తాజా వార్తలు

Monday, 5 October 2015

అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్‌ రెడీ...!ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరైతే ఎలా వుంటుంది.? ఇది నిజమైతే బావుంటుంది కదా.! వివిధ కారణాలతో తెలుగు ప్రజల మధ్య, తెలుగు రాష్ట్రాల మధ్య పెరిగిన విభేదాలు చల్లారాలంటే, ముఖ్యమంత్రుల స్థాయిలో సహృద్భావ వాతావరణం ఏర్పడాలి. దానికి అమరావతి శంకుస్థాపన వేదికైతే అంతకన్నా కావాల్సిందేముంది.?
ప్రధాని నరేంద్రమోడీని పిలుస్తున్నాం.. పొరుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకూ ఆహ్వానాలు పంపాలని ఆలోచిస్తున్నాం.. విదేశీ ప్రముఖుల్ని రప్పిస్తున్నాం.. అలాంటప్పుడు పొరుగునున్న మన తెలుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రినే ఆహ్వానిస్తే అందులో తప్పేముంది.? నూటికి నూరుపాళ్ళూ తప్పు లేదు. అయితే, వచ్చిన చిక్కల్లా, తెలంగాణలో సెంటిమెంట్‌ రగల్చడం కోసం ఇప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, 'ఆంధ్ర' అన్న పదాన్ని విమర్శించడానికే ఎక్కువగా ఉపయోగిస్తుండడంతోనే.!
రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, 'అమరావతి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానిస్తే ఖచ్చితంగా వెళతాను..' అంటూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. గవర్నర్‌ ఎటూ ఈ కార్యక్రమానికి హాజరవుతారనుకోండి.. అది వేరే విషయం. ప్రోటోకాల్‌లో గవర్నర్‌ కూడా భాగం గనుక, ముఖ్యమంత్రి స్వయంగా గవర్నర్‌ని ఆహ్వానిస్తారు.
తెలంగాణలోని హైద్రాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు, చంద్రబాబు తన పాత మిత్రుడు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని స్వయంగా ఆహ్వానిస్తే, అమరావతి శంకుస్థాపనకు హాజరై, నాలుగు మంచి మాటలు కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని ఉద్దేశించి చెబితే, రెండు రాష్ట్రాల మధ్య తగాదాలూ దాదాపుగా అటకెక్కేస్తాయి. అంతిమంగా రెండు తెలుగు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలన్నదే తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా వున్న తెలుగు ప్రజల కోరిక.
'రాష్ట్రాలుగా విడిపోయినా, ప్రజలుగా కలిసే వుందాం.. అన్నదమ్ముల్లా వుందాం..' అని తెలంగాణ ఉద్యమ కాలంలో చెప్పిన కేసీఆర్‌, ఆ మాటకు కట్టుబడి, అమరావతి శంకుస్థాపనకు హాజరవ్వాలనే కోరుకుందాం. అంతకన్నా ముందు, చంద్రబాబు బేషజాలకు పోకుండా తెలంగాణ ముఖ్యమంత్రిని స్వయంగా ఆహ్వానించాలనే ఆశిద్దాం.
News Desk-National
« PREV
NEXT »

No comments

Post a Comment