తాజా వార్తలు

Sunday, 4 October 2015

తెలుగుదేశం పార్టీలో నందమూరి వారసుల కి సీన్ లేదా...???తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా మారింది. ఇది శుభపరిణామమే. ఒక ప్రాంతీయ పార్టీ ముప్పయ్ ఏళ్లకు పైగా రాజకీయాల్లో నిలదొక్కుకోవడం, సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం, జాతీయ పార్టీగా ఎదగడం....ఇది విస్మరించరాని చరిత్ర. ఉమ్మడి తెలుగు రాష్ర్టంలో టీడీపీది ఘనమైన చరిత్ర. దీనికంతటికీ ఆద్యుడు ఎన్టీరామారావు. ఆ చరిత్రను ముందుకు  తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాష్ర్టం విడిపోయాక అవశేష  ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ తొలిసారిగా అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం దాని ఘనమైన చరిత్రే.
ఇంత ఘనమైన చరిత్రలో నందమూరి ఎన్టీరామారావు వారసులు ఘనంగా వెలగలేకపోయారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని అందుకోలేకపోయారు. ఎన్టీఆర్ వారసత్వమంటే రాజకీయాల్లో  కాదు. తెలుగుదేశం పార్టీలో అని అర్థం. రాజకీయ వారసత్వ పరంగా చూస్తే హరికృష్ణ, బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. భవిష్యత్తులోనూ రాజకీయాల్లో కొనసాగగలిగితే వీరు మాత్రమే కొనసాగుతారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా? వస్తే రాణిస్తాడా? అనేది చెప్పలేం. పురంధేశ్వరి టీడీపీ గడప తొక్కలేదు కాబట్టి ఆమె గురించి ప్రస్తావించనక్కర్లేదు. మిగిలింది హరికృష్ణ, బాలకృష్ణ.
ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ
హరికృష్ణ టీడీపీలో రాణిస్తాడని మొదటి నుంచి ఎవ్వరూ విశ్వసించలేదు. తండ్రి ఎన్టీఆర్‌కే లేదు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తన వారసుడు బాలకృష్ణేనని ఆయన ఏనాడో ప్రకటించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రభ వెలిగిస్తున్న రోజుల్లోనే చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన ఓ బహిరంగ సభలో ‘నా రాజకీయ వారసుడు బాలకృష్ణ’ అని  ప్రకటించారు సినిమాల్లో తండ్రికి వారసుడిగా ఎదిగిన బాలయ్య చాలా ఆలస్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ‘నువ్వు ఎక్కాల్సిన రైలు ఓ జీవిత కాలం లేటు’ అన్న చందంగా ఆయన గత ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టే నాటికి టీడీపీ నారా వంశం చేతుల్లోకి  పూర్తిగా వెళ్లిపోయింది. ఆయన మేనల్లుడు కమ్ అల్లుడు టీడీపీలో ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లుగా ఎదిగిపోయాడు.
ఎన్టీఆర్ నుంచి టీడీపీ సామ్రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు దాన్ని జాగ్రత్తగా కుమారుడికి అప్పగించారు. టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీల్లో నందమూరి వంశం నామమాత్రమైన సంగతి, చంద్రబాబు కుమారుడు లోకేష్ సమున్నతంగా ఎదిగిపోయిన సంగతి స్పష్టంగా కనబడుతోంది. లోకేష్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడు కావడమే కాకుండా పొలిట్‌బ్యూరోలో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా కూడా నియమితులయ్యారు. లోకేష్ మేనమామ కమ్ మామగారు కమ్ హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలయ్యకు ఏ కమిటీలోనూ స్థానం ఇవ్వలేదు. మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన కొందరికి కమిటీల్లో చోటు ఇచ్చిన బాబు బాలయ్యకు మొండిచేయి చూపించారు.
ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు చేయించిన సర్వేలో బాలయ్యకు ఏడో ర్యాంకు వచ్చింది. పనితీరులో చంద్రబాబు కంటే ముందే (చంద్రబాబుది 9వ ర్యాంకు) ఉన్నారు. అయినప్పటికీ కమిటీల్లోకి తీసుకోలేదు. బాలయ్య సగం సమయాన్ని సినిమాలకు కేటాయిస్తున్నాడు కాబట్టి దాన్ని అనర్హతగా పరిగణించారా? లేదా బాలయ్యే తిరస్కరించాడా? అనేది తెలియరాలేదు. బాలయ్య దృష్టి ప్రస్తుతం వంద సినిమాల మైలురాయిని చేరుకోవడం మీదనే ఉంది కాబట్టి కమిటీల్లో సభ్యత్వం ఆయనకు ముఖ్యం కాకపోవచ్చేమో.
వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్న నాయకులు 
రాష్ర్టం ఉమ్మడిగా ఉన్నప్పుడు టీడీపీలో బాలయ్య స్థానం ఏమిటో చెప్పాలని కొందరు బాబును నిలదీశారు.  ఆయన్ని వర్కింగ్ అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు.  రాష్ర్టం విడిపోయిన తరువాత  టీడీపీని జాతీయ పార్టీగా మారుస్తానని బాబు ప్రకటించాడు.. అందకని బాలయ్యను వర్కింగ్ అధ్యక్షుడిగా నియమించాలని ఆయన అభిమానులు కోరారు. 2009 ఎన్నికల్లోనే మెగాస్టార్ చిరంజీవిపై బాలయ్య పోటీ చేస్తాడనే ప్రచారం జోరుగా సాగింది. కాని ఎన్నికల ప్రచారంతో సరిపెట్టాడు. ఆ తరువాత పార్టీలో కీలక బాధ్యతలు చేపడతాడని ప్రచారం జరిగింది. ఒక దశలో బాలయ్యకు రాష్ర్టం బాధ్యతలు అప్పగించి చంద్రబాబును ఢిల్లీకి పంపి జాతీయ రాజకీయాలకు పరిమితం చేయాలని నాయకులు తీవ్రంగా ఆలోచించారు.
అవసరమైతే ఇందుకోసం పార్టీని చీలుస్తామని కూడా కొందరు నాయకులు తెగించి చెప్పారని అప్పట్లో వార్తలు వచ్చాయి.  కాని..బాబు ఏదోవిధంగా మేనేజ్ చేసి బాలయ్యను నిలువరించారు. ఆ తరువాతే లోకేష్ ఎదుగుదల ప్రారంభమైంది. గత ఎన్నికల్లో బాలయ్య పోటీ చేసే విషయంలోనూ కొంత కాలం ఉత్కంఠ కొనసాగింది. బాలయ్యను పోటీ చేయించరేమోననే అనుమానం కూడా అభిమానుల్లో కలిగింది. ఆందోళనకు కూడా సిద్ధమయ్యారు. ఎట్టేకలకు చాలామందికి టిక్కెట్లు ఖరారు చేసిన తరువాత బాలయ్యకు హిందూపురం స్థానం ఖరారు చేశారు.
అయిష్టంగానే హరికి పొలిట్‌బ్యూరో సభ్యత్వం
హరి కృష్ణకు పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించారు. ఉమ్మడి రాష్ర్టంలోనూ ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. అయితే ఇప్పుడు జాతీయ పార్టీగా మారిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన పొలిట్‌బ్యూరోలో హరికృష్ణకు స్థానం ఇవ్వడం బాబుకు ఇష్టం లేదని, అయిష్టంగానే ఇచ్చారని సమాచారం. చంద్రబాబుహరికృష్ణ మధ్య సత్సంబంధాలు లేని నేపథ్యంలో హరికి పొలిట్‌బ్యూరో సభ్యత్వం ఇవ్వడం విశేషమేనని ఓ పత్రిక రాసింది. వీరిమధ్య సత్సంబంధాలు లేని మాట నిజమే. అయితే నందమూరి వారసుల నుంచి ఎవరో ఒకరికి కీలక కమిటీలో స్థానం ఇవ్వకపోతే బాబు మీద విమర్శలు వచ్చేవి. నందమూరి వారసులను ఎదగనీయకుండా చేశారని బాబు మీద ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. బాలయ్యకు స్థానం ఇవ్వలేదు కాబట్టి హరికృష్ణకు ఇచ్చారు.
ఒకప్పుడు సొంత కుంపటి పెట్టుకొని చంద్రబాబు నాయుడితో ఢీకొన్న హరికృష్ణ తానే బొక్కబోర్లాపడి, తరువాత రాజీపడి ఏదో విధంగా రాజ్యసభ స్థానం దక్కించుకొని  రాష్ర్ట విభజన ప్రకటన రాకముందువరకు నిశ్చింతగా కాలం గడిపాడు. ఓ పక్క బాబుపై మధ్య మధ్య అలుగుతూనే, అంటీముట్టనట్లుగా ఉంటూనే, ధిక్కార స్వరం వినిపించాలని ప్రయత్నిస్తూనే, పార్టీలో తనకు, కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బాధపడుతూనే కాలం గడిపాడు. ఈ నేపథ్యంలో తానేమిటో నిరూపించుకోవడానికి సమైక్యాంధ్ర ఉద్యమం కళ్ల ఎదురుగా కనిపించింది. ఓ పక్క  రాష్ర్ట విభజనకు కట్టుబడి ఉన్నానని చెబుతూ, మరో పక్క సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చూసి బెంబేలెత్తాడు బాబు. ఆయన విభజన పాట పాడుతుండగా, నాయకులు, కార్యకర్తలు సీమాంధ్రకు అన్యాయం జరిగిందనే పేరుతో సమైక్యవాదం వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని నిర్ణయించుకున్న హరికృష్ణ తానూ  సమైక్య రాగం అందుకున్నాడు.
విభజన ప్రకటన రాగానే పార్టీ నిర్ణయానికి  కట్టుబడి విభజనను బాధతోనే అంగీకరిస్తున్నానని చెప్పిన హరికృష్ణ  సీమాంధ్రకు అన్యాయం జరగకుండా చూడాలని అన్నాడు. ఆ తరువాత మారిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ప్రజల భావోద్వేగాలు గమనించి పార్టీ నిర్ణయాన్ని కాదని సమైక్యగానం ఆలపించాడు.  మళ్లీ చైతన్యం రథం ఎక్కి రాష్ర్ట వ్యాప్తంగా సమైక్యవాదం వినిపిస్తానని ప్రతిన బూనాడు.  ముహూర్తం నిర్ణయించుకున్నాడు.కాని తరువాత జాడ లేకుండా పోయాడు. మళ్లీ  ఇప్పుడు పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు. ఏది ఏమైనా టీడీపీలో భవిష్యత్తు నారా లోకేష్‌దే. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావొచ్చు. టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించిన తరువాత ఓ పత్రిక ‘వారసుడొచ్చాడు’ అనే శీర్షికతో లోకేష్‌పై కథనం రాసింది. దీన్ని బట్టే తెలుస్తోంది నందమూరి వంశం నామమాత్రమేనని.
Special Bureau Report
« PREV
NEXT »

No comments

Post a Comment