తాజా వార్తలు

Tuesday, 6 October 2015

వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

 మలేరియా, ఉష్ణ మండల వ్యాధుల నివారణకు వైద్య రంగంలో చేసిన విశిష్ట పరిశోధనలకు గాను అమెరికా, జపాన్, చైనాలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. ఈ అవార్డులను స్టాక్‌హోమ్ నగరంలో నోబెల్ పురస్కార కమిటీకి సంబంధించిన న్యాయమూర్తులు సోమవారం ప్రకటించారు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో లక్షల మంది ప్రజలు పరాన్న జీవుల ద్వారా సంక్రమించే రివర్ బ్లెండ్‌నెస్ , లింఫాటిక్ ఫైలారియాసిస్ అనే రెండు వ్యాధుల నివారణకు అవెర్‌మెక్టిన్ అనే ఔషధాన్ని కాంప్‌బెల్, ఒమురా.. మలేరియా సంబంధిత మరణాలను తగ్గించేందుకు అర్టెమిసినిన్ అనే హెర్బల్ ఔషధాన్ని యూయూ టూ కనుగొన్నారు. ఐర్లాండ్‌లో జన్మించి.. 1962లో అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించిన విలియం క్యాంప్‌బెల్, జపాన్‌కు చెందిన సతోషి ఒమురా, చైనాకు చెందిన యూయూ టూ శాస్త్రవేత్తలను ఈ నోబెల్ పురస్కారానికి నోబెల్ కమిటీ సంయుక్త విజేతలుగా ప్రకటించింది. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్థంతి డిసెంబర్ 10న విజేతలకు బహుమతిని అందజేస్తారు. నోబెల్ పురస్కారానికి ఎంపికైన కాంప్‌బెల్ న్యూజెర్సీలోని మాడిసన్‌లో ఉన్న డ్రూ యూనివర్సిటీలో గౌరవ పరిశోధకుడిగా కొనసాగుతున్నారు. మెర్క్ అనే ఫార్మాసూటికల్ కంపెనీలో 33 ఏండ్లు సేవలందించి.. రిటైరైన ఆయన ప్రస్తుతం మసాచుస్సెట్స్‌లోని నార్త్ అండోవర్‌లో నివసిస్తున్నారు. ఒమురా జపాన్‌లోని కిటాసాటో యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. యూయూ టూ చైనా అకాడమీకి చెందిన ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ సంస్థలో చీఫ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. చైనా దేశానికి వైద్యరంగంలో నోబెల్ పురస్కారం లభించడం ఇదే తొలిసారి. 
« PREV
NEXT »

No comments

Post a Comment