తాజా వార్తలు

Saturday, 31 October 2015

అమెరికాలో సెక్స్ రాకెట్ ముఠా అరెస్ట్

అమెరికాలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నరు. వారికి భారీ జరిమానా వేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లాటిన్ అమెరికన్ మహిళలను, బాలికలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన 29 మందిపై అమెరికాలో ఆరోపణలు నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణ అనంతరం వీరిలో 15 మందిని అరెస్ట్ చేశామని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. దాదాపు15 నెలల విచారణ అనంతరం హోం ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ వీరిపై అభియోగాలు నమోదుచేసింది. ఈ నేరాలకు సంబంధించి పకడ్బందీ వ్యవస్థ ఒకటి జార్జియా రాష్ట్రంలో పనిచేస్తోందని గుర్తించారు. మెక్సికో, మధ్య అమెరికాకు చెందిన మహిళలను మభ్యపెట్టి,  ఎరవేసి అక్రమంగా సరిహద్దు దాటించడం, అనంతరం బలవంతంగా ఈ కూపంలోకి నెట్టడమే వీరి పని. ఈ క్రమంలోనే చాలామంది బాలికలను, మహిళలను మోసగించి, భయపెట్టి వ్యభిచార కూపంలోకి నెట్టారు. సవన్నా, మౌల్ట్రీ  నగరాలు  కేంద్రంగా ఈ వ్యవస్థ  తన కార్యకలాపాలు నిర్వహిస్తోందని విచారణలో తేలింది. బాధితులకు అత్యవసర వైద్య సదుపాయంతో పాటు అమెరికాలోనే పునరావాసాన్ని ఏర్పాటు చేశామని విచారణ అధికారులు తెలిపారు.  తుది విచారణ పూర్తయ్యేవరకు న్యాయవ్యవస్థ సహాకరంతో వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సెక్స్ ట్రాఫికింగ్ లో చిక్కుకున్న బాధిత మహిళలకు తాత్కాలిక  వీసా సౌకర్యాన్ని కూడా కల్పించారు. శాశ్వత వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా మూడు సంవత్సరాలు పాటు ఈ తాత్కాలిక వీసా చెల్లుబాటయ్యేలా అవకాశం కల్పించామని  అధికారులు తెలిపారు. 13 నగరాల్లో గాలించి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏజెన్సీ  ప్రతినిధి తెలిపారు. వీరికి జీవిత ఖైదుతో పాటు 2.50 లక్షల డాలర్లు అంటే... భారత కరెన్సీలో దాదాపు రూ. 1.63 కోట్లు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది.
« PREV
NEXT »

No comments

Post a Comment