తాజా వార్తలు

Saturday, 26 September 2015

సిత్రవిచిత్రాలున్న లోకేశ్ ఆస్తుల వివరాలు ....!మిగిలిన రాజకీయ నాయకులకు తాము బిన్నమని.. మరే పార్టీ అదినేత.. వారి పుత్ర రత్నం చేయని విధంగా తమ ఆస్తుల లెక్కలు చెప్పే బాబు ఫ్యామిలీ ప్రతి ఏటా తమ ఆస్తుల గురించి ఓ ప్రకటన చేస్తుంటుంది. తాజాగా అలాంటి ప్రకటననే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్ చేశారు.

తన తండ్రి.. తల్లి.. భార్య ఆస్తులతోపాటు తన ఆస్తుల వివరాల్ని వెల్లడించిన ఆయన.. రాజకీయ పార్టీలు.. అధినేతలు.. నేతలు తమ తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని కోరారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఆస్తుల వెల్లడి పేరిట చేసే కామెడీ షో ఏడాదికేడాది సాగటం ఇబ్బందికరమే. ఆస్తులు ప్రకటిస్తున్నామంటూ చెప్పే సదరు వివరాల్లోకి లోతుగా వెళితే.. అసలు విషయం ఇట్టేఅర్థమవుతుంది. ఇంత మాత్రం దానికి అంత హడావుడి అవసరమా అని అనిపించక మానదు.

వినేవాడు ఉంటే చెప్పే వాడు చెలరేగిపోతారన్న మాట మాదిరే తాజాగా లోకేశ్ మాటలున్నాయి. తమ ఆస్తుల చిట్టాను విప్పి చెప్పిన ఆయన వివరాలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది మరి.  బాబు ఫ్యామిలీ ఆస్తుల సిత్రాలు చూస్తే..

హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి మండలం మదీనగూడ ఎంతటి విలువైన ప్రాంతమో అందరికి తెలిసిందే. అలాంటి చోట 5ఎకరాల విస్తీర్ణంలో ఫాంహౌస్ అంటే ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని విలువ బహిరంగ మార్కెట్లో ఎంత ఉంటుందో అందరికి తెలిసినా.. లోకేశ్ బాబు మాత్రం దాని విలువను రూ.2.21కోట్లుగా మాత్రమే చూపించారు. ఐదు ఎకరాల విస్తీర్ణం.. ఫాంహౌస్ కలిపితే రూ.2.21 కోట్లేనా?

రోజులు గడుస్తున్న కొద్దీ ఆస్తుల విలువ పెరుగుతాయే కానీ తగ్గవు. అందులోకి అత్యంత ప్రముఖ ప్రాంతాల్లో భూమి ధర మండిపోయే పరిస్థితి. కానీ.. లోకేశ్ బాబు ప్రకటించిన తమ కుటుంబ సభ్యుల ఆస్తుల్లో మాత్రం ఒక విచిత్రం చోటుచేసుకుంది. తన తండ్రి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన ఆస్తుల విలువను గత ఏడాది ప్రకటించిన దాంతో పోలిస్తే.. 40 శాతమ వరకూ తగ్గించేసిన ఆయన.. అదే సమయంలో తన ఆస్తుల్ని మాత్రం పెంచినట్లు చూపించి కాసింత మేజిక్ చేశారు.

తన తండ్రి చంద్రబాబు ఆస్తుల విలువ గత ఏడాది రూ.70.69 లక్షలుగా చెప్పుకొచ్చారు. ఇందలో బంజారాహిల్స్ లోని ఇంటితో పాటు.. సేవింగ్స్ అకౌంట్ లో ఉన్న నగదుతో కలిపి తన తండ్రి ఆస్తి రూ.70.69 లక్షలుగా చూపించారు. కానీ.. ఈ ఏడాది ఆ ఆస్తుల విలువ రూ.42.40లక్షలుగా చూపించారు. ఇంత భారీగా ఎలా తగ్గిపోయిందని చూస్తే.. గత సంవత్సరం సేవింగ్స్ ఖాతాలో ఉన్న రూ.45.96 లక్షలు ఉండగా.. ఈ ఏడాది రూ.25.29లక్షలకు తగ్గిపోయింది. అంటే.. చిల్లర తీసేస్తే.. కాస్త అటుఇటుగా రూ.25లక్షలు సేవింగ్స్ ఖాతాలో తగ్గితే.. మొత్తం ఆస్తుల విలువలో రూ.28లక్షలు తగ్గిపోయినట్లు చూపించారు. అంటే.. బంజారాహిల్స్ ఇంటి విలువ గత ఏడాదితో పోలిస్తే రూ.3లక్షలు తగ్గించారన్న మాట.

అదే సమయంలో తన తల్లి భువనేశ్వరి ఆస్తుల విషయంలో మాత్రం లోకేశ్ ఆస్తుల చిట్టా కొత్త విషయాల్ని చెబుతోంది. పంజాగుట్టలోని ఇల్లు.. రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూముల విలువ కలిపితే గత ఏడాది కంటే సుమారు రూ.2.4కోట్ల మేర పెరిగినట్లు చూపించారు. తండ్రి ఆస్తుల విలువ తగ్గితే.. తల్లి ఆస్తుల విలువ మాత్రం పెరగటం గమనార్హం.

ఇక.. లోకేశ్ ఆస్తుల వివరాల్లోకి వెళితే.. గత ఏడాది ఆస్తుల చిట్టాలో మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో 8.4ఎకరాల వ్యవసాయ భూమిని చూపించారు. అప్పట్లో దాని విలువ రూ.58.6లక్షలుగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఆస్తుల ప్రటనల జాబితాలో సదరు ఆస్తి కనిపించలేదు. మరి.. దాన్న అమ్మారా? అన్న వివరాలు వెల్లడించలేదు. ఇలా సిత్రవిచిత్రాలున్న బాబు ఫ్యామిలీ ఆస్తులు విలువ లోకేశ్ మాటల్లో చెప్పాలంటే రూ.61.25కోట్లు. కొసమెరుపేమంటే.. పాలు.. కూరగాయలు.. అమ్ముకుంటూ సంతృప్తిగా ఉన్నామంటూ చెప్పిన లోకేశ్.. ఇతరుల మాదిరి తాము సిమెంటు.. ఇనుము.. వ్యాపారాలు చేయటం లేదంటూ రాజకీయ కోణాన్ని విడిచిపెట్టలేదు.

Newsdesk
« PREV
NEXT »

No comments

Post a Comment