తాజా వార్తలు

Tuesday, 8 September 2015

ముంబై పోలీస్ బాస్ పై అకస్మాత్తుగా బదిలీ వేటు
రాజకీయం తలుచుకోవాలే కానీ.. జరగని పనులంటూ ఏమీ ఉండవన్న విషయం మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముంబయి పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు మహారాష్ట్ర సర్కారు ఊహించని షాక్ ఇచ్చింది. అత్యంత ప్రముఖుల కుటుంబానికి సంబంధించిన ఈకేసు విషయంలో ఏ మాత్రం తగ్గకుండా వ్యవహరిస్తూ..కొత్తకొత్త విషయాలను తెరపైకి తెస్తున్న ఆయనపై అకస్మాత్తుగా బదిలీ వేటు పడటం ఇప్పుడు చర్చగా మారింది.

ఈ బదిలీ వేటును ప్రభుత్వం.. రోటీన్ వ్యవహారంగా చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ హత్య కేసు వెనుక భారీ ఆర్థికలావాదేవీలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జపాన్ పర్యటనకు వెళ్లిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. తన ప్రయాణానికి ముందు బదిలీవేటు నిర్ణయాన్ని తీసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షీనా బోరా కేసును డీల్ చేస్తున్న కమిషనర్ రాకేష్ మారియా తీరుపై ముఖ్యమంత్రి అసంతీప్తితో ఉన్నట్లుగా వస్తున్న వార్తలు.. తాజా వేటుతో వాస్తవమని తేలినట్లుగా చెబుతున్నారు. నిజానికి షీనాబోరా కేసు దాదాపుగా పూర్తయి.. మరికొద్ది రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయనున్న సమయంలో ఆయన్ను మార్చటం ఏమిటన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేవారు లేకపోవటం గమనార్హం.

ముంబయి పోలీస్ కమిషనర్గా ఉన్న ఆయన్ను.. హోంగార్డ్స్ జనరల్ గా పదోన్నతి కల్పిస్తూ బదిలీ వేశారు. అయితే..  ఈ కేసు దర్యాప్తు బాధ్యతల్ని ప్రత్యేకంగా ఆయనకే అందించాలన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు.. లలిత్ మోడీతో కొన్నేళ్ల క్రితం రాకేశ్ మారియా విదేశాల్లో కలిశారన్న అంశం కొద్ది నెలల కిందట వెలుగు చూసిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకొని ఉంటారన్న విశ్లేషణ పలువురు చేస్తున్నారు. ఏది ఏమైనా.. రాకేష్ మారియా బదిలీతో.. షీనా బోరా కేసులో స్తబ్దత ఏర్పడే అవకాశం ఉందన్న మాట పలువురి నోటి నుంచి రావటం విశేషం.
« PREV
NEXT »

No comments

Post a Comment