తాజా వార్తలు

Friday, 30 October 2015

అయ్యో పాపం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ఎన్నెన్నో విమర్శలొచ్చాయి ఆయనగారిపైనా. అయినా తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను వెనకేసుకొచ్చింది. తమ చెప్పు చేతల్లో నడుస్తోన్న అధికారిగా తెలంగాణ ప్రభుత్వం ఆయనగారిని అందలం ఎక్కించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఏ అధికారీ ఎదుర్కోనన్ని రాజకీయ విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు.. అదీ తెలంగాణలోని అధికార పార్టీ పుణ్యమా అని. ఇంతా చేస్తే, చివరకు ఆయనపై బదిలీ వేటు పడింది. ఎందుకిలా.? 
పరిచయం అక్కర్లేని ఆ సీనియర్‌ అధికారి.. ఎవరో కాదు, సోమేష్‌కుమార్‌. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా సోమేష్‌కుమార్‌ తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నారు. గడచిన ఏడాదిన్నర కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చీఫ్‌ సెక్రెటరీలకన్నా ప్రముఖంగా విన్పించిన పేరు సోమేష్‌కుమార్‌దే. ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే, తాను తెలంగాణలోనే వుంటానంటూ ఆయన కేంద్రానికి లేఖ రాశారు. 'క్యాట్‌'ను కూడా ఆశ్రయించారు. 
ఏమయ్యిందో తెలియదు, సోమేష్‌కుమార్‌పై బదిలీ 'వేటు' పడింది. కాదు కాదు, ఇది వేటు కాదు.. అధికారుల బదిలీలు సర్వసాధారణమే. ఐఏఎస్‌ల విషయంలో మరీనూ. కాబట్టి దీన్ని బదిలీ వేటు అనడానికి వీల్లేదని అధికార పార్టీ నేతలు సమర్థించుకోవచ్చుగాక. కానీ, రాజకీయాల్లో సోమేష్‌కుమార్‌పై బదిలీ వేటు ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. 
జీహెచ్‌ఎంసీ వార్డుల విభజనలో సోమేష్‌కుమార్‌ తమకు అనుకూలంగా వ్యవహరించలేదన్నది అధికార పార్టీ ఆగ్రహానికి కారణమట. పైగా, కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో పరిస్థితులు తమకు వీలుగా మార్చేందుకు సోమేష్‌కుమార్‌ వ్యవహరించకపోవడంతో పదే పదే కోర్టు నుంచి చీవాట్లు తినాల్సి వస్తోందని అధికార పార్టీ గుస్సా అయ్యిందట. ఇవన్నీ లెక్కల్లో వేసుకునే సోమేష్‌కుమార్‌పై వేటు పడిందని గుసగుసలు విన్పిస్తున్నాయి. 
అనూహ్యంగా ఇప్పుడు సోమేష్‌కుమార్‌పై సింపతీ పెరిగిపోతోంది. నిన్న మొన్నటిదాకా సోమేష్‌కుమార్‌పై విమర్శలు చేసినవారే, 'అయ్యోపాపం.. ఆయన్ను కేసీఆర్‌ వాడుకుని వదిలేశారే..' అని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సోమేష్‌కుమార్‌పై సానుభూతి కురిపిస్తున్నారు. మరోపక్క, సోమేష్‌, ఏపీకి వెళ్ళిపోవడం ఖాయమనీ.. అందుకే వ్యూహాత్మకంగా జీహెచ్‌ఎంసీ బాధ్యతలు తమకు అనుకూలమైన మరో అధికారికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టబెట్టిందన్న వాదనా లేకపోలేదు. 
ఏదిఏమైనా, కథ అడ్డం తిరిగింది. ఆ తిప్పింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌. ఎందుకు.? అన్నది మాత్రం సోమేష్‌కుమార్‌కీ, తెలంగాణ ముఖ్యమంత్రికే తెలియాలి.
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment