Writen by
vaartha visheshalu
00:19
-
0
Comments
జగన్ సొంత జిల్లాలో ఒక ఎమ్మెల్యేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమ పార్టీలోకి చేర్చుకొని జగన్ ను తిరుగులేని రీతిలో దెబ్బకొడుతున్నాం...అని ప్రకటించుకొంటున్నారు తెలుగుదేశం వారు. నిజమే... సొంత జిల్లాల్లో ఎమ్మెల్యే చేజారడం అది కూడా... పదింటికి తొమ్మిది సీట్లను గెలుచుకున్న చోట ఒక ఎమ్మెల్యేని చేర్చుకోవడం తెలుగుదేశం పార్టీకి రేర్ ఫీటే అవుతుంది.
అయితే.. ఈ ఫీట్ ను సాధించడానికి తెలుగుదేశం కోల్పోతున్నది ఏమిటి? అనేది లెక్కలేస్తే మాత్రం... తెలుగుదేశం ఆదినారాయణ రెడ్డిని చేర్చుకుని సాధిస్తున్నది ఏమీ లేదనుకోవాల్సి వస్తోంది. పరమ రాజకీయ చాణక్యంతో జగన్ పార్టీ ఎమ్మెల్యేను తాము చేర్చుకుంటున్నామని తెలుగుదేశం వాళ్లు ప్రకటించుకోదగిన ఎపిసోడేమీ కాదిది.
ఇది ఆది నారాయణ రెడ్డి అవసరం కొద్దీ జరుగుతోంది కానీ.. తెలుగుదేశం పార్టీ తెలివి తేటల కొద్దీ జరగడం లేదు... అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. దీంతో జగన్ ను దెబ్బ కొట్టడం మాటెలా ఉన్నా... తెలుగుదేశం పార్టీ తనకు తాను చాలా పెద్ద గాటునే పెట్టుకొంటోందని కచ్చితంగా చెప్పాలి.
ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య వైరం ఈనాటిది కాదు. తాతలు, తండ్రుల నాటిది. వీరి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవల్లో.. పాత లెక్కలన్నింటినీ బయటకు తీస్తే.. అటు వైపు ఒక వంద తలలు, ఇటువైపు ఒక వంద తలలు తెగి ఉంటాయనడానికి సందేహించనక్కర్లేదు. ఇరు వర్గాలూ నష్టపోయాయి.
అయితే ఆదినారాయణరెడ్డి కి ప్రతి సమయంలోనూ పవర్ ప్లస్ పాయింటవుతోంది. అసలు జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ వాళ్లను ప్రచారం కూడా చేసుకోనీయడాయన. మొన్నటి ఎన్నికల్లో బాగా గొడవ జరిగింది జమ్మలమడుగులో మాత్రమే! ఆది నారాయణరెడ్డి తమను ప్రచారం చేసుకోనివ్వడం లేదని తెలుగుదేశం వారు నెత్తీనోరు బాదుకున్నారు. సీఎం రమేశ్ స్వయంగా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశాడు!
ఆ సంగతలా ఉంటే.. ఆదినారాయణరెడ్డి వియ్యంకుడు కేశవరెడ్డి(విద్యాసంస్థల అధినేత) సంగతి తెలిసిందే. ఆయన కూడా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. పాత కేసుల తవ్వకం లేకుండా సేఫ్ జోన్ లో ఉండాలంటే ఆదినారాయణరెడ్డికి కూడా అధికార పార్టీ అండ అవసరమే! ఇలా ఏవిధంగా చూసినా.. తెలుగుదేశం పార్టీకి ఆదినారాయణరెడ్డి అవసరం కన్నా.. ఆది నారాయణరెడ్డికి తెలుగుదేశం పార్టీ అవసరమే ఎక్కువగకనిపిస్తోంది.
ఇలాంటి సమయంలో.. ఆదిని చేర్చుకొంటే తెలుగుదేశం పార్టీనే చాలా మేలు చేసిందవుతుంది! కాకపోతే..దీన్ని తాము జగన్ పై కొట్టిన దెబ్బ అని ప్రచారం చేసుకోవాలనేది నారా లోకేష్ బాబు తాపత్రయం. అయితే మొత్తం ఎపిసోడ్ ను పరిశీలిస్తే... ఎవరు నష్టపోతన్నారో.. ఎవ్వరు బఫూన్ అవుతున్నారో స్పష్టం అవుతోంది.
News Desk-AP
No comments
Post a Comment