తాజా వార్తలు

Friday, 25 September 2015

మండవ వెంకటేశ్వరరావు కారు ఎక్కనున్నాడా...?


ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఒకప్పుడు కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో పట్టు చూపించేది.. తెలంగాణ ప్రాంత జిల్లాల్లోనూ ఆ పార్టీకి తిరుగుండేది కాదు. నిజామాబాద్ జిల్లా అందుకు ఉదాహరణ. అక్కడ గతంలో 9 సీట్లకు 9 సీట్లూ టీడీపీయే గెలుచుకున్న సందర్భాలున్నాయి. ఆ జిల్లా నుంచి ఒకే సమయంలో ఎక్కువ మంది మంత్రులయ్యారు కూడా. మండవ వెంకటేశ్వరరావు.. పోచారం శ్రీనివాసరెడ్డి వంటివారు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించేవారు. పోచారం ఇప్పటికే టీఆరెస్ లోకి వెళ్లి ఆ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా దక్కించుకోగా మరో నేత మండవ వెంకటేశ్వరరావు కూడా అదే దారిలో సాగబోతున్నారని తెలుస్తోంది. 

మండవ వెంకటేశ్వర రావు చాలాకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నాయకుడైన ఆయన పార్టీకి దూరంగా ఉండడంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. డిచ్ పల్లి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికయిన ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత చాలా కాలం నుంచి ఆయన పార్టీకి దూరంగానే ఉంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదని... జిల్లా పార్టీ కార్యాలయానికి కూడా ఆయన పెద్దగా వెళ్లడం లేదని అంటున్నారు.

ఈ పరిణామలన్నీ గమనిస్తున్న టీఆరెస్ ఆయనకు గాలం వేస్తోందని... ఆ పార్టీ నాయకుడు ఒకరు ఇప్పటికే మండవతో మాట్లాడారని సమాచారం. దీంతో ఆయన టీడీపీని వీడుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ వర్గాలు మాత్రం ఆయన రాజకీయాల నుంచి దూరమవుతారు కానీ టీఆరెస్ లో చేరబోరని చెబుతుండగా... ఇంకొందరు మాత్రం త్వరంలో ఆయన టీఆరెస్ లో చేరుతారని చెబుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment