తాజా వార్తలు

Monday, 28 September 2015

'ఆట నువ్వు మొదలెట్టావ్‌.. వేట ఇప్పుడే మొదలైంది..' ........రేవంత్‌రెడ్డి సవాల్‌...!'ఆట నువ్వు మొదలెట్టావ్‌.. వేట ఇప్పుడే మొదలైంది..' అంటూ జైలు నుంచి విడుదలవుతూ 'ఓటుకు నోటు' కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పదే పదే ఆయన అదే డైలాగ్‌ పేల్చుతుండడంతో తెలంగాణ ఏసీబీ, ఇటీవల ఆయన బెయిల్‌ నిబంధనల్ని కఠినతరం చేయాలనీ, బెయిల్‌ షరతుల్ని ఆయన ఉల్లంఘిస్తున్నారనీ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ఈ రోజు ఉదయం రేవంత్‌రెడ్డి మరో మారు 'వేట' డైలాగ్‌ ఉపయోగించేశారు. 'నా కళ్ళలోకి చూసే ధైర్యం లేక.. నా మాటల్ని వినేందుకు ఓపిక లేక.. నన్ను అసెంబ్లీలో మాట్లాడనివ్వడంలేదు..' అంటూ రేవంత్‌రెడ్డి గుస్సా అయ్యారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఇరుకున పెడ్తానంటూ రేవంత్‌రెడ్డి సవాల్‌ చేసేశారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటోంటే తెలంగాణ సర్కార్‌ చోద్యం చూస్తోందన్న రేవంత్‌రెడ్డి, రైతుల్ని ఇబ్బంది పెట్టిన ఏ రాజకీయ పార్టీ మనుగడ సాధించలేదని మండిపడ్డారు. 'పోలీసులూ మీ పని మీరు చేయండి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శాశ్వతం కాదు..' అంటూ పోలీసులకు సైతం రేవంత్‌రెడ్డి ఉచిత సలహా ఇచ్చేశారు.
ఇదిలా వుంటే తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు వెరైటీగా అసెంబ్లీకి వెళ్ళారు. ఎడ్లబండ్లపై చెర్నాకోల్‌ చేతపట్టి అసెంబ్లీకి వెళ్ళడం గమనార్హం. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎడ్లబండ్లపై అసెంబ్లీలోకి అనుమతి లేదని, భద్రతా కారణాల రీత్యా ఆ ప్రయత్నాలు విరమించుకోవాలని పోలీసులు, టీడీపీ నేతలకు సూచించారు. దాంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది.
మరోపక్క రైతుల ఆత్మహత్యల పాపం తమది కాదనీ, గత పాలకుల నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపంగా మారిందని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అంటోంది. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నది టీఆర్‌ఎస్‌ వాదన. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు రైతులపై చర్చ జరగాల్సి వుందనీ, అయితే ఎజెండాలో రైతుల ఆత్మహత్యల అంశం లేకపోవడమేంటని కాంగ్రెస్‌ పార్టీ మండిపడ్తోంది.
వరుస సెలవుల అనంతరం కాస్సేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీలో ఎటూ పాలక, ప్రతిపక్షాల మధ్య రచ్చ తారాస్థాయిలో జరగనుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రేవంత్‌రెడ్డి సవాల్‌ సంగతేంటో, కాంగ్రెస్‌ గుస్సా అవడమేంటో, అధికార పార్టీ సమాధానం ఇచ్చడేందో కాస్సేపట్లో తేలిపోనుంది.

News Desk-TG
« PREV
NEXT »

No comments

Post a Comment