తాజా వార్తలు

Monday, 12 October 2015

గాజాస్ట్రిప్‌ పై వైమానిక దాడి


గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్  వైమానిక దాడిలో ఒక పాలస్తీనా మహిళ, ఆమె రెండేండ్ల కుమార్తె చనిపోయారు. మృతురాలు గర్భిణి. ఇదే దాడిలో మృతురాలి భర్త, వారి కుమారుడు సహా నలుగురు పాలస్తీనియన్లు గాయపడ్డారు. తాజాగా రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలతో సంక్షోభం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనలు, పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లో 31 ఏండ్ల ఒక మహిళ తన కారులో గ్యాస్ కంటెయినర్‌ను ఒక చెక్‌పోస్టు వద్ద పేల్చి ఆత్మాహుతి దాడికి పాల్పడిందని ఇజ్రాయెల్ భద్రతాధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. ఒక ఇజ్రాయెలీ పోలీసుకు స్వల్పంగా గాయాలయ్యాయి. తాజా సంక్షోభంలో కత్తిపోట్లు, కాల్పుల వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా.. ఇలా ఆత్మాహుతి పేలుడు జరుగడం ఇదే మొదటిసారి. తమ దేశంపైకి రాకెట్ దాడులకు ప్రతిస్పందనగా గాజాలోని హమాస్‌కు చెందిన ఆయుధ తయారీ కేంద్రాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ చర్యను ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న హమాస్ తీవ్రంగా ఖండించింది. సంక్షోభాన్ని రెచ్చగొట్టాలన్న ఆక్రమణదారుడి తపన ఇందులో కనిపిస్తున్నదని హమాస్ అధికార ప్రతినిధి సామి అబుఝురి విమర్శించారు. ఇటువంటి మూర్ఖపు చర్యలు కొనసాగనీయవద్దని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. వేరొక ఘటనలో వెస్ట్‌బ్యాంక్‌లోని నాబ్లస్‌లో మిలిటరీ చెక్‌పోస్టు వద్ద ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో 45మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. గాజా నగరంలోనూ ఇజ్రాయెల్ సరిహద్దు వద్ద దళాలపై రాళ్లురువ్విన స్థానికులు, కాలుతున్న టైర్లను వారిపైకి దొర్లించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ సైనికులు జరిపిన కాల్పుల్లో నలుగురు పాలస్తీనియన్లు గాయపడ్డారు.
« PREV
NEXT »

No comments

Post a Comment