తాజా వార్తలు

Thursday, 8 October 2015

స్వెత్లానాకు సాహిత్యరంగంలోనోబెల్ పురస్కారం

రచయిత్రి స్వెత్లానా అలెక్సీవిచ్‌కు అత్యున్నత గౌరవం దక్కింది. 2015 సంవత్సరానికి సాహిత్యరంగంలో ఆమెకు నోబెల్ బహుమతి లభించింది. రెండో ప్రపంచయుద్ధం, సోవియట్ యూనియన్ పతనాలపై బాధితుల కోణంలో రచనలు చేసిన 67 ఏండ్ల బెలారస్ జాతీయురాలు స్వెత్లానాను నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ గురువారం ప్రకటించింది. ఈ అవార్డు కింద స్వెత్లానాకు రూ.5,79,50,000 నగదు బహుమతి లభిస్తుంది. నోబెల్ అవార్డు వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10న ఆమెకు బహుమతి ప్రదానం చేయనున్నారు. స్వెత్లానా అలెక్సీరోవ్నా అలెక్సీవిచ్ సోవియట్ యూనియన్‌లోని ఉక్రెయిన్ ఎస్‌ఎస్‌ఆర్‌లోగల స్టానిస్లావ్‌లో మే 31, 1948న జన్మించారు. వృత్తిరీత్యా జర్నలిస్టు అయిన ఆమె బాల్యం రెండో ప్రపంచ యుద్ధం మిగిల్చిన భయానక వాతావరణంలో గడిచింది. అందువల్లనే ఆమె జర్నలిస్టుగా యుద్ధ బాధితుల వెతలను ప్రపంచానికి చూపించటమే లక్ష్యంగా పనిచేశారు. ముఖ్యంగా మహిళల దయనీయ పరిస్థితులే కథా వస్తువులుగా పలు పుస్తకాలు రాశారు. ఆమె ప్రధానంగా రష్యన్ భాషలోనే రచనలు చేశారు. చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం దుర్ఘటన, సోవియట్ యూనియన్ విచ్చిన్నానికి ముందు, ఆ తర్వాత పరిస్థితుల చుట్టే ప్రధానంగా ఆమె రచనలు సాగాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో 1985లో ఆమె రచించిన వార్స్ అన్‌వామింగ్‌లీ ఫేస్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యుద్ధ బాధిత మహిళలే తమ గోడును స్వయంగా వెల్లబోసుకొంటున్నట్లు ఫస్ట్ పర్సన్‌లో సాగే ఈ పుస్తకం అనేక భాషల్లోకి అనువాదమైంది.
« PREV
NEXT »

No comments

Post a Comment