Writen by
vaartha visheshalu
21:34
-
0
Comments
కోళ్ల పరిశ్రమ మళ్లీ సంక్షోభంలో పడింది. సరఫరా అమాంతం పెరిగి పోవడంతో చికెన్‌తో పాటు గుడ్ల ధర పడిపోయింది. కిలో కంది పప్పు రూ.200 పలుకుతుండగా.. గత వారం హైదరాబాద్ మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర ఒక దశలో రూ.96 కు పడిపోయింది. ప్రస్తుతం కిలో రూ.110కి చేరినా, అది నిలబడుతుందో లేదోనని పరిశ్రమ వర్గాలు భయపడుతున్నాయి. రైతులకు లభించే ఫారమ్ గేటు ధర సైతం కిలో బ్రాయిలర్ కోడికి తెలుగు రాష్ట్రాల్లో రూ.60 మించడం లేదు. ఒక్క నెల్లూరు జోన్లో మాత్రమే ఆదివారం కిలో కోడికి రైతుకు రూ.60 లభించింది. గత వారం చిత్తూరు జిల్లాలో ఒక దశలో కిలో బ్రాయిలర్ కోడి ధర రూ.43కు పడిపోయింది. వైజాగ్ ప్రాంతంలో సైతం కిలోకు రూ.50కి మించి లభించడం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల సైతం ఇదే పరిస్థితి. దీంతో కిలో బ్రాయిలర్ కోడిపై రూ.25 వరకు నష్టపోతున్నట్టు తెలంగాణ పౌల్ర్టీ బ్రీడర్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి చెప్పారు.
గుడ్ల కోసం లేయర్ కోళ్లు పెంచే రైతుల పరిస్థితి ఇలానే ఉంది. ఒక్కో గుడ్డుకు రూ.3.5 లభిస్తే తప్ప గిట్టుబాటు కాదు. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల రైతులకు ఒక్కో గుడ్డుకు రూ.2.80 నుంచి రూ.2.90కి మించి లభించడం లేదని జాతీయ గుడ్ల సమన్వయ సంఘం (నెక్) జాతీయ ఉపాధ్యక్షుడు కె సుబ్బరాజు చెప్పారు. మళ్లీ అందులో 25 పైసల వరకు కమిషన్‌గా కోత పెడుతున్నారని తెలంగాణ పౌల్ర్టీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రావణ మాసం, ఆ తర్వాత వచ్చిన పుణ్య తిధులతో చికెన్, గుడ్ల అమ్మకాలు బాగా తగ్గాయి. రైతులు కూడా అప్పట్లో ధర తక్కువగా ఉందని బ్రాయిలర్ కోళ్లు అమ్మేందుకు ఇష్టపడలేదు. ఆ బ్రాయిలర్ కోళ్లన్నీ ఇపుడు మార్కెట్‌కు వస్తున్నాయి. సాధారణంగా ఒక బ్రాయిలర్ కోడి 40 రోజుల్లో రెండు కిలోలకు పెరుగుతుంది. ఇపుడు అదే కోడి మూడు కిలోలకు పెరిగి మార్కెట్‌కు రావడంతో సరఫరా ఒక్కసారిగా 50 శాతం పెరిగి పోయి ధరలు పడిపోయా యని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అధిక సరఫరాతో దసరా వరకు పౌలీ్ట్ర పరిశ్రమకు ఈ కష్టాలు తప్పక పోవచ్చని స్నేహ పౌల్ర్టీ ఫార్మ్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాంరెడ్డి చెప్పారు.
చికెన్, గుడ్ల ధర పడిపోతుంటే దాణా ధర మాత్రం పెరిగిపోతోంది. గత ఏడాది కిలో రూ.28 ఉన్న సోయా ధర ఇపుడు రూ.38కి చేరింది. దాణా తయారీలో ఉపయోగించే మరో ప్రధాన ముడి పదార్ధం మొక్కజొన్న ధర సైతం క్వింటా రూ.1,500కు చేరింది. నూనె తీసిన చెక్క ధర సైతం టన్ను రూ.48,000 నుంచి రూ.50,000 పలుకుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
News Desk
No comments
Post a Comment