తాజా వార్తలు

Thursday, 15 October 2015

బాబు తో కలిసి అమరావతి వెళ్ళనున్న వైఎస్‌ జగన్‌...!!!ఏం చేయాలి.? రాజధాని శంకుస్థాపనకు ముందు రాజకీయ ఆందోళనలతో ఆంధ్రప్రదేశ్‌ని అట్టుడికిస్తే, రాజధానికి వ్యతిరేకమన్న అధికార పార్టీ విమర్శల్ని నిజం చేసినట్లవుతుంది కదా.! ఆందోళనలు చేయకపోతే అధికార పార్టీని రాజధాని విషయంలో సమర్థించినట్లే అవుతుంది కదా.! ఈ పరిస్థితుల్లో ఈ సంకటం నుంచి బయటపడేదెలా.? ఇదే అంతర్మధనం ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతోంది. పేరుకి కొన్ని ఆందోళనా కార్యక్రమాలకు రూపకల్పన చేసినా, 'ఇది సరైన సమయం కాదు' అన్న భావన ఆ పార్టీలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్‌ సైతం, ఈ అభిప్రాయంతో ఏకీభవించారట. 
నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వైఎస్‌ జగన్‌, దసరా వరకూ 'వేచి చూడటమే మంచిది' అన్న అభిప్రాయానికి వచ్చేసినట్లు సమాచారం. ఎటూ రాజధాని శంకుస్థాపనకు తనను ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఆహ్వానిస్తారు గనుక, హుందాగా ఆ కార్యక్రమానికి వెళ్ళి వచ్చేసి, ఆ తర్వాత రాజకీయ కార్యక్రమాలు ఉధృతం చేయాలని వైఎస్‌ జగన్‌ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 
ప్రధాని నరేంద్రమోడీ రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడ్తాయి. పైగా, ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. రాజకీయ కార్యక్రమం కూడా కాదు. ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవంతో ముడిపడ్డ అంశం. కొత్త రాజధాని ఆంధ్రప్రదేశ్‌కి అత్యవసరం. ఆషామాషీ రాజధాని నిర్మిస్తే కుదరదు. అలాగే, ప్రపంచం దృష్టిని ఆకర్షించాలంటే హంగామా కూడా తప్పదు. ఇవన్నీ జగన్‌కి తెలియనివి కావు. అదే సమయంలో, ప్రజా రాజధాని పేరుతో ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుండడం, కార్పొరేట్‌ సంస్థలకు రాజధానిని ధారాదత్తం చేయడాన్నీ ప్రశ్నించాలి. ఇలా ప్రతిపక్షం రాజధాని పేరుతో పెను సవాల్‌ ఎదుర్కొంటోందిప్పుడు. 
తొందరపాటు నిర్ణయాల కన్నా ప్రజామోదం పొందేలా తమ రాజకీయ నిర్ణయాలుండాలి గనుక, కాస్త ఆలస్యమైనా సరైన నిర్ణయం తీసుకోవాలని వైఎస్‌ జగన్‌ కూడా భావిస్తున్నారు. నిరవధిక నిరాహార దీక్ష చేసిన టైమ్‌ అస్సలేమాత్రం బాగాలేదని ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. దీక్ష చేసినా అది కేంద్రం దృష్టికి వెళ్ళలేదనీ, ప్రభుత్వం రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లలో బిజీగా వుండడం, రాష్ట్రమంతటా అదే విషయమై చర్చ జరుగుతుండడంతో ప్రజల్లోకీ తాము ఆశించిన స్థాయిలో 'ప్రత్యేక హోదా దీక్ష' వెళ్ళదేని జగన్‌ దీక్షపై పార్టీ శ్రేణులు విశ్లేషించాయి. 
ఇలా అన్ని విషయాల్నీ విశ్లేషించిన వైఎస్‌ జగన్‌, తూతూ మంత్రంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం మినహా, ఓవర్‌ ది బోర్డ్‌గా ఎలాంటి ఆందోళనలూ వుండకూడదని పార్టీ ముఖ్య నేతల్ని ఆదేశించారట. దసరా తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నది జగన్‌ తాజా వ్యూహంగా కన్పిస్తోంది. ఈలోగా పరిస్థితులు అనుకూలిస్తే మాత్రం, ఇటు రాష్ట్రానికీ, అటు కేంద్రాన్నీ ఇరుకున పెట్టే కార్యక్రమాలకు సిద్ధంగా వుండాలనీ జగన్‌ పార్టీ ముఖ్య నేతలను ఆదేశించారట.
News Desk-AP
« PREV
NEXT »

No comments

Post a Comment