువకుడు.. రాష్ట్రీయజనతా దళ్‌ అధినేత లాలూప్రసాద్‌కు స్వయానా అల్లుడు. హర్యానా కాంగ్రెస్‌ అధ్యక్షుడైన చిరంజీవ్‌ను కాంగ్రెస్‌ రంగంలోకి తెచ్చి లాలూతో మంతనాలకు వాడుకుంటోంది. పైగా చిరంజీవ్‌.. రాహుల్‌ సొంత కోటరీలోని యూత్‌ లీడర్‌ కూడా!  బీహార్‌ ఎన్నికల విషయంలో ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్‌ కూటమిలో కాంగ్రెసుకు 40 సీట్లు దక్కాయి. వాటికి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆర్జేడీనుంచి పెద్దగా ఒత్తిళ్లు లేకుండా చూడాల్సిన బాధ్యత చిరంజీవ్‌ రావుపై పెట్టారు. బీహార్‌లో ప్రధానంగా కులాల ప్రాతిపదిక మీదనే ఎన్నికలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 14 శాతం ఉన్న అగ్రవర్ణాల ఓట్లను తమ ఓటుబ్యాంకుగా మార్చుకోవాలని కాంగ్రెస్‌ ఆలోచిస్తున్నది.  దీనికి అనుగుణంగా తమకు దక్కిన నియోజకవర్గాల్లో యాదవులు ఎక్కువగా ఉన్నచోట్ల లలూ, చిరంజీవ్‌ ఇద్దరూ కలిసి ప్రచారం చేస్తే.. మైలేజీ వస్తుందని కాంగ్రెస్‌ వ్యూహం. అయితే లాలూ మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి కొన్ని షరతులు విధిస్తున్నాట్ట. రాయబారానికి వచ్చింది స్వయంగా తన అల్లుడే అయినా.. కాంగ్రెస్‌ పార్టీనుంచి తనకు ఎంత మైలేజీ కావాలో అంత మైలేజీ పొందడం లక్ష్యంగా లాలూ షరతులు ఉన్నట్లుగా కనిపిస్తోంది. అల్లుడు అల్లుడే.. రాజకీయాలు రాజకీయాలే అన్నట్లుగా లాలూ వ్యవహార సరళి ఉన్నది. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే సామెత లాలూకు తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియదేమో!
« PREV
NEXT »

No comments

Post a Comment