Writen by
vaartha visheshalu
00:35
-
0
Comments
మీడియా మొఘల్ అయనకి గొప్ప పేరుంది..
రాజకీయాలపైనా తనకున్న అవగాహన అంతా ఇంతా కాదు..
కేవలం అవగాహన మాత్రమే కాదు, రాజకీయాల్లో ఆయనకున్న పరిచయాలు ప్రత్యేకం..
రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయ నాయకులతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు మరీ ప్రత్యేకం..
తెలుగునాట రాజకీయాల్లో ఆయన్ను కింగ్ మేకర్ అనేవారూ లేకపోలేదు..
సింపుల్‌గా ఆయన్ని చాలామంది 'రాజగురువు' అని పిలుస్తుంటారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయ రంగ ప్రవేశం, రాజకీయంగా ఎన్టీఆర్ ఎదుగుదల.. ఇవన్నీ ఆ రాజగురువు కనుసన్నల్లోనే జరిగాయన్న భావన ఇప్పటికీ చాలామందిలో వుంది. తెలుగుదేశం పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ ఆయనే రాజగురువు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమవడంలోనూ ఆ రాజగురువు పాత్రని ఎవరూ కాదనలేరు. ఇప్పుడాయన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. గుసగుసలు కావివి నూటికి నూరుపాళ్ళూ నిజం.
అందరికీ అయినవాడే.!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎటూ ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం, ఆయన వద్దకు వెళ్ళి వచ్చారు. ఆ భేటీకి కారణాలు ఇవీ.. అంటూ సమర్థనలు తెరపైకొచ్చినా, 'రాజగువురు' ఆశీర్వాదం కోసమే కేసీఆర్, రాజగురువు వద్దకు వెళ్ళారన్నది ఓపెన్ సీక్రెట్. సదరు రాజగురువు కూడా తన అవసరాల కోసం కేసీఆర్‌తో సఖ్యత కోసం ప్రయత్నించారన్నది ఇంకో వెర్షన్. ఇక, ఇటీవలి ఓ సంఘటన, మొత్తం రాజకీయ వ్యవస్తే షాక్‌కి గురయ్యేలా చేసింది. అదే ఆ రాజగురువును, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కలవడం. పొద్దున్న లేస్తే, రాజగురువునీ, ఆయన సారధ్యంలో నడుస్తోన్న మీడియానీ ఏకిపారేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రాజకీయ నాయకుల్లో ప్రముఖుడు వైఎస్ జగన్. అలాంటి వైఎస్ జగన్, 'రాజగురువు'ని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళడం చర్చనీయాంశం కాకుండా ఎలా వుంటుంది.?
అవసరం అందరిదీ
వైఎస్ జగన్ ఎపిసోడ్ తర్వాత, రాజకీయాల్లో ఆ 'రాజగురువు' మరింత హాట్ టాపిక్‌గా మారారు. వివిధ రాజకీయ పార్టీల్లో జరుగుతున్న విషయాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం 'రాజగురువు' దినచర్యలో భాగం. అవకాశం వున్నప్పుడల్లా రాజకీయాల్ని తన కనుసన్నల్లోనే నడిచేలా చేసుకోవాలని ఆయనగారు అనుకుంటుంటారనే ప్రచారం వుండనే వుంది. అందుకేనేమో, రాజగురువు వద్దకు రాజకీయ నాయకులు క్యూ కడ్తుంటారు. ఆ క్యూ ఈ మధ్యన బాగా పెరిగిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు పార్టీలకు చెందిన నేతలు 'రాజగురువు' అపాయింట్మెంట్ కోసం క్యూ కట్టేయాల్సి వస్తోంది మరి. అయితే, రాజగురువు అప్పాయింట్మెంట్ అంత తేలిక కాదు కదా. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకన్నా రాజగురువు అప్పాయింట్మెంట్ కష్టమైపోయిందంటూ ఊహాగానాలు ఆయా రాష్ట్రాల్లో ప్రముఖంగా విన్పిస్తున్నాయంటేనే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.
నిజంగానే రాజగురువు చుట్టూ రాజకీయ నాయకులు ప్రదక్షిణలు చేస్తున్నారా.? లేదంటే, ఇదంతా రాజగురువు ఇమేజ్ పెంచడానికి జరుగుతోన్న ప్రయత్నమా.? అన్న అనుమానాలూ విన్పిస్తున్నాయి. వైఎస్ జగన్ మద్దతుదారులు నిన్న మొన్నటిదాకా రాజగురువు పేరెత్తితే చాలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా నెగెటివ్ కామెంట్స్ పోస్ట్ చేశారు. అయితే ఆ 'దాడి' ఇప్పుడు కాస్త తగ్గింది. కాస్త వెనక్కి వెళితే, తెలంగాణ ఉద్యమ సమయంలో రాజగురువుపై రాజకీయ నాయకులు చాలా విమర్శలు చేశారు. దున్నేస్తాం.. తరిమేస్తాం.. అన్నవాళ్ళే ఇప్పుడు, ఆయన కీర్తి ప్రతిష్టల్నీ, ఆయన చేస్తోన్న 'సేవ'నీ, ఆయన బ్రాండ్ ఇమేజ్‌నీ వేనోళ్ళ పొగిడేస్తున్నారు. దాంతో, సదరు నేతల ఫాలోవర్స్లోనూ మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. ఇవన్నీ దేనికి సంకేతాలనుకోవాలి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ అవసరముండదు.
ఈ మార్పు ఊహించనిది
అదే మరి రాజగురువు అంటే. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు రాజగురువు చుట్టూ తిరగడం మాటెలా వున్నా, ఒకప్పుడు కొందరికి అస్సలేమాత్రం పడని వ్యక్తిగా వున్న ఆ రాజగురువుగారు.. ఇప్పుడు అందరికీ అయినవాడైపోయారు. ఇదీ అసలు సిసలు రాజకీయ సిత్రం అంటే. తన వద్దకు వస్తున్న నాయకులకు తగిన సలహాలు ఇస్తూ, తను చక్కబెట్టాల్సిన పనులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేసుకుంటూ.. ఇబ్బందుల్లో ఇరుక్కుపోవాల్సి వస్తే, ఆయా నేతల సహకారంతో గట్టెక్కేస్తూ.. ఇలా రాజగురువు రోజురోజుకీ మరింత బలోపేతమవుతున్నారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ప్రస్తుతానికి ఆయన 'కింగ్ మేకర్'గా పబ్లిక్‌లో పాపులారిటీ సంపాదించేసుకున్నారు. కాదు కాదు, ఆ పబ్లిసిటీ, పాపులారిటీని నేతలే 'రాజగురువు'కి కల్పించేశారు. ఇంతలా రాజగురువు బలోపేతమయ్యాక, ఆయన చుట్టూ రాజకీయ నాయకులు ప్రదక్షిణలు చేయకుండా వుంటారా.? అంటే ఎందుకు చేయరూ.. ఆయన అన్ని పార్టీలకూ సన్నిహితుడయిపోయిన తర్వాత.!
News Desk
No comments
Post a Comment