తాజా వార్తలు

Wednesday, 21 October 2015

'రాజగురువు' పవర్‌ అన్ని రాజకీయ పార్టీలకూ సెంటర్‌....!మీడియా మొఘల్‌ పవర్‌ సెంటర్‌గా మారుతున్నారు. కొన్నాళ్ళ క్రితం కేసీఆర్‌, మొన్నీమధ్యనే జగన్‌, ఇటీవలే నారా చంద్రబాబునాయుడు, తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌.. 'రాజగురువు'తో రాజకీయ మంతనాలు చేపట్టడంతో, తెలుగు నాట రాజకీయాల్లో 'రాజగురువు' పవర్‌ సెంటర్‌గా మారిపోయారన్న వాదనలకు బలం చేకూరుతోంది. 
తెలుగుదేశం పార్టీ స్థాపన, ఆ పార్టీ ఎదుగుదలలో రాజగురువు పాత్ర అంతా ఇంతా కాదు. ఆ కారణంగానే టీడీపీయేతర పార్టీలకు రాజగురువు అంటే ఒకింత ఒళ్ళు మంట. ఆ మంటని కాంగ్రెస్‌ హయాంలో గట్టిగానే చూపారు కూడా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా రాజగురువు ఆర్థిక మూలాలపై 'యుద్ధం' ప్రకటించారు. ఆ సమయంలో రాజగురువు వర్సెస్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. ఈ యుద్ధం అందర్నీ విస్మయానికి గురిచేసింది. 
అంతకన్నా విస్మయం కలిగించే విషయం, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌, రాజగురువుతో రాజకీయ మంతనాలు నడపడం. 'ఆయన్ను కలిస్తే తప్పేంటి.?' అంటూ వైఎస్‌ జగన్‌, రాజగురువుని కలవడాన్ని వైఎస్సార్సీపీ నేతలు సమర్థించుకున్నారు కూడా. ఇక, తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆంధ్రోళ్ళపై చేసిన విమర్శల క్రమంలో రాజగురువుకు చెందిన భూములను లక్ష నాగళ్ళతో దున్నేసి లాగేసుకుంటామని కేసీఆర్‌ చెప్పారు. కానీ, అదే కేసీఆర్‌.. రాజగురువు వద్దకు వెళ్ళి రాజకీయ మంతనాలు చేపట్టడమే కాదు, రాజగురువుని కీర్తించేశారు. 
ఇక, చంద్రబాబు సంగతి సరే సరి. అమరావతి శంకుస్థాపనకు హాజరు కావాల్సిందిగా స్వయానా రాజగురువుని ఆహ్వానించేందుకు హెలికాప్టర్‌లో వెళ్ళి వచ్చారు. ఇప్పుడేమో దిగ్విజయ్‌సింగ్‌, రాజగురువుతో రాజకీయ మంతనాలు జరపడమేంటో ఎవరికీ అర్థం కావడంలేదు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల నేర్పరితనం రాజగురువు సొంతం. తెలుగు రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఎలా బలపడాలో తగు సూచనలు ఇచ్చే స్థాయికి రాజగురువు ఎదగబట్టే, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆయన చుట్టూ చక్కర్లు కొడ్తున్నారనుకోవాలేమో.! 
మొత్తమ్మీద, రాజకీయాలతో సంబంధం లేదని ఆయనగారు చెబుతున్నా, అన్ని రాజకీయ పార్టీలకూ పవర్‌ సెంటర్‌గా 'రాజగురువు'గా కీర్తింపబడ్తున్నారంటే, ఆయన తెలివితేటలకి హేట్సాఫ్‌ అనాల్సిందే ఎవరైనా.!
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment