తాజా వార్తలు

Wednesday, 23 September 2015

రిజర్వేషన్లపై సమీక్ష ఎందుకు-కేంద్రం

రిజర్వేషన్లను సమీక్షించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  దేశంలోని వివిధ వర్గాలకు కల్పిస్తున్న రిజర్వేషన్లపై పార్టీలు, సంఘాల వ్యాఖ్యలతో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో... కేంద్రం స్పందించింది. కేబినెట్‌ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాతో ఈ విషయం చెప్పారు. సోమవారమే ఈ విషయంపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వాల వైఖరిని స్పష్టం చేశానని, ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వెనుకబడిన వర్గాల ప్రజల ఆర్థిక, విద్యా, సామాజిక పురోగతికి రిజర్వేషన్లు తప్పనిసరి అని తాము విశ్వసిస్తున్నామన్నారు. కాబట్టి రిజర్వేషన్లపై పునరాలోచించాల్సిన అవసరమే లేదని అన్నారు. కాగా, రిజర్వేషన్లు సమీక్షించాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు విశ్వ హిందూ పరిషత్‌ మద్దతు ప్రకటించింది. రిజర్వేషన్లను పదేళ్ల తర్వాత పరిశీలించాలని రాజ్యాంగ రూపకర్తలే సూచించారని, అందుకని... ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వేషన్లు అవసరమైన కులాలేమైనా ఉంటే గుర్తించడానికి ఒక జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్‌ కేంద్రాన్ని కోరారు. కాగా, ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ వ్యాఖ్యలపై పలు పార్టీలు భగ్గుమన్నాయి. రిజర్వేషన్లను తగ్గించే చర్యలు తీసుకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని జేడీయూ, ఆర్‌జేడీ, బీఎస్పీ తదితర పార్టీలు కేంద్రాన్ని హెచ్చరించాయి. దమ్ముంటే రిజర్వేషన్లను ఎత్తివేసి చూడాలని కేంద్రానికి సవాలు విసిరాయి. బిహార్‌ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రస్తుతం ఈ అంశాన్ని లేవనెత్తిందని సీపీఐ ఆరోపించింది. ఈ నేపథ్యంలో, ప్రస్తుత రిజర్వేషన్ల వ్యవస్థపై పునరాలోచించాలని అనుకోవడం లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment