తాజా వార్తలు

Tuesday, 20 October 2015

బాబుకి కేసీఆర్‌ మీద అభిమానమేనా.? లేదంటే....?అంతలోనే ఎంత మార్పు.? 'నీ పదవి ఊడగొడతా..' అని సవాల్‌ విసిరిన చంద్రబాబు, 'నిన్ను జైల్లో పెట్టిస్తా..' అని మీసం లేని మీసాన్ని మెలేసిన కేసీఆర్‌ ఇప్పుడు 'స్నేహితులు' అయిపోయారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇద్దరి మధ్యా స్నేహం అనూహ్యంగా చిగురించింది. 'అమరావతి' ఈ ఇద్దరు చంద్రుల్ని కలిపిందనుకోవాలా.? లేదంటే, 'అవసరమే' వీరిద్దరినీ ఒక్కటి చేసిందా.? అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు. 
కేసీఆర్‌ ఇంటికి వెళ్ళి మరీ, అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించారు చంద్రబాబు. 'అమరావతి వాస్తు ప్రకారం బాగుంది..' అని చంద్రబాబుకి అభినందనలు తెలిపేశారు కేసీఆర్‌. 'రోడ్డు మార్గాన వస్తా..' అని చంద్రబాబుతో కేసీఆర్‌ చెబితే, స్నేహితుడు ఎక్కడ కష్టపడిపోతాడోనని 'హెలికాప్టర్‌లో రండి..' అని సలహా ఇచ్చారు చంద్రబాబు. స్నేహితుడి మాటను కాదనలేకపోయారు కేసీఆర్‌. వారెవ్వా.. స్నేహమంటే ఇదే మరి.! 
ఇక్కడితో సినిమా అయిపోలేదు. ఇంకా చాలానే వుంది. విజయవాడలో కేసీఆర్‌కి స్వాగతం పలుకుతూ బ్యానర్లు రూపొందుతున్నాయి. టీడీపీ నేతలే ఈ ఘనకార్యానికి తెరలేపారు. కాట్రగడ్డ బాబు ఇంకొందరు టీడీపీ నేతలు, 'వెల్‌కమ్‌ టు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌' అంటూ బ్యానర్లు కట్టేస్తున్నారట. వింతలకే వింత ఇది. 
తెలంగాణలోనేమో కేసీఆర్‌ దిష్టిబొమ్మల్ని టీడీపీ నేతలే తగలేస్తున్నారు. అరాచక పాలన చేస్తున్నారంటూ కేసీఆర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఆంద్రప్రదేశ్‌లోనేమో కేసీఆర్‌కి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు పధ్నాలుగేళ్ళ తర్వాత కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెడ్తున్నారట. దీన్ని ఓ వేడుకగా మార్చాలని చంద్రబాబు అనుకుంటున్నట్టున్నారు. 
ఏంటీ, ఇదంతా కేసీఆర్‌ మీద అభిమానమేనా.? లేదంటే, ఓటుకు నోటు కేసు అటకెక్కించడానికి చంద్రబాబు, కేసీఆర్‌ని 'గోకుతున్న' వైనమా'.! కారణం ఏదైనా, చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్‌ సేవలో తరిస్తున్నారు. ఈ సేవ ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఏమో మరి........!
NEWS DESK
« PREV
NEXT »

No comments

Post a Comment