తాజా వార్తలు

Tuesday, 6 October 2015

రామోజీ ఏమి చేస్తావయ్యా జ‌గ‌న్‌ క‌వ‌రేజీ .......???ఇద్దరు ప్రముఖుల క‌ల‌యిక వార్త. అదే ఇద్దరు ప్రత్యర్ధులైన‌ ప్రముఖులు క‌ల‌వ‌డం సంచ‌ల‌నం. అణువ‌ణువూ నింపుకున్న కాంగ్రెస్ వ్యతిరేక‌త‌ను ఆ త‌ర్వాత వైఎస్ అనే రెండ‌క్షరాల‌కు ప‌రిమితం చేసిన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, వ్యక్తిగ‌త వైరం లేకపోయినా వార‌స‌త్వంగా వ‌చ్చిన "వార్‌"త‌త్వంతో వైఎస్ జ‌గ‌న్‌లు గ‌త కొంత కాలంగా క‌లం తోడుగా క‌త్తులు దూసుకుని, కొన్నేళ్ల తర్వాత అనూహ్యంగా క‌లిశారు. రాజ‌కీయాల్లో, మీడియా రంగంలో పెద్ద చ‌ర్చకు తెర‌తీశారు.
వీరి క‌ల‌యిక గురించి ర‌క‌ర‌కాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అదిగో పులి అంటే ఇదిగో తోకని మాత్రమే కాదు దానికో వంక‌ర కూడా సృష్టించేంత ప‌వ‌ర్‌ఫుల్ క్రియేట‌ర్ల ఊహాగానాల్లో ఒక‌టి ఇలా జ‌గ‌న్‌-రామోజీ క‌ల‌వ‌గానే జ‌గ‌న్‌కు సంబంధించిన వార్తల క‌వ‌రేజీ అలా ఈనాడులో అమాంతం పెరిగిపోయింద‌ని.
నిజానికి ఈనాడు నైజం బాగా తెలిసిన వారెవ‌రైనా అంత త్వర‌గా క‌వ‌రేజీ విష‌యంలో ఈనాడు మార్పు చేర్పుల‌కు దిగ‌ద‌ని ఈజీగా చెప్పగ‌ల‌రు. కాక‌పోతే త‌మ యాజ‌మాన్యం జ‌గ‌న్ ను క‌ల‌వ‌డాన్ని బ‌ట్టి, ఎడిటింగ్ ప‌రంగా సిబ్బంది జ‌గ‌న్ వార్తలకు ఏవైనా కాసింత‌ వెసులుబాటు క‌ల్పిస్తే క‌ల్పిస్తుండొచ్చు. దాన్ని యాజ‌మాన్యం గ‌తంలో అంత సీరియ‌స్‌గా తీసుకోక‌పోయి ఉండొచ్చు.
అంత మాత్రాన  పూర్తిగా ఈనాడు త‌న రూటు మార్చేసుకుంద‌ని చెప్పడం తొంద‌ర‌పాటే అవుతుంది. గ‌తంలో దాస‌రి, ఉండ‌వ‌ల్లి, ల‌క్ష్మీపార్వతి... ఇలాంటి ప్రముఖులు ఎంద‌రినో బ్యాన్ చేసి త‌మ మీడియా ప‌వ‌ర్‌ను ఈనాడు ఎలా, ఎంత‌కాలం చూపించుకుందో అంద‌రికీ తెలిసిందే.
అదీగాక రామోజీ-జ‌గ‌న్‌ క‌ల‌యిక అనంతరం జ‌గ‌న్  చెప్పుకోద‌గిన కార్యక్రమం ఏదీ చేప‌ట్టని నేప‌ధ్యంలో నిజంగానే జ‌గ‌న్‌పై ఈనాడు వైఖ‌రి మారిందో లేదో తేల‌డానికి, ఈ రాజీలో క‌వ‌రేజీ సైతం భాగ‌మేనా కాదా అనేది నిరూప‌ణ కావ‌డానికి ఈ రొజు నుంచి గుంటూరులో ప్రత్యేక‌హోదాపై జ‌గ‌న్ చేప‌ట్టే దీక్ష నిద‌ర్శనం కానుంద‌ని ఆశించ‌వచ్చు.
ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన అత్యంత ప్రధాన స‌మ‌స్య ఇది. దీనిపై జ‌రిగే ఉద్యమ తీవ్రత కేంద్రం వ‌ర‌కూ తీసుకు వెళ్లవ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. అలా వెళ్లాలంటే మీడియా ప్రధాన పాత్ర పోషించ‌క త‌ప్పదు. అయితే ఎంత గొప్ప ప్రజా ప్రయోజ‌న‌క‌ర ఉద్యమం అయినా ఈనాడుకు త‌న స్వలాభం త‌ర్వాతే.
ఆ ప్రకారం చూస్తే  ఏదో దీక్ష ప్రారంభం అంటూ గ‌తంలోలా కాసిన్ని అక్షరాలు క‌నీ క‌న‌ప‌డకుండా ఫొటోల‌తో స‌రిపెట్టేయాలి. మ‌రింత వ‌ళ్లు మండితే దీక్షకు స్పంద‌న లేదంటూ కూడా అక్షర‌మాల‌లు అల్లేయాలి. అలా చేయ‌కుండా ఒక ప్రతిప‌క్షనేత‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చినా, రాష్ట్ర ప్రయోజ‌నాల రీత్యా ప్రత్యేక‌హోదా ఉద్యమానికి సముచిత మ‌ద్ధతు అందించినా అప్పుడు నిజంగానే క‌వ‌రేజీ ప‌రంగా రా(మో)జీ కుదిరిన‌ట్టే అనుకోవాలి.
నిజంగానే రాజీ మార్గంలో భాగంగా  జ‌గ‌న్‌ దీక్షకు త‌గినంత‌ ప్రాధాన్యత ఇవ్వడం అంటే బాబు అనే కొరివితో రామోజీ త‌ల గోక్కోవ‌డ‌మేన‌నేది కూడా తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో అటు త‌న రాత‌ల‌తో పీఠ‌మెక్కించిన  నేత  నొచ్చుకోకుండా, ఇటు కొత్తగా క‌లుపుకున్న చుట్టరికాన్ని పోగొట్టుకోకుండా సాగాల్సిన క్రమంలో ఈనాడు అధిప‌తికి ఇది తొలి ప‌రీక్షే.
News Desk-AP
« PREV
NEXT »

No comments

Post a Comment