తాజా వార్తలు

Wednesday, 7 October 2015

" 'చిన్నమ్మా' VSచంద్రబాబు"నందమూరి కుటుంబంలో 'చిన్నమ్మా' అని పురంధరీశ్వరిని పిలుస్తారట. ఆమె కాంగ్రెస్‌ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయింది. 'రాష్ట్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోనివ్వం..' అని చెప్పిన 'సమైక్య వీర' బ్యాచ్‌లో పురంధరీశ్వరి కూడా ఒకరు. కేంద్ర మంత్రి పదవి పోయాక, కాంగ్రెస్‌ దేశంలో ఓడిపోయాక, పురంధరీశ్వరి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే.
కాంగ్రెస్‌లో వున్నా, బీజేపీలో వున్నా పురంధరీశ్వరికి, టీడీపీ అధినేత చంద్రబాబుతో రాజకీయ వైరం అలానే కొనసాగుతోంది. వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబుని ఇరకాటంలో పడేయడమెలా? అని ఆలోచిస్తుంటారామె. దానికి ప్రదాన కారణం స్వర్గీయ ఎన్టీఆర్‌ని గద్దె దించే క్రమంలో, చంద్రబాబుతోపాటు తన భర్త కూడా ప్రముఖ పాత్ర పోషించినా, టీడీపీ పగ్గాలు మాత్రం చంద్రబాబుకే చిక్కాయి. అదీ అసలు విషయం. సరే, ఆ కుటుంబ విషయాలు పక్కన పెట్టేద్దాం.
అసలు విషయానికొస్తే, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రానికి చంద్రబాబు సరైన వివరణలు ఇవ్వడంలేదట. అందుకని, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎలాంటి ముందడుగూ వేయలేకపోతోందట. ఇదీ పురంధరీశ్వరిగారి వాదన. అయినా పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా వచ్చాక, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నివేదికలతో కేంద్రానికి ఏం సంబంధం.? పోనీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నివేదికలు ఇవ్వాల్సి వున్నా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా గురించి ఇచ్చిన నివేదికల్నే లెక్కచేయని కేంద్రం, పోలవరంపై చంద్రబాబు నివేదికలు ఇస్తే పట్టించుకుంటుందని ఎలా అనుకోగలం.!
అన్నట్టు, కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ మేలు చేస్తుందట, అంత గొప్ప ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందట. మాజీ కేంద్ర మంత్రి పురంధరీశ్వరి సెలవిచ్చారు. ఆ మాట ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబితేనే దిక్కులేని పరిస్థితి. 15 నెలలు గడిచిపోయింది ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయి. అప్పటినుంచీ ఇప్పటిదాకా చేయలేని సాయం, కేంద్రం ఇప్పుడేదో చేసేస్తుందని పురంధరీశ్వరి, నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తే నమ్మేలా వుందా ఏమన్నా.?
పోలవరం ప్రాజెక్టు అయినా, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అయినా, ప్రత్యేక రైల్వే జోన్‌ అయినా.. రాజధానికి నిధులు అయినా.. ఇవన్నీ కేంద్రం బాధ్యతలు. ఇవేమీ ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం విదిల్చే బిక్ష అసలే కాదు. ఎక్కువ సాయం చేసేస్తున్నాం.. అనడానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం ఏమీ కేంద్రాన్ని దేబిరించడంలేదు. అవన్నీ ఆంధ్రప్రదేశ్‌కి విభజన కారణంగా సంక్రమించిన హక్కులు. వాటిని కాపాడలేకపోతే, చరిత్ర క్షమించదు.!
News Desk-AP
« PREV
NEXT »

No comments

Post a Comment