తాజా వార్తలు

Saturday, 17 October 2015

బాబా పరదేసీ నవాభా....ఇక చాలించు నీ విదేసీ యాత్రలు...ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మామూలు దాహం (మంచినీళ్లు తాగడం) కంటే విదేశీ దాహం ఎక్కువగా ఉంది. విదేశీ దాహమంటే బహుళజాతి కంపెనీల కూల్‌డ్రింకులు తాగడం కాదు. తాను విదేశాలు తిరగడం లేదా అధికారులను తిప్పడం. రాజధాని అమరావతిని విదేశీ నగరంలా చేయాలని తపిస్తున్న చంద్రబాబు విదేశీ నగరాల అధ్యయనం ఇంకా పూర్తి చేయలేదు. రాజధాని నిర్మాణానికి ముందు తాను వివిధ దేశాల్లో పర్యటించారు. తరువాత మంత్రులతో, పారిశ్రామికవేత్తలతో కూడిన బృందాన్ని విదేశాలకు పంపారు. చివరకు సింగపూర్‌ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకొని రాజధాని నిర్మాణాన్ని దానికి అప్పగించారు. మాస్టర్‌ప్లాన్‌ కూడా సింగపూర్‌ ప్రభుత్వమే తయారుచేసింది. 
జపాన్‌, చైనా తదితర దేశాలు కూడా రాజధాని నిర్మాణంలో తామూ భాగస్వాములవుతాం అన్నాయి. బాబు తన విదేశీ పర్యటనలకు కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఖర్చు వంద కోట్లకు పైనే ఉందని, అమెరికా అధ్యక్షుడు కూడా అంత ఖర్చు చేయరని లోక్‌సత్తా అధినేత డాక్టర్‌ జయప్రకాశనారాయణ విమర్శించారు. సింగపూర్‌ ప్రభుత్వం రూపొందించిన నమూనాలు ఇప్పటికే విడుదల చేశారు. ఆ బొమ్మలు చూస్తేనే కళ్లు చెదురుతున్నాయి. చివరకు అమరావతిలో ఉండేది ధనికులు, పెట్టుబడిదారులు, శతకోటీశ్వరులు మాత్రమేనని, సామాన్యులకు స్థానం ఉండదని కొందరు విమర్శిస్తున్నారు. అమరావతిలో మురికివాడలు ఉండవని బాబు చెప్పారు. అంటే పేదలకు ఈ నగరంలో స్థానం లేదన్నమాట. వారు ఎక్కడ ఉంటారో తెలియదు. చంద్రబాబు వర్ణిస్తున్న తీరు చూస్తుంటే అమరావతిలో అపర కుబేరులు తప్ప మరెవరూ ఉండలేరని అనిపిస్తోంది. 
అమరావతి నిర్మాణానికి దసరా రోజు అంటే ఈ నెల 22న శంకుస్థాపన చేస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం శంకుస్థాపన పూర్తి కాగానే నిర్మాణాలు ప్రారంభం కావల్సిందే. ఇళ్లు నిర్మించేవారు శంకుస్థాపన చేయగానే నిర్మాణం ప్రారంభిస్తారు. అంటే శంకుస్థాపన చేశాక కొంతకాలం తరువాత నిర్మాణం ప్రారంభించరు. అందుకే శంకుస్థాపన ముహూర్తం చాలా జాగ్రత్తగా పెడతారు. పంచాగం ప్రకారం మూఢాలు (తెలంగాణలో కత్తెర అంటారు) లేకుండా చూసుకుంటారు. మూఢాలు అంటే పనులు చేయకూడని రోజులన్నమాట. ఇతరత్రా అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ముందుగా వేసుకున్న ప్లాన్‌ ప్రకారం శంకుస్థాపన తరువాత నిర్మాణం కొనసాగుతుంది. 
అమరావతికి ఓ పక్క శంకుస్థాపన చేస్తున్న బాబును మరోపక్క  విదేశీ దాహం నిలువనీయడంలేదు.. అంటే నగరాన్ని ఇంకా బెటర్‌గా ఎలా నిర్మించాలనేది ఆయన ఆలోచన కావొచ్చు. అందుకే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో నాలుగు బృందాలను తయారుచేసి కొన్ని విదేశీ నగరాల అధ్యయనానికి పంపబోతున్నారు. శంకుస్థాపన జరిగిన మూడు రోజుల తరువాత ఈ బృందాలు బయలుదేరతాయట. యూరోప్‌, యురేషియా, చైనాలోని నగరాలతోపాటు మరికొన్ని దేశాల్లోని నగరాలను ఈ బృందాలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తాయి. ఈ తాజా అధ్యయనం మీద అధికారులే ఆశ్చర్యపోతున్నారట. ఓ పక్క సింగపూర్‌ నిర్మాణ బాధ్యతలు స్వీకరించి రంగంలోకి దిగబోతుండగా, మరో పక్క మళ్లీ ఈ అధ్యయనం ఏమిటని అనుకుంటున్నారట. 
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువ లేనట్లే బాబు తలచుకుంటే పర్యటనలకు కొదవ ఏముంది? మంచి రాజధాని నగరం నిర్మించాలన్న చంద్రబాబు తపనను, ఉత్సాహాన్ని తప్పు పట్టలేం. ఆయనకు సహజంగానే కొత్తదనం కోసం పాకులాడే తత్వం ఉంది. నిర్విరామంగా శ్రమించే లక్షణం ఉంది. రొటీన్‌గా పనిచేసుకుపోయే నైజం కాదు. వాస్తవానికి పాలకులకు ఉండాల్సిన లక్షణమే ఇది. కానీ 'విదేశీ డోసు' ఎక్కువైందన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఆయన ఆలోచించుకోవాలి. దేశం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. కొమ్ములు తిరిగిన నిపుణులు ఇండియాలో ఉన్నారు. నిర్మాణ రంగంలో అపార అనుభమున్న కంపెనీలున్నాయి. 
అయినా పాలకులు విదేశాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్కడి కంపెనీలకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారు. ఆ సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నారో ప్రజలకు తెలియదు. విదేశీయులు ఏం షరతులు పెడుతున్నారో పాలకులు ప్రజలకు చెప్పరు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక రెండు రాష్ట్రాల్లోనూ విదేశీ హంగామా ఎక్కువైంది. 
NEWS DESK-AP
« PREV
NEXT »

No comments

Post a Comment