తాజా వార్తలు

Monday, 12 October 2015

ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలకు అండగా..జాగృతి

ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలకు తెలంగాణ జాగృతి అండగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా కేసులు నమోదయ్యాయని ఎంపీ కవిత పేర్కొన్నారు. అయితే త్రిసభ్య కమిటీ వీటిలో 397 కేసులను రైతు ఆత్మహత్యలుగా నిర్ధారించిందన్నారు. సహజంగానే ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు, మార్గదర్శకాలుంటాయని, వాటిని ఉల్లంఘించకుండానే ఈ నిర్ధారణ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. ఉదాహరణకు.. చనిపోయిన రైతు చేసిన అప్పు పొలం కోసమే చేసి ఉండాలి. ఆ అప్పు తాలూకు కాగితాలు ఉండాలి అనే ఆంక్షలు ఉంటాయన్నారు.

మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో కూడా రైతు ఆత్మహత్యల నిర్ధారణకు ఇలాంటి నిబంధనలు ఉంటాయన్నారు. కాగా త్రిసభ్య కమిటీ నిర్ధారించిన 397 రైతు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆర్థిక అండ, ఇతర పథకాల ద్వారా ప్రయోజనం లభిస్తుందని, అందువల్ల ఈ కమిటీ పరిధిలోకి రాని మిగిలిన 389 కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ఈ కుటుంబాలను దత్తత తీసుకుని వీరికి ప్రతి నెలా రూ.2500 సహాయాన్ని నాలుగేండ్ల పాటు ఇస్తామన్నారు. 389 కుటుంబాలకు కలిపి నెలకు రూ.పది లక్షల వరకు ఆర్థిక సాయం అందచేస్తామని చెప్పారు. రైతుల ఆత్మహత్యల మీద స్పందించాలని తెలంగాణ జాగృతి ఇచ్చిన పిలుపునకు దాతల ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.కోటి విరాళాలు వచ్చాయన్నారు. జాగృతి అకౌంట్‌లో నుంచి నేరుగా ఆయా రైతు కుటుంబాల్లోని అకౌంట్లకు ఆర్థిక సాయం బదిలీ అవుతుందని కవిత చెప్పారు. తమ కార్యక్రమం ద్వారా నాలుగేండ్ల తర్వాత కొన్ని కుటుంబాలైనా కొంతమేర ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలుంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment