తాజా వార్తలు

Thursday, 29 October 2015

కేసీఆర్‌ పిలుపులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంటా......?ప్రతి మనిషికీ  నమ్మకాలు, విశ్వాసాలు ఉండటం సహజం. పూజలు పునస్కారాలు  సర్వసాధారణం. గుళ్లు, గోపురాలు తిరగడం, మొక్కులు చెల్లించుకోవడం మామూలు విషయం. ఇలాంటి విషయాల్లో సాధారణం జనం కంటే రాజకీయ నాయకులు ఒక  మెట్టు ఎక్కువలో ఉంటారు. నమ్మకాలు, విశ్వాసాలు, పూజలు...వగైరా  వ్యక్తిగతమైనవి. కాని రాజకీయ నాయకులు ముఖ్యంగా పదవుల్లో ఉండేవారు, అత్యున్నత అధికారం అనుభవించేవారు ఇలాంటి  వ్యక్తిగత పనులకు ప్రజాధనం (ప్రభుత్వ ఖజానా) ఖర్చు చేయడం మన దేశంలో మామూలైపోయింది. 
కొన్ని గొంతులు ఇలాంటి చర్యలను ప్రశ్నిస్తున్నా ప్రయోజనం ఉండటంలేదు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిసెంబరులో ఆయుత  చండీయాగం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదేదో ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నంత సింపుల్‌గా చేసుకోవడంలేదు. రాష్ట్రపతి, ప్రధాని మొదలుకొని దేశంలోని పాలకులను, నాయకులను పిలుస్తున్నారు. డిసెంబరులో చేసే ఈ కార్యక్రమం కోసం ఇప్పటి నుంచే పిలుపులు ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి మొదలుపెట్టారు. ఇక గల్లీ వరకు కొనసాగిస్తారు. 
ఈ ఆయత చండీ యాగం అమరావతి శంకుస్థాపన స్థాయిలో చేసేలా ఉన్నారు. కేసీఆర్‌కు చండీ యాగం చేయడం బలే ఇష్టం. చండీ అంటే అమ్మవారు. శక్తి స్వరూపిణి. కాబట్టి అమ్మవారికి సంబంధించిన  యాగం చేస్తే శక్తి యుక్తులు సమకూరుతాయని ఆయన విశ్వాసం కావొచ్చు. ఆయన ఎలాంటి యజ్ఞమైనా, ఏ కోరిక తీర్చుకోవడానికైనా చేసుకోవచ్చు. అభ్యంతరం లేదు. కాని తన వ్యక్తిగత బ్యాంకు అక్కౌంటులోని డబ్బు ఖర్చు చేస్తారా? ప్రభుత్వ ఖజానా (ప్రజా ధనం) నుంచి ఖర్చు చేస్తారా? ఇదే ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. 
తన ఊపిరి ఉన్నంత వరకు అవినీతి పనులు చేయనని ఢంకా బజాయించి చెప్పారు గులాబీ దళపతి. ఇలాంటి స్టేట్‌మెంట్లు ఎలా ఢంకా బజాయించి చెబుతారో 'చండీ యాగం పూర్తిగా నా సొంత ఖర్చుతో చేస్తున్నా' అని పబ్లిగ్గా చెప్పాలి. ఆ తరువాతే యాగం చేయాలి. ఇలాంటివి పది మందీ డిమాండ్‌ చేశాక చెప్పడం కాదు. ప్రజా ధనం ఒక్క పైసా ముట్టుకోనివాడైతే ముందుగా డిక్లర్‌ చేస్తే ఆయన నిజాయితీ నిప్పులాంటిదని ఒప్పుకోవచ్చు. కాని ఆయన ఆ పని చేయకపోవచ్చు. చండీ యాగానికి దేశ నాయకులందరినీ ఆహ్వానిస్తున్నప్పుడు లక్షో, రెండు లక్షలో ఖర్చు కావు కదా. కోట్లలోనే ఉంటుంది. 
మరి కోట్ల రూపాయలు  ఖర్చు జేబులోంచి పెడతారా? ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోకుండా ఉంటారా? ప్రభుత్వ వాహనాలను వినియోగించుకోకుండా ఉంటారా? ఇదంతా తప్పనిసరిగా జరుగుతుంది. చండీ యాగం తన సొంత వ్యవసాయం క్షేత్రంలో చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ భవనం ఉపయోగించుకోవడంలేదు. ఆ ఒక్కటీ ఆయన సొంతం. కాని మిగతా ఖర్చంతా ప్రజాధనమే కదా....! యాగం డిసెంబరులో చేస్తారు కాబట్టి ఇప్పుడే ఇలాంటి ఆరోపణలు చేయడం తొందరపాటు అవుతుందని టీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించవచ్చు. కాని అప్పుడే ప్రతిపక్ష నాయకులు దీనిపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. 
అధికారంలోకి రాగానే కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ అధికార నివాసాలకు, సచివాలయంలో ఛాంబర్లకు వాస్తు ప్రకారం అనేక మార్పులు చేర్పులు చేయించారు. వాస్తు వారి వ్యక్తిగత విశ్వాసం. కాని అందుకు ప్రజాధనం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తిరుమల వెంకన్నకు, బెజవాడ కనకదుర్గకు కేసీఆర్‌ మొక్కుకున్నారు. ఆ మొక్కులు చెల్లించడానికి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి మంజూరు చేశారు. మొక్కులు ఆయనవి. డబ్బు జనానిది.  
తమ వ్యక్తిగత నమ్మకాల కోసం ప్రజల డబ్బు ఖర్చు చేసే అధికారం వీరికి ఉందా? కాని చేశారు. అధికారం చేతిలో ఉంది కదా...! కేసీఆర్‌ గతంలోనూ చండీ యాగాలు చేశారు.  తెలంగాణ ఉద్యమం రోజుల్లో తెలంగాణ  రాష్ట్రం ఏర్పడాలని కోరుతూ మహా చండీయాగం  చేశారు. అప్పట్లో  సింపుల్‌గా తన ఇంట్లోనే జరపుకున్నారు. మరి ఇప్పుడెందుకో రాజసూయ యాగమో, అశ్వమేధ యాగమో చేసిన లెవెల్లో చేయాలనుకున్నారు. ఈయన ఏదో స్వప్రయోజనాన్నో, రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి యాగం తలపెట్టారు. 
దానికి వారి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు హాజరైతే చాలు. కాని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, దేశంలోని నాయకులంతా ఎందుకు? యాగం ఎందుకు తలపెట్టారనేదానికి ఎవరికి తోచిన కారణాలు వారు చెప్పుకుంటున్నారు. సిబీఐ కేసుల నుంచి తప్పించుకోవడానికని ఒకరంటే, ఎన్‌డీఏలో చేరడానికని మరొకరు అంటున్నారు. ప్రజా వ్యతిరేకత పోగొట్టుకోవడానికని ఇంకొకరి విశ్లేషణ. కారనాలు ఏవైనా ఖర్చు ఎవరిదో చెప్పాలి.
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment