తాజా వార్తలు

Wednesday, 14 October 2015

చంద్రబాబు అవినీతిలో కేంద్రంలోని పెద్దలకు కూడా వాటా...???నీతుల గురించి, నీతిమయమైన జీవితం గురించి, చాయ్‌ అమ్ముకుంటూ ఎదిగివచ్చిన వైనం గురించి, ఆరెస్సెస్‌ ప్రచారక్‌ గా నేర్చుకున్న విలువల గురించి.. శ్రవణపేయమైన కథలను వినిపించే అద్భుత శక్తి ఉన్న ప్రధాని నరేంద్రమోడీ.. ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే గనుక.. అవినీతిని కూకటివేళ్లతో సహా పెకలించి వేస్తారని ఆయనకు ఓటు వేసిన ప్రతి సామాన్యుడూ తలపోసాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ క్షణం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రతి పని కూడా తెల్లారేలోగా జరిగేది కాదు. అయితే అవినీతి పరంగా సంస్కరణలు కూడా మోడీ మొదలు పెట్టారో లేదో సామాన్యుడి కళ్లకు కనిపించడం లేదు. నీతిబద్ధమైన నాయకుడు అంటే.. తాను అవినీతి చేయకుండా ఉండడం మాత్రమే కాదు.. తన పరిధిలోని వారెవ్వరూ కూడా చేయకుండా ఉండేలా చూడగలిగిన వాడు మాత్రమే! మరి మోడీ ఆ విషయాన్ని నిరూపించుకుంటున్నారా? ఆ పాయింటు దగ్గరే అందరికీ సందేహాలు రేగుతున్నాయి. 
మన రాష్ట్ర వ్యవహారంలోనే ఈ సందేహాలు..! పోలవరం ప్రాజెక్టు అనేది జాతీయ ప్రాజెక్టు హోదా సంతరించుకున్నది. దానికోసం ఒక పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటుచేసి వారిద్వారా పనులు చేయాల్సి ఉంది. అయితే పోలవరం జాతీయ ప్రాజెక్టు గనుక.. దానికి సంబంధించిన నిధులన్నీ వారే ఇవ్వాలి. వారే సదరు అథారిటీ ద్వారా ఖర్చు చేయాలి కూడా. ఇక రాష్ట్రప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు. అయితే ఇప్పటిదాకా ఆ ప్రాజెక్టుకు కేంద్రం విదిల్చిందతతి ముష్టి మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం దాని నిర్వహణ , పర్యవేక్షణ బాధ్యతను కేంద్రానికి అప్పగించకపోవడమే దానికి కారణం అని అందరూ అంటున్నారు. పోలవరం పనులు చేయించే, కాంట్రాక్టర్లకు సొమ్ములు యిచ్చే అధికారం తమ చేతినుంచి కేంద్రానికి వెళ్లిపోవడం అనేది చంద్రబాబునాయుడు సర్కారుకు ఇష్టం లేదు. 
సొమ్ములు కేంద్రానివి అయినప్పుడు.. బాధ్యత వారినెత్తిన పారేస్తే చంద్రబాబుకు నష్టమేంటి? అని సామాన్యులు అనుకుంటారు. కానీ, ఆయన మాత్రం మీ సొమ్ములు నాకివ్వండి, నేను కాంట్రాక్టరుకు ఇస్తా... నాకు నచ్చినట్లుగా.. అంచనాలు పెంచి వారికి ఇస్తా.. అంటున్నారు. అందుకే 16వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు అంచనాలను తన ఇష్టానుసారం 31 వేల కోట్లకు అమాంతం పెంచేశారు. జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ.. దాని నిర్వహణ ఇంకా రాష్ట్రం చేతిలోనే ఉన్నందున ఈ 'పెంచడం' అనేది చంద్రబాబు ఇష్టానుసారం జరిగిపోయింది. 
అయితే ఈ నిర్ణయాన్ని కేంద్రం నిలదీయాల్సి ఉంది. జాతీయ ప్రాజెక్టు అంటే. అది కేంద్రప్రభుత్వపు ప్రాజెక్టు. దానికి సంబంధించి అంచనాల్ని రివైజ్‌ చేసే హక్కు నీకెక్కడిదంటూ.. మోడీ సర్కారు, చంద్రబాబు సర్కారును ప్రశ్నించాల్సిందే. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా జరుగుతున్న ఈ బాగోతాన్ని అరికట్టడానికి.. ముందుగా నిర్వహణ ను కేంద్రం తమ చేతుల్లోకి తీసుకుని., వారు సరైన అంచనాలు వేసి.. అవసరమైతే పెంచి... పనులు నడిపించాలి. ఎప్పుడూ నీతి వచనాలు వల్లించే ప్రధాని మోడీ.. ఈ విషయంలో కనీసం చంద్రబాబునాయుడును ప్రశ్నించకుండా.. నిలదీయకుండా.. మన్నుతిన్న పాములా వ్యవహరిస్తే గనుక.. కేంద్రంలోని పెద్దలకు కూడా జరుగుతున్న అవినీతిలో వాటా ఉన్నదని సామాన్యుడు అనుకుంటాడు. డైలాగ్‌ పార్ట్‌ కాదు... తమ పరిధిలో జరిగే అవినీతిని నియంత్రించడం కూడా తమ యాక్షన్‌ పార్ట్‌ కావాలని మోడీ తెలుసుకోవాలి. 
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment