తాజా వార్తలు

Monday, 26 October 2015

ఆవిరవుతున్న చమురు సిరి


  • దేళ్లలో అంతేసంగతంటున్న ఐఎంఎఫ్‌
  • ఆవిరవుతున్న చమురు సిరి
  • ప్రభావం చూపిస్తున్న ధరల పతనం

ముడి చమురు పీపా 45 డాలర్లకు పడిపోవడంతో అనేక పశ్చిమాసియా దేశాల పద్దులు తారుమారు అవుతున్నాయి. ఇదే కొనసాగితే ఐదేళ్లలో భూతల స్వర్గాల్లో మిగులు మూటలు కరిగిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ప్రమాద ఘంటికలు మోగించింది. ఈ విపరిణామాన్ని తట్టుకోవాలంటే జమాపద్దులను తక్షణమే సరిదిద్దుకోవాలని హితవు పలికింది.

పీపా ముడి చమురు ధర 50 డాలర్ల దిగువనే కదలాడుతుంటే పశ్చిమాసియాలో చాలా దేశాల ఖజానాలు ఐదేళ్లలో వట్టిపోతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఒక నివేదికలో హెచ్చరించింది. సౌదీ అరేబియా, ఒమన్‌, బహ్రెయిన్‌ వంటి ప్రస్తుత ధనిక దేశాలు అప్పుల కోసం దేబిరించే పరిస్థితి రావచ్చని పేర్కొంది. ముడిచమురు ధర పతనం కారణంగా ఈ ఒక్క సంవత్సరంలోనే పశ్చిమాసియా రాబడి అంచనాల్లోంచి 36 వేల కోట్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోయినట్లు తెలిపింది. దీంతో ఇప్పటివరకు భారీగా బడ్జెట్‌ మిగులు ఉన్న ఆయా దేశాల ఆర్థిక నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయని పేర్కొంది. గతేడాది సుమారు 100 డాలర్లున్న పీపా చమురు ధర ఈ ఏడాది రమారమి 45 డాలర్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విపరీత పరిణామాలను తట్టుకునేందుకు చమురు ఎగుమతిదారులు తమ వ్యయ, ఆదాయ పాలసీలను పరిస్థితులకు అనుగుణంగా సరిదిద్దుకోవాల్సి ఉందని హితవు పలికింది. వ్యయాలు బాగా పెరిగి రాజకీయ అలజడులు చెలరేగుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉన్న తరుణంలో ధరల పతనమవడం ఈ దేశాలకు ఇబ్బందికరంగా మారిందని పేర్కొంది.
 
సౌదీకి ఇబ్బంది
బడ్జెట్‌ను సమతుల్యంగా ఉంచాలంటే సౌదీ అరేబియా పీపా చమురును 106 డాలర్లకు విక్రయించాల్సి ఉందని, అయితే ప్రస్తు త ధరల వద్ద చమురును విక్రయించుకుంటూ పోతే ఐదేళ్లలో సౌదీ మిగులు నిధులు ఆవిరైపోతాయని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ఈ పరిస్థితులను గమనించే సౌదీ నిధుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది బాండ్ల విక్రయాల ద్వారా 400 కోట్ల డాలర్లను సమకూర్చుకోవడమేకాక, మరో 7వేల కోట్ల డాలర్లను ఎయుఎఫ్‌లనుంచి సమకూర్చుకుంది. చాలా సంవత్సరాలు మిగుల్లో ఉన్న సౌదీ బడ్జెట్‌లో ఈ ఏడాది తొలిసారి క్యాడ్‌ 20 శాతానికి చేరుతుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ పలు వ్యయాలపై కోత విధించుకుంటోంది.

చాలా దేశాలదీ అదే బాట
సౌదీ సహా అనేక దేశాల బ్రేక్‌ ఈవెన్‌ ధరలకన్నా తక్కువ ధర వద్ద చమురు ధర ట్రేడవుతోంది. బడ్జెట్‌ కళ్లేలు అదుపులో ఉండాలంటే ఇరాక్‌కు పీపా చమురు 81 డాలర్ల వద్ద, ఇరాన్‌కు 72 డాలర్ల వద్ద ట్రేడవాల్సి ఉంది. నిజానికి ప్రస్తుత ధర కొనసాగితే ఈ దేశాలు మరో 8-10 సంవత్సరాలు తట్టుకోగలవని అంచనా. అయితే ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేత కారణంగా చమురు ఉత్పత్తి పెరగడంతో దేశ ఆర్థిక పరిస్థితిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇక ఇరాక్‌ది మరో గాధ. ఈ దేశంలో చాలా ప్రాంతం ఐఎస్‌ఐఎస్‌ చేతిలో ఉండడం, అంతర్జాతీయంగా సమస్యలు ఇరాక్‌ను కుంగదీస్తున్నాయి. ధరల క్షీణత కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న మరో దేశం బహ్రెయిన్‌. ఈ దేశం ఐదేళ్లలోపే సంక్షోభానికి చేరువవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బహ్రెయిన్‌ బ్రేక్‌ ఈవెన్‌ ధర పీపాకు 107 డాలర్లు. ఇప్పటికే ఈ దేశం రుణ భారంతో కూనారిల్లుతోంది.
 
కువైట్‌, ఖతార్‌ సేఫ్‌ పశ్చిమాసియాలో ఇతర దేశాలతో పోలిస్తే యుఎఇ, కువైట్‌, ఖతార్‌ దేశాలపై చమురు ధరల క్షీణత పెద్దగా ప్రభావం చూపలేదని, ఈ దేశాలు ఇదే ధరలను దశాబ్దాల పాటు తట్టుకోగలవని ఐఎంఎఫ్‌ పేర్కొంది. వీటి బ్రేక్‌ ఈవెన్‌ చమురు ధర ప్రస్తుత ధరకు కాస్త అటుఇటుగా ఉండడమే ఇందుకు కారణం. దీనికితోడు ఈ దేశాలు చమురు ధర అధికంగా ఉన్నప్పుడు నిధులను భారీగా కూడబెట్టుకున్నాయి. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం యుఎఇ వద్ద 30 ఏళ్లకు, ఖతార్‌, కువైట్‌ వద్ద 25 ఏళ్లకు సరిపడ బఫర్‌ నిధులున్నాయి.
News Desk International 
« PREV
NEXT »

No comments

Post a Comment