తాజా వార్తలు

Friday, 30 October 2015

మంత్రిగారి భార్య కోట్ల విలువైన భూములను కొనుగోలు చేశారంటా.....?


ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తలనొప్పి మొదలైంది. నిత్యం మీడియాలో ఉంటూ ఏపీ ప్రభుత్వంలో బాగానే నెట్టుకొస్తున్న పుల్లారావుకు ఈ కొత్త సమస్య ఎలాంటి కష్టం తెస్తుందో అన్న చర్చ జరుగుతోంది. ఆర్థిక మోసాలతో కేసులను ఎదుర్కొంటున్న అగ్రిగోల్డు సంస్థ నుంచి మంత్రిగారి భార్య కోట్ల విలువైన భూములను కొనుగోలు చేశారని  గతంలోనే ఆరోపణలు రాగా తాజాగా ఈ వ్యవహరాంపై కోర్టులో కేసుపడింది.  దీంతో ఇది ఎంత వరకు దారితీస్తుందో అని పుల్లారావు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు భార్యకు అగ్రిగోల్డు యాజమాన్యం  14 ఎకరాల భూమిని విక్రయించిందని అభియోగం మోపుతూ తెలంగణ అగ్రిగోల్డ్ కస్టమర్లు - ఏజెంట్ల సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సంఘం అధ్యక్షుడు ఏ రమేష్ బాబు దాఖలు చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య పి వెంకాయమ్మకు ఈ భూమిని పది కోట్ల రూపాయలకు అగ్రిగోల్డ్ యాజమాన్యం విక్రయించిందని పిటిషన్ లో ఆరోపించారు. ఈ సొమ్మును రికవరీ చేసి డిపాజిట్ చేయించాలని ఈ ఉదంతంపై విచారణ చేయించాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ విషయమై విచారించి రెండు వారాల్లో నిర్ణయం తెలియజేస్తామని హైకోర్టు తెలిపింది. కాగా అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఆస్తులను వేలం వేసే ప్రక్రియను ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే - జస్టిస్ ఎస్ వి భట్ విచారించారు.

అయితే... పేరుకు ఇది మంత్రి భార్యతో జరిగిన కొనుగోలే అయినా ఇందులో మంత్రి హ్యాండు లేకుండా ఇదంతా జరగదని అంతా అంటున్నారు. అయితే... ఇది కొన్నారా.. కొట్టేశారా అన్న సందేహాలు కూడా పలువురు వ్యక్తంచేస్తున్నారు.
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment