తాజా వార్తలు

Friday, 25 September 2015

అమెరికా పర్యటనలో మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అమెరికాలో పర్యటిస్తున్నరు. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగం, ఒబామాతోనూ, పలు దేశాధి నేతలతోనూ ద్వైపాక్షిక చర్యలు, దిగ్గజ ఐటీ సంస్థల సీఈవోలతో ముఖాముఖి సంభాషణలు, ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగం... ఇలా భారీషెడ్యూల్‌తో ఈ పర్యటన మొదలైంది. ప్రస్తుతం మోదీ బస చేస్తున్న హోటల్‌ను చైనా ఇన్సూరెన్స్‌ కంపెనీ గతేడాది కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో భద్రతా, నిర్వహణ వ్యయం అంశాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈ హోటల్లో ఉండడం లేదు. కాగా, పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తోపాటు పలు దేశాల నేతలకు కూడా ఈ హోటల్‌లోనే వసతి కల్పించారు. కానీ, షరీఫ్‌తో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలూ లేవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, ఐరాస సెక్రటరీ జనరల్‌ బాన్‌కీ మూన్‌ నేతృత్వంలో శుక్రవారం జరిగే సుస్థిర అభివృద్ధి సదస్సులో ప్రపంచ నేతలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. శనివారం జీ-4 సదస్సులో బ్రెజిల్‌, జపాన్‌, జర్మనీ దేశాల నేతలు మోదీ నేతృత్వంలో సమావేశమై... భద్రతా మండలిని సత్వరమే సంస్కరించడంపై దృష్టి పెట్టనున్నారు. ఫ్రాన్స్‌, భూటాన్‌, స్వీడన్‌, గయనా, సైప్రస్‌ తదితర దేశాల నేతలతోనూ చర్చలు జరుపుతారు. శుక్ర, శని వారాలు న్యూయార్క్‌లోనే ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాక... శనివారం సాయంత్రం సిలికాన్‌ వ్యాలీకి మోడీ బయలుదేరుతారు. ఫేస్‌బుక్‌, యాపిల్‌, గూగుల్‌ తదితర సాఫ్ట్‌వేర్‌ కంపెనీల సీఈవోలతో భేటీ అవుతారు. 27న అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం న్యూయార్క్‌ వచ్చి... ఒబామాతో భేటీ అవుతారు. అనంతరం ఐరాస శాంతిపరిరక్షకులతో సమావేశమవుతారు. 28 అర్ధరాత్రి గానీ, 29వ తేదీ తెల్లవారుజామునగానీ మోదీ తిరిగి భారత్‌కు పయనమవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి .  
« PREV
NEXT »

No comments

Post a Comment