తాజా వార్తలు

Saturday, 19 September 2015

జగన్ మోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్‌ల రహస్య సమావేశం....!???

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచినా అది ప్రతిపక్షానికే పరిమితం అవుతూ వస్తోంది. 2004లో ఇక్కడ నుంచి పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా గెలిచాడు. అదే టర్మ్‌లో తెలుగుదేశం పార్టీ పదేళ్ల అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2009లో కూడా ఇక్కడ తెలుగుదేశం తరపున ఆయనే ఎమ్మెల్యేగా గెలిచాడు. మళ్లీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అయ్యింది.  ఇక గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి విశ్వేశ్వరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. వైకాపా తరపున పోటీ చేసి ఆయన అలా గెలవగానే... తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. వైకాపా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఈ సెంటిమెంటును పక్కనపెడితే ఇలాంటి నియోజకవర్గం నుంచి 2004, 2009లలో గెలిచి తెలుగుదేశం తరపున గట్టిగా పోరాడిన.. మాట్లాడిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. సామాజికవర్గ పరంగా చూసుకుంటే కమ్మ కులస్తుడు.  ఎన్నికల ముందు వరకూ జగన్‌పై బాగా దుమ్మెత్తిపోసిన నేతల్లో ఒకరు పయ్యావుల. జగన్ మామూలు ఆరోపణలు కాదు.. తీవ్రాతీవ్రమైన ఆరోపణలు చేశాడీయన. జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో విచారణ జరుగుతున్న సమయంలో... అయితే విజయసాయిరెడ్డికి ఏమైనా జరుగుతుందేమో.. విజయసాయిని జగన్ ఏమైనా చేయిస్తాడేమో.. అని కూడా పయ్యావుల కేశవ్ అనుమానాలు వ్యక్తం చేశాడు. మరి అంతలా జగన్‌పై విరుచుకుపడే తత్వం ఉన్న కేశవ్  పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశంలో చిత్ర విచిత్రంగా తయారైంది.  ఆయన... తెలుగుదేశంలో అనుకున్నది దక్కక..ఆశించినంత ప్రాధాన్యత దక్కక దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ప్రెజెంట్ పయ్యావుల పరిస్థితి ఏమిటంటే.. ఆయన ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీని విడిచి వైఎస్సార్ కాంగ్రెస్ వైపు వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ తెలుగుదేశంలోనే ఉండినా... ఆయనకు అక్కడ దక్కపోయేది మాత్రం నథింగ్! ఇంకా లోతుగా పరిశోధిస్తే అర్థమయ్యే విషయం ఏమిటంటే.. పయ్యావుల కేశవ్ ఇప్పటికే ఒకసారి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కూడా అయ్యాడు! విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇటీవలే జగన్ మోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్‌ల సమావేశం కూడా జరిగింది. నిజంగా ఇది చాలా ఆసక్తికరమైన సమావేశమే. ఎందుకంటే.. బాబు క్యాబినెట్ విస్తరణ గనుక జరిగితే కేశవ్ మంత్రి అయిపోతాడు అనే అంచనాల దగ్గర నుంచి ఆయన జగన్‌తో రహస్యంగా సమావేశం అయ్యేంత వరకూ వచ్చింది పరిస్థితి. ఎందుకలా అంటే... చాలా కథే ఉంది! అసలు తెలుగుదేశం అధినేత తన క్యాబినెట్ ఏర్పాటు రోజే పయ్యావులను మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాల్సింది.  ఎందుకంటే... అంతలా తెలుగుదేశం పార్టీకి సేవలు చేశాడు ఆయన. ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు అనే రీజన్‌తో బాబు పయ్యావులను పక్కనపెట్టాడు. అసలు ఎన్నికల్లో పోటీ చేయని నారాయణ వంటి వాళ్లను రాష్ర్ట క్యాబినెట్‌లోకి, సుజనాచౌదరి వంటి వ్యాపారిని కేంద్ర క్యాబినెట్‌లోకి చేర్చిన బాబు పార్టీ కోసం కష్టపడ్డ పయ్యావులను పక్కనపెట్టాడు. అప్పటికీ పయ్యావుల తనకు మంత్రిపదవి ఇవ్వకపోవడం గురించి బాబునే సూటిగా అడిగాడట.  ఎన్నికల్లో ఓడిపోయావు.. కాబట్టి నువ్వు అనుభవించాల్సిందే అనే కామెంట్‌తో బాబు పయ్యావులను మరింత ఒత్తిడిలోకి నెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో పయ్యావులపై అనంతపురం జిల్లాలో ఒత్తిళ్లు అధికం అయ్యాయి. పరిటాల ఆధిపత్యాన్ని సహించని ఈయనపై మంత్రి పదవి దక్కిన సునీత నుంచి ఆధిపత్యం మరింత ఎక్కువ అయ్యింది.  ఇలాంటి నేపథ్యంలో లభించిన చిన్న ఊరట ఏమిటంటే... ఎమ్మెల్సీ పదవి దక్కడం. అయితే ఈ మాత్రానికి ఆయన సంతృప్తి పడలేదు. ఇక ఇదే సమయంలో.. పయ్యావులపై చంద్రబాబుకు అనేక ఫిర్యాదులు చేశారు తెలుగుదేశం నేతలు. బాబుకు కూడా పయ్యావులపై ఎన్నికల్లో ఓడిపోవడంతోనే గుడ్ ఇంప్రెషన్ పోయింది. నిత్యం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్లు పెట్టడం కాదు.. నియోజకవర్గంకు వెళ్లి పనులు చూసుకొమ్మని తను సూచించినా పయ్యావుల వినలేదని బాబుకు ఆయనపై తీవ్రమైన అసంతృప్తే ఉందని తెలుస్తోంది.  ఇలాంటి వరస పరిణామాలతో ఈ తెలుగుదేశం నేత తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడప్పుడే తనకు సరైన భవిష్యత్తు ఉండదని కూడా స్పష్టం కావడంతో.. పయ్యావుల జగన్ వరకూ వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేతతో టచ్‌లో ఉంటే మంచిదన్న లెక్కతో ఆయన రహస్య సమావేశానికి వచ్చినట్టు తెలుస్తోంది.  ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు వరకూ రావడంతో... పయ్యావుల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని టాక్. ఇప్పటికే తెలుగుదేశం అనుకూల మీడియాకు కూడా మౌఖిక ఆదేశాలు వెళ్లాయట..పయ్యావులకి ప్రాదాన్యత తగ్గించాలని.. ఆయన వార్తల స్థాయిని జిల్లా లెవల్ కు తీసుకెళ్లాలని.. మెయిన్‌లో చోటు ఇవ్వాల్సిన అవసరం లేదనే ఆదేశాలు వెళ్లాయని సమాచారం.  మరి ఇదంతా చూస్తుంటే.. పయ్యావుల కేశవ్ పరిస్థితి తెలుగుదేశంలోమరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఒకసారి జగన్‌తో మీట్ అయ్యాడని తెలుగుదేశం పార్టీ నేతల నుంచినే విమర్శలు ఎదుర్కొంటున్న పయ్యావుల చివరకు జగన్ గూటికే చేరకతప్పదా? లేక తిరిగి ఆయన తెలుగుదేశం అధినేత మనసు గెలుచుకోగలడా? వేచి చూడాలి! 
« PREV
NEXT »

No comments

Post a Comment