తాజా వార్తలు

Thursday, 1 October 2015

ఇంతకీ వైఎస్‌ జగన్‌, కవిత భేటీ వెనుక మర్మమేంటి.?వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె, నిజామాబాద్‌ ఎంపీ కవిత భేటీ అయ్యారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. జగన్‌ కంటే ముందు కవిత, వైఎస్‌ జగన్‌ సతీమణి భారతితోనూ, వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిలతోనూ సమావేశమయ్యారన్నది ఆ గాసిప్స్‌ సారాంశం.
తెలంగాణలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు చాలాకాలంగా విన్పిస్తూనే వున్నాయి. అయితే వాటిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కొట్టి పారేసిందనుకోండి.. అది వేరే విషయం. అయితే, తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీఆర్‌ఎస్‌కి మద్దతిచ్చింది. అప్పటికే వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలని టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్షలో భాగంగా తమవైపుకు తిప్పుకోవడం విశేషమిక్కడ.
రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి వుంటాయి. తెలంగాణలో బలపడేందుకు వైఎస్సార్సీపీ, టీఆర్‌ఎస్‌ మద్దతు తీసుకుని వుండొచ్చేమో. అన్నిటికీ మించి తెలంగాణలో ఓదార్పు యాత్రకు ఆటంకాల్లేకుండా వుండేందుకు టీఆర్‌ఎస్‌ విషయంలో కాస్త 'సాఫ్ట్‌కార్నర్‌'ని వైఎస్‌ జగన్‌ ప్రదర్శించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇదిలా వుంటే, వైఎస్‌ జగన్‌తో కవిత భేటీ.. అంటూ జరుగుతోన్నది దుష్ప్రచారమేనన్నది వైఎస్సార్సీపీ వర్గాల భావన. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీని మరింత ఇరుకున పెట్టడానికే, పచ్చ మీడియా ప్రోద్బలంతో వైఎస్‌ జగన్‌కి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని వైఎసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఏమో, మొన్న రామోజీరావుని వైఎస్‌ జగన్‌ కలవగా లేనిది, కవితని వైఎస్‌ జగన్‌ కలిస్తే వింతేముంటుంది.? అన్న మరో వాదన కూడా తెరపైకి వస్తోంది.
ఇంతకీ వైఎస్‌ జగన్‌, కవిత భేటీ వెనుక మర్మమేంటి.? అసలు భేటీ జరిగిందా? లేదా.? ఏమో.. ఇటు వైసీపీ, అటు టీఆర్‌ఎస్‌ ఈ వ్యవహారంపై స్పష్టమైన ప్రకటన చేస్తేనేగానీ క్లారిటీ దొరకదు.
Political Desk
« PREV
NEXT »

No comments

Post a Comment