తాజా వార్తలు

Monday, 26 October 2015

కోడెల అశలకు చంద్రబాబు బ్రేకులు...ఏదో తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేయడానికి, నిలబెట్టేయడానికి కంకణం కట్టుకున్నట్లుగా అమరావతి ప్రాంతంలోనే ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కలలు కన్న స్పీకరు కోడెల శివప్రసాదరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కళ్లెం వేశారు. అక్కడ తాత్కాలిక అసెంబ్లీని నిర్మించి.. అయిదురోజుల శీతాకాల సమావేశాలను నిర్వహించడానికి స్పీకరు కోడెల తీసుకున్న నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు తోసిపుచ్చారు. ఇది పూర్తిగా అనవసరమైన వృథా ఖర్చుగా ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ముందు సీఎం కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా స్పీకరుతో భేటీ కూడా అయిన తర్వాత.. ఆయన ఆశలకు చంద్రబాబు నాయుడు బ్రేకులువేసినట్లుగా అర్థమవుతోంది. 
నిజానికి విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటూ హైదరాబాదు నగరాన్నే రాజధానిగా వాడుకోవడానికి, ప్రస్తుత అసెంబ్లీనే తమ సమావేశాలకు కూడా వాడుకోవడనికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పూర్తి హక్కులు ఉన్నాయి. విభజన తర్వాత.. అసెంబ్లీలో ఏపీకోసం ప్రత్యేకమైన సమావేశ హాలు కావాలంటూ.. పోరాడి మరీ కోడెల సాధించుకున్నారు. ఆ పోరాటానికి పలితంగా నిండా ఏడాదైనా సమావేశాలు జరిగినట్లుగా లేదు. 
ఇంతలోనే చంద్రబాబు కంటె తొందరపడిపోతూ.. అసెంబ్లీని తుళ్లూరు/ అమరావతి ప్రాంతానికి (గుంటూరు) తరలించేయాలని కోడెల తెగ ముచ్చటపడిపోతున్నారు. గతంలోనే వర్షాకాల సమావేశాలనే నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాలని.. అందుకు కోట్లాది రూపాయలు వ్యయం చేయాలని కూడా ఆయన ప్రతిపాదనలు తయారుచేయించారు. అప్పట్లో దానికి కూడా చంద్రబాబు ఒప్పుకోలేదు. తీరా అమరావతి శంకుస్థాపన అయిన తర్వాత.. అదే అమరావతి ప్రాంతంలోనే ఈసారి అసెంబ్లీ నిర్వహించేయాలని కోడెల డిసైడై పోయారు. గతంలో కర్నాటక అసెంబ్లీని తాత్కాలిక వేదిక ఏర్పాటుచేసిన సంస్థకు నామినేషన్‌ పద్ధతిపై కాంట్రాక్టు ఇచ్చేయడానికి కూడా ఫైలు సిద్ధం చేసేశారు. అంతా ప్రస్తుత అసెంబ్లీ తరహలో సీటింగ్‌ ఎరేంజిమెంటుతో సిద్ధం చేయడానికి 12 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలు దాదాపు ఓకే అయిపోయాయి. 
కానీ.. తీరా దీనికి సంబంధించి నిర్ణయం ఫైనలైజ్‌ అయ్యే దశలో స్పీకరు కోడెలతోనే సమావేశం అయిన చంద్రబాబునాయుడు వృథా ఖర్చును పరిహరించాలని బ్రేకులు వేసేశారు. శీతాకాల సమావేశాలను హైదరాబాదులోనే నిర్వహించాలని, బడ్జెట్‌ సమావేశాలను కావలిస్తే.. గుంటూరు సమీపంలోని హాయ్‌ల్యాండ్‌లో నిర్వహించవచ్చునని చంద్రబాబు సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కోడెల కలలకు చంద్రబాబు కళ్లెమేసినట్లే కనిపిస్తోంది. 
News Desk.
« PREV
NEXT »

No comments

Post a Comment