తాజా వార్తలు

Friday, 2 October 2015

చంద్రబాబా నీ టూర్లు ఇక ఆపవా....???ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అక్కడ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ.. ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా వారి విదేశీ టూర్లు సాగుతున్నాయి. ఒక విదేశీ టూరునుంచి తిరిగి స్వస్థలాలకు చేరుకునే మరో విదేశీ యాత్రకు సంబంధించిన షెడ్యూలను ఖరారుచేసుకుంటూ వారు... ఆ విధంగా ముందుకు పోతున్నారు. చంద్రబాబు ఇటీవల సాగించి వచ్చిన సింగపూర్‌ యాత్ర గురించి ప్రజలు ఇంకా మరచిపోక ముందే.. ఆయన అంతలోనే తన భవిష్యత్‌ విదేశీ టూర్‌ షెడ్యూల్‌ను ప్రకటించేశారు. ప్రపంచంలోని 10 టాప్‌ బెస్ట్‌ సిటీలను సందర్శించడానికి తాను త్వరలోనే వెళ్లబోతున్నట్లుగా చంద్రబాబునాయుడు ప్రకటించారు.
ఎవ్వరు ఎంతమాత్రం ఫలితాల్ని సాధిస్తున్నారో గానీ.. చంద్రబాబునాయుడు పాలనకాలం మొత్తం విదేశాలు తిరగడానికి మాత్రమే సరిపోతున్నట్లుగా ఉన్నదని ఎక్కడైనా విమర్శలు వినిపిస్తే అది అతిశయోక్తి కాదు. ఆయన గద్దె ఎక్కిన నాటినుంచి వ్యవహారసరళి మొత్తం అలాగే ఉన్నది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి బోలెడు సమస్యలు ఉన్నమాట వాస్తవం. వాటన్నిటినీ ఏ రీతిగా పరిష్కరించాలని చంద్రబాబు సంక్షేమ ఎజెండాను పెట్టుకున్నారో లేదో తెలియదు గానీ.. రాష్ట్రానికి తాను కొత్త రాజధానిని నిర్మించి ఇవ్వాలని సంకల్పం పెట్టుకున్న తర్వాత మాత్రం ఇక ఆయన పూర్తిగా విదేశీ బాబు అయిపోయారు. జపాన్‌ చైనా సింగపూర్‌ దేశాల పర్యటనలు, జపనీస్‌ భాషా జపం చేయడం ఇవన్నీ చాలా మామూలు అయిపోయాయి.
ఒకవైపు రాజధాని నిర్మాణానికి రాళ్లు కొనడానికి కూడా డబ్బుల్లేవని అంటూనే.. రాష్ట్ర ప్రజలను తలా ఒక ఇటుక ధర్మం చేయమని అడుగుతూనే ఆయన మాత్రం.. చార్టర్డ్‌ విమానాలు వేసుకుని, తన వెంట వందిమాగధుల బృందాల్ని తీసుకుని విదేశీ టూర్లు చేస్తున్నారు. సింగపూర్‌ వారికి రాజధాని నిర్మాణ బాధ్యతను అప్పగించిన తర్వాత.. వారు వచ్చి రాజధాని నిర్మాణానికి అవరమైన డిజైన్లను కూడా అందించిన తర్వాత.. ఇక రాజధాని ముసుగులో చంద్రబాబునాయుడు విదేశీ యాత్రలు చేయడం తగ్గుతుందేమో అని అంతా అనుకున్నారు.
అయితే ఆయన తాజాగా ప్రపంచంలోని టాప్‌ టెన్‌ సిటీలను సందర్శించే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. సదరు టాప్‌ టెన్‌ సిటీల్లోకి అమరావతి కూడా చేరేలాగా తీర్చిదిద్దడానికి ముందు ఆయా సిటీలను సందర్శించి రాబోతున్నారట. త్వరలోనే ఈ ప్రపంచయాత్ర కార్యక్రమం ఉంటుందిట. అయినా.. టాప్‌టెన్‌లో ఒకటిగా తీర్చిదిద్దడంకోసం అధ్యయనం చేయాలంటే.. అమరావతి నగర డిజైన్లు రూపుదిద్దుకోకముందే అది జరగాలి. అలా కాకుండా డిజైన్లు కూడా వచ్చిన తర్వాత.. వాటిని చాలా ఆడంబరంగా విడుదల చేసిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ టాప్‌ సిటీలు చూస్తా అంటూ ఊరేగడం ఏంటో అర్థం కావడం లేదని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
Special Bureau
« PREV
NEXT »

No comments

Post a Comment