తాజా వార్తలు

Monday, 12 October 2015

జగన్‌ దీక్ష మీద నొరు పారేసుకున్న బాబు...ఇది విడ్దూరం గురూ....!
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, ఆ దీక్షకు సంబంధించి ఎప్పటికప్పుడు 'సమాచారం' సేకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంటుంది. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు దాటేసరికి, ప్రభుత్వం ప్రతిపక్ష నేత దీక్ష విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించడం, ప్రతిపక్షంతో సంప్రదింపులు జరపడం.. ఇవన్నీ ప్రభుత్వంలో వున్నవారి బాధ్యతలు.
దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, ప్రతిపక్ష నేత ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునేంత తీరిక లేదు. ఆ విషయాన్ని డైరెక్ట్‌గానే ముఖ్యమంత్రి చంద్రబాబు సెలవిచ్చారు. రాజధాని శంకుస్థాపన పనుల్లో బిజీగా వున్నామనీ, జగన్‌ దీక్షలో చిత్తశుద్ధి లేదు గనుక, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రే చెప్పాక, ఇక మంత్రులు జగన్‌ దీక్షపై ఇంకెలా మాట్లాడుతారో ఊహఙంచడం పెద్ద కష్టమేమీ కాదు.
అంతా ఆశించినట్టే మంత్రులు జగన్‌ దీక్షపై నోరు పారేసుకున్నారు. జగన్‌ రెండు గంటలకు ఓ సారి 'వ్యాన్‌లోకి' వెళుతున్నారనీ, దానిపై తమకు అనుమానాలున్నాయనీ, వైద్య పరీక్షల్లోనూ ఫలితాలు అనుమానాస్పదంగా తేలుతున్నాయని సాక్షాత్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెప్పడంతో, ఒక్కసారిగా విస్తుపోవడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం వంతయ్యింది.
ప్రభుత్వం అధికారికంగా ఎప్పటికప్పుడు జగన్‌ ఆరోగ్యంపై నివేదికలు ఇస్తే, వాటిని పరిశీలించి జగన్‌ దీక్షలో చిత్తశుద్ధి ఏంటో జనమే నిర్ణయించుకుంటారు. అసలు అధికారంలో వున్నవారు అలాంటి నివేదికలు ఏమీ బయటపెట్టకుండానే, తమ వద్దనున్న సమాచారంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే, అధికార పక్షం తీరు 'నవ్విపోదురుగాక మనకేటి..' అన్న చందాన తయారయ్యిందని రాష్ట్ర ప్రజానీకం అనుకుంటోంది.
జైల్లో వున్నప్పుడే ఎవరూ తనను గమనించనప్పుడే చిత్తశుద్ధితో దీక్ష చేశానన్న వైఎస్‌ జగన్‌, తన తండ్రి డాక్టర్‌ అనీ, వైద్య రిపోర్టులు ఎలా వుంటాయో తనకు తెలుసని చెబుతూ, మీడియా సమక్షంలోనే వైద్య పరీక్షలు చేయించుకుని, వాటి వివరాల్ని బయటపెట్టారు. మొత్తం మీడియాని తీసుకొచ్చి, తనకు వైద్య పరీక్షలు నిర్వహించుకోవచ్చని వైఎస్‌ జగన్‌ సవాల్‌ విసిరారు.
ప్రత్యేక హోదా దీక్ష తనకు అవసరం లేదనీ, ప్రజల కోసమే తాను దీక్ష చేస్తున్నాననీ, చదువుకున్న నిరుద్యోగులకు ప్రత్యేక హోదాతో ఉద్యోగాలు వస్తాయని, ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందంటే, మంత్రులకు ముఖ్యమంత్రికి సిగ్గుండాలంటూ ఘాటుగా స్పందించారు వైఎస్‌ జగన్‌. ఇదిలా వుంటే, జగన్‌కి వైద్య పరీక్షలు నిర్వహిస్తోన్న గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు, రిపోర్టుల విషయంలో పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు.
మొత్తమ్మీద, జగన్‌ దీక్షను నీరుగార్చడానికి చంద్రబాబు సర్కార్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తోందన్నమాట. ఈ వెకిలి ప్రయత్నాలు ప్రజాస్వామ్యం పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి వున్న గౌరవాన్ని తెలియజేస్తున్నాయనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదు.
News Desk-AP
« PREV
NEXT »

No comments

Post a Comment