తాజా వార్తలు

Tuesday, 20 October 2015

వరుణ్ తేజ గొప్ప నటుడు -క్రిష్..క్రిష్..మనకు వున్న కొద్దిమంది వైవిధ్యమైన దర్శకుల్లో ఒకరు. 'గమ్యం'తో గమనం ప్రారంభించి, 'వేదం' వల్లెవేసి, 'కృష్ణం వందే జగద్గురుం' అంటూ ముందుకు సాగాడు. ఇప్పుడు కంచె అంటూ రెండో ప్రపంచ యుద్ధకాలానికి వెళ్లిపోయాడు. వెర్సటాలిటీ ప్లస్ ఫిలాసఫీ ఈజీక్వల్టూ..క్రిష్ అనాలేమో? రొటీన్ సినిమా తీయడం అన్నా, రొటీన్ గా సినిమాలు చేసుకుంటూ పోవాలన్నా కిట్టని వ్యవహారం.
అందుకే ఎనిమిదేళ్ల కెరీర్ లో నాలుగు సినిమాలే చేసాడు. అవి కూడా దాదాపు స్వంత సినిమాలే. ఇప్పుడు జస్ట్ నటన ప్రారంభించిన వరుణ్ తేజను హీరోగా తీసుకుని, ఇరవై కోట్ల బడ్జెట్ కుమ్మరించి, రెండేళ్ల రీసెర్చి, రెండు నెలల షూటింగ్ టైమ్ వెచ్చించి, కంచె సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు.ఈ సందర్భంగా ఆయన తో 'గ్రేట్ ఆంధ్ర' ముఖాముఖి.
*కంచె వేస్తున్నారా..తీస్తున్నారా?
కొత్తగా వేసేదేముందండీ..తీయాలనే..మనిషికి మనిషికి, జాతికీ జాతికీ, మతానికి మతానికి, రాష్ట్రానికి రాష్ట్రానికి, దేశానికి దేశానికి ఇలా ఎక్కడ పడితే అక్కడ కనపడని కంచెలు తయారైపోయాయ్. కేవలం రెండు దేశాల నడుమే కంచెలు చూడ్డానికి కనిపించేది. కానీ కనిపించనవి ఎన్నో?
*బాహుబలి..రుద్రమదేవి..కంచె..ఇప్పుడు సీజన్ యుద్ధ ప్రాధాన్యాల్లోకి మళ్లినట్లుంది.
కావచ్చు..కానీ జోనర్లు వేరు. జానపడం, చరిత్ర, ఇలా. పైగా జానపద, పౌరాణిక యుద్దాల్లో విజువల్స్ కు ఎక్కువ చోటు వుంటుంది. కానీ దేశాలకు దేశాలకు నడుమ జరిగే యుద్దాలు, ముఖ్యంగా ద్వితీయ ప్రపంచ సంగ్రామం..లావిష్ గా వుండదు..తలుచుకుంటే బాధగా వుంటుంది. మీకు తెలుసా..ఆ కాలంలో గాల్లో షూట్ చేయడానికి పిట్టలు లేకపోతే, బందీలుగా వున్న పిల్లలను పై నుంచి జారవిడిచేవారట. అయితే బులెట్ తగిలి, లేకుంటే నేలకు జారి..ఎంత దారుణం..?
కంచె సినిమా కోసం పరిశోధిస్తూ, ఇవన్నీ తెలుసుకుంటూ వుంటే ఎంత బాధనిపించిందో? అదే సమయంలో మన దగ్గర నుంచి వేలాది జనం యుద్ధం కోసం వెల్లారని, ఇక్కడ నుంచి వేలాది రూపాయిలు విరాళాలు ఇచ్చారని తెలిసి ఆశ్చర్యం వేసింది. 
*మిలట్రీ నేఫథ్యం సినిమాలు గతంలో ఎన్టీఆర్, ఎఎన్నార్, చిరంజీవి ఇలా చాలా మంది చేసారు. కానీ వాటిల్లో యుద్ధం అంటే జస్ట్ ఒకటి రెండు నిమషాలే..మరి మీ సినిమాలో..యుద్ధం ఎంత సేపు, ప్రేమ ఎంత సేపు?
యుద్ధం కాదు..యుద్ధ నేపథ్యం గంట సేపు..మిగిలిన సినిమా గంటా అయిదు నిమషాలు. ఆ గంట సేపు యుద్ధ నేపథ్యంలో కూడా హీరో, హీరోయిన్, వారి నడుమ భావోద్వేగాలు, ప్రేమ అన్నీ వుంటాయి.  ఇవి కాక, నేరుగా పన్నెండు నిమషాల పాటు అచ్చంగా యుద్ధం వుంటుంది. 
*యుద్ధం అంటే జనం..వేలాదిగా..లక్షలాదిగా..అంటే మీరు కూడా గ్రాఫిక్స్ కు వెళ్లారా?
లేదు. మిలట్రీ యుద్ధాలు అలా వుండవు. ట్రూప్ లు ట్రూప్ లుగానే వుంటాయి. అందువల్ల గ్రాఫిక్స్ కు అస్సలు వెళ్లలేదు. వాస్తవంగానే చిత్రీకరించాం. వందలాది యూనిఫారమ్ లు, తుపాకీలు, జనం, అన్నీ సమకూర్చుకునే. 
*ఇంతకీ యుద్ధం చూపించి ఏం చెప్ప దలుచుకున్నారు?
యుద్ధం అక్కడే కాదు, ఇక్కడా వుంది..గ్రామాల్లోనూ వుంది..కంచెలు అక్కడా, ఇక్కడావున్నాయి..వాటిని తొలగించాలి..యుద్ధం నివారించాలి..
*మదరాసుపట్టణం సినిమా  ప్రభావం ఏ మేరకు వుంది ఈ సినిమా మీద..మీ మీద?
ఆ సినిమా దర్శకుడు విజయ్ నాకు మంచి మిత్రుడు..ఆ సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా..ఈ సినిమాకూ పనిచేస్తున్నారు. అంతవరకే. 
*వరుణ్ తేజ లాంటి జస్ట్ కమింగ్ హీరో మీద ఇరవై కోట్లు ఖర్చు చేయడం అంటే..?
వరుణ్ రెండోసినిమా ఇది అని మరిచిపోండి..నిజానికి ఈ సినిమాకు చాలా ఖర్చు చేసింది తక్కువే. ఎందుకంటే అంతకన్నా నా దగ్గర బడ్జెట్ లేదు. కానీ ఒకటి మాత్రం చెబుతాను. సినిమా చూసాక జనం వరుణ్ తేజ గురించి మాట్లాడుకున్నాకే, క్రిష్ గురించి మాట్లాడతారు. అంత అద్భుతంగా నటించాడు. ఆ కళ్లలో, ఫేస్ లో అంతటి నటన అద్భతంగా తొంగి చూసింది. 
*మరీ ఎక్కువ పొగుడుతున్నారమో..అందరు దర్శకులు హీరోలను పొగిడినట్లు.
కాదు..సినిమా చూసాక ప్రతి ఒక్కరూ అదే మాట అంటారు..వరుణ్ తేజ, రేపటి తరంలోని మంచి నటుల్లో ఒకడు అవుతాడు. 
*మీ సినిమాల్లో ఫిలాసఫీ, జీవితం, వాస్తవికత తొంగి చూస్తుంటాయి..అదే లైన్ లోనే వెళ్లాలన్నదే మీ అయిడియానా?
అలా అనేం లేదు. ఇప్పుడైతే మాంచి ప్రేమ కథ తీయాలని వుంది. అలాగే మాంచి భారీ సినిమా చేయాలని వుంది.
*దాదాపు అన్ని సినిమాల్లో మీ పెట్టుబడి తప్పడం లేనట్లుంది?
అదేం లేదు. మొదటి సినిమాకు ఇంట్లో వాళ్లు ఇచ్చారు..రిటర్న్ వచ్చాయి. రెండో సినిమాకు ఆర్కే మీడియాతో కలిసాను. ఫరావాలేదు. కృష్ణ వందే...కు మాత్రం కాస్త దెబ్బ తిన్నాను. అది ఆ రోజుల్లోనే 16 కోట్లు దాటేసింది. నిజానికి అంత బడ్జెట్ అంటే మహేష్ లాంటి క్రౌడ్ పుల్లర్ వుండాలి. కొత్త నటుడు కావాలని నేను అనుకున్నాను..అంతవరకు ఓకె. కానీ బడ్జెట్ దగ్గర తప్పు చేసాను.
*మీరు చాలా ఆలస్యంగా సినిమాలు చేస్తారనుకుంటాను
సినిమా గురించి పూర్తిగా స్టడీ చేసాకే నిర్మాణం ప్రారంభిస్తాను..దాంతో ఆలస్యమవుతోంది. కానీ ఇకపై స్పీడ్ గా చేయాలని ఈ మధ్యనే అనుకున్నాను. 
*బాలీవుడ్ కు వెళ్లారు, ఆ అనుభవం ఎలా వుంది?
దాని మాట అలా వుంచండి..అక్కడ దొరికిన టైమ్ లో బోలెడు ఏడ్ ఫిల్మ్ లుచేసాను..
*ఏడ్ ఫిల్మ్ లా..పెద్ద డైరక్టర్ అనిపించుకుని, మళ్లీ అటు వెళ్లడం..?
నేనేంటి..మహా మహా గొప్ప టెక్నీషియన్స్ తో కలిసి చేసాను. అసలు ఎవరు చేయమంటారా అని చూసాను కూడా. అదో ఎక్స్ పీరియన్స్.
*సరే..కమ్ బాక్ టు కంచె...అసలు మన ఆడియన్స్ మధ్యనే, ఏ సెంటర్, మల్టీఫ్లెక్స్, మాస్ , బి సి సెంటర్ల ఆడియన్స్ అని కంచెలు వున్నాయి..కదా? మరి మీ సినిమా ఎవరి కోసం?
అందరి కోసం, మనం ప్రేక్షకుడిని సినిమాలో ఇన్ వాల్వ్ చేయగలిగితే, అందరూ చూస్తారు. హీరో పాత్రలో ప్రేక్షకుడు లీనం కావాలి..గమ్యంలో అల్లరినరేష్, వేదంలో అల్లు అర్జున్..అంతెందుకు సాగర సంగమంలో కమల్ హాసన్..ఇలా ప్రేక్షకుడిని తమ పాత్రల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు వరుణ్ కూడా అదే చేయబోతున్నాడు. 
*రామ్ చరణ్ కు మిగిలిన సగం కథ ఎప్పటికైనా చెబుతారా?
తప్పకుండా. ఇప్పుడు ఇక చకచకా కథలు తయారు చేస్తాను..సినిమాలూ చేస్తాను.
*గుడ్..బెస్టాఫ్ లక్
థాంక్యూ
FILM DESK
« PREV
NEXT »

No comments

Post a Comment