తాజా వార్తలు

Monday, 28 September 2015

రాజమౌళి మనసులో వెయ్యి కోట్ల సినిమా బడ్జెట్ ?ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన టాలీవుడ్ క్రేజీ దర్శకుడు... ఎవరూ ఊహించనంత బడ్జెట్ తో సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నాడట. అన్నీ అనుకున్నట్టు జరిగితే... రెండు మూడేళ్లలోనే వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఆయన సినిమా చేస్తాడనే ప్రచారం ఇండస్ట్రీలో సాగుతోంది.
బాహుబలి వంటి భారీ హిట్ అందుకున్న దర్శకుడు రాజమౌళి... త్వరలోనే ఈ మూవీ సీక్వెల్ అయిన బాహుబలి 2ను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. ఈ సినిమా కూడా బాహుబలి తరహాలోనే ఓ ఐదు వందల కోట్లు వసూలు చేయడం ఖాయమనే టాక్ ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇక బాహుబలి 2 తరువాత రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా ఏంటనే దానిపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే బాహుబలి 2 తరువాత జక్కన్న ఈగ సీక్వెల్ తెరకెక్కించే అవకాశం ఎక్కువగా ఉందని హీరో నాని ట్వీట్ చేయడంతో... దర్శకధీరుడి ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఈగ 2 అని ఫిక్స్ అయ్యారు సినీ జనం. ఈగ సీక్వెల్ తెరకెక్కిస్తే... అది కూడా బాహుబలి తరహాలోనే వందల కోట్లు వసూలు చేస్తుందనే ఐడియాతోనే జక్కన్న ఆ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.
ఇవన్నీ ఎలా ఉన్నా... లేటెస్ట్ గా బాహుబలి తరువాత రాజమౌళి ఓ వెయ్యి కోట్ల సినిమాను ప్లాన్ చేస్తున్నాడనే న్యూస్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జక్కన్న మనసులో గరుడ అనే ఓ వెయ్యి కోట్ల భారీ ప్రాజెక్ట్ ఉందని... బాహుబలి 2 తరువాత ఈ భారీ ప్రాజెక్ట్ ను ఆయన చేపట్టే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నటించేది ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా... ఈ మూవీ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించే పనిలో రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ నిమగ్నమయ్యారనే ప్రచారం మొదలైంది. ఇండియాలోని అన్ని భాషలతో పాటు ఇంగ్లీష్, చైనీస్ వంటి పలు విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను ఏకకాలంలో రిలీజ్ చేస్తే... వెయ్యి కోట్ల పెట్టుబడిని రాబట్టడం అంత కష్టమేమీ కాదని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జక్కన్న ప్రపోజల్ కు తగ్గట్టుగా ఆ రేంజ్ లో బడ్జెట్ పెట్టి సినిమా తీసేందుకు పలు అంతర్జాతీయ సినీ సంస్థలు ముందుకు రావొచ్చనే మాటలూ వినిపిస్తున్నాయి. మొత్తానికి... బాహుబలితో ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన దర్శకధీరుడు... అంతర్జాతీయ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ వెయ్యి కోట్ల బడ్జెట్ తో సినిమా తీసినా... అది ఈజీగా లాభాలను తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. 
 
Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment